రాజకీయ నాయకులపై విశ్వాసం కలిగేది వారికి ఉన్న పదవితో కాదు, వాళ్లు చేసే పనులతో. ముమ్మాటికీ ఇదే నిజమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). గత కొన్నేండ్లుగా అంతర్జాతీయంగా ఆయనకు లభిస్తున్న గౌరవమే అందుకు తార్కాణం.
ప్రపంచస్థాయి వేదికల నుంచి కేటీఆర్‌కు వరుసగా ఆహ్వానాలు అందుతున్నాయి. గ్లోబల్ ఫోరమ్‌లకు ఆహ్వానితుడిగా ఆయన ఎంపికవుతున్నారు. తద్వారా తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రపంచం ముందుంచే అవకాశాన్ని ఆయన తరచూ పొందుతున్నారు. ఆయన తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ రంగంలో ప్రపంచహబ్గా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలు, ఆసియా పర్యటనల ద్వారా కేటీఆర్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ కంపెనీలకు నూతన గమ్యంగా మార్చారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వంటి అంతర్జాతీయ సదసుల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. అంతేకాదు, తద్వారా దేశానికీ పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. అయితే, తాజాగా కేటీఆర్ మరో అంతర్జాతీయ ఆహ్వానాన్ని అందుకోవడం ముదావహం. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ‘ఆటోమొబైల్-ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్’ యూకేలోని వార్విక్ టెక్నాలజీ పార్క్‌లో ఏర్పాటుచేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించవలందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ నెల 30వ తేదీన ఆయన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ప్రముఖ కంపెనీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించనుండటం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గుర్తించిన పీడీఎస్ఎల్ తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నది. ఇదిలా ఉంటే, తెలంగాణకు చెందిన వ్యక్తికి ఈ గౌరవం దక్కడం రాష్ర్టానికి గర్వకారణం అని తెలంగాణవాదులు భావిస్తున్నారు. కేటీఆర్‌కు ఇటీవల మరో అంతర్జాతీయ గౌరవం లభించింది. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025’ సదస్సుకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ ఫోరమ్ యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతిపెద్ద వేదికగా గుర్తింపు పొందింది. కేటీఆర్ అనుభవాలు, ఆలోచనలు ఈ సదస్సులో పాల్గొనేవారికి ప్రేరణగా నిలుస్తాయని ఆక్ప్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి చెప్పడం విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. తెలంగాణలో నాయకత్వం మారింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఐటీ, పారిశ్రామికరంగాల్లో కేటీఆర్ చేసిన అవిరళ కృషికి గాను ఇప్పటికీ అంతర్జాతీయంగా ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇది ఆయన ప్రతిభకు, దూరదృష్టికి దక్కిన గౌరవంగానే భావించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది. ఐటీ, పరిశ్రమల శాఖలకు మంత్రులుఉన్నారు. అయినా వారిని కాదని, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు, పలు సంస్థలు కేటీఆర్‌ను విశ్వసించడం ఆయన పనితనానికి, నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనం. ఇలాంటి ఆహ్వానాలు అధికారంలో ఉన్నప్పుడు అందుకోవడం సర్వసాధారణమే. కానీ, అధికారంలో లేకున్నా ఆయా సంస్థలు కేటీఆర్ వాక్చాతుర్యాన్ని ప్రపంచ వేదికలపై వినాలనుకోవడం కేటీఆర్ ప్రతిభను తెలియజేస్తున్నది.
ప్రపంచ ఆర్థిక వేదిక, ఇతర గ్లోబల్ ఇండస్ట్రీ కార్యక్రమాలకు కేటీఆర్‌కు ఆహ్వానాలు రావడం… తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి చర్యలు ఇంకా గ్లోబల్ వ్యాపారవర్గాల్లో ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పేందుకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు.
ఇటీవల జెనీవా, లండన్, సింగపూర్ వంటి నగరాల్లో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. తెలంగాణ నమూనా గురించి ఆయా వేదికలపై కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై ఉన్న దృష్టిని విదేశీ పరిశ్రమలు గుర్తించాయి. అందుకే యూకేలోని ఈ ప్రఖ్యాత కంపెనీ తమ తాజా సంస్థ ప్రారంభోత్సవానికి కేటీఆర్‌ను ఆహ్వానించిందని చెప్పవచ్చు. అంతేకాదు, 2022 లోనూ స్విట్జర్లాండ్ డబ్ల్యూఈఎఫ్ సదస్సులో తెలంగాణ ప్రతినిధిగా కేటీఆర్ హాజరయ్యారు. ఆ వేదికగా కేటీఆర్ ప్రసంగంపై అంతర్జాతీయ మీడియా స్పందించింది. దీంతో వివిధ కంపెనీల ప్రతినిధులతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఒక నాయకునిలో ఉన్న గ్లోబల్ విజన్‌ను బయటపెట్టాయి.
కేటీఆర్‌ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, అభివృద్ధి కాముకుడిగా యావత్ ప్రపంచం చూస్తున్నది. అందుకే ఇలాంటి సదస్సులు కేటీఆర్‌ను ప్రత్యేకంగా చూస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఈ ఆహ్వానాల ద్వారా మరింత దృఢమవుతున్నదనడంలో సందేహం లేదు. సాధారణంగా అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు కనుమరుగవుతారు. కానీ, కేటీఆర్ మాత్రం అలాంటి నాయకులతో జతకలవడం లేదు. కేటీఆర్ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తున్నదనడానికి, కేటీఆర్ తెలంగాణ భవిష్యత్తు నాయకుడు అనడానికి ఇది నిదర్శనం. రాజకీయ పరిభాషలో ‘అధికారమే శక్తి’ అని చాలామంది భావిస్తారు. కానీ, అది అబద్ధమని, అధికారం లేకపోయినా విశ్వవేదికల విశ్వాసాన్ని చూరగొనవచ్చునని కేటీఆర్ నిరూపిస్తున్నారు.
– (వ్యాసకర్త: అధ్యక్షులు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా) కాసర్ల నాగేందర్‌రెడ్డి