రాష్ట్రంలోని మహిళా సమాఖ్యల పేరిట బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేలా ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. మొత్తం 600 బస్సులు కొనుగోలు చేయాలని, అందుకోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ-సెర్ప్ నుంచి తొలి విడతగా రూ.54 కోట్లు విడుదల చేసింది.
మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని 2023, డిసెంబర్లో ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో డిపోలు, బస్టాండ్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జీరో టికెట్ల జారీ ద్వారా ప్రతి నెలా సుమారు రూ.400 కోట్లు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవంతో పేరుకుపోతూనే ఉన్నాయి. గతంలో కంటె ఆక్యుపెన్సీ నిష్పత్తి భారీగా పెరిగినప్పటికీ అవన్నీ కాగితాల మీదే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన వందల కోట్ల బకాయిలు ఆర్టీసీకి వచ్చినప్పుడే ఆ సంస్థ లాభాల్లోకి వెళ్లి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతుంది.
ఇలా సొంత కార్పొరేషన్‌కే బకాయిలు ఇవ్వని ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి వాళ్లకు మాత్రం ఏడేండ్లు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన నిధులను ఇస్తుందా అన్నది అనుమానమే. మహిళా సంఘాలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకువెళ్తామని చెప్తున్న ప్రభుత్వం మాటలను మహిళలు ఎలా నమ్మేది?. ఇప్పటికే కిలోమీటర్‌కు అత్యంత తక్కువ కోట్ చేసిన వాళ్ల బస్సుల్నే అద్దెకు తీసుకున్న ఆర్టీసీ వ్యవహార శైలి వల్ల బస్సుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 40 శాతం మంది అద్దె బస్సుల యజమానులు తమ వాహనాలను ఒప్పందం నుంచి తప్పించి విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి మొత్తం 10 వేల బస్సులుండగా అందులో 3,300 బస్సులు ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్నవే. సుమారు వెయ్యి బస్సులు తమ ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. కొన్నిసార్లు కార్పొరేషన్ లాభాలు లేని రూట్లలో ఉన్న అద్దె బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నది.
అద్దె బస్సులకు గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.150 కోట్ల చెల్లింపులు బాకీ ఉన్నది. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా తీసుకుంటున్న బస్సులకు మాత్రం సమయానికి చెల్లిస్తారన్న నమ్మకం కలగడం లేదు. మరోవైపు ఆర్టీఏల దగ్గర ప్యాసింజర్ బస్సులను, విద్యార్థులను చేర్చే బస్సులుగా మార్చే దరఖాస్తులు ఎక్కువవుతున్నాయి. అంటే కార్పొరేషన్‌తో పాటు అద్దె బస్సు యజమానులు ఆయా రూట్లలో బస్సులను నడిపించటానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన విధానాల ప్రకారం మహిళాసంఘాల బస్సుల నిర్వహణ ఆర్టీసీ చూసుకొని ప్రతి నెల రూ.77 వేలు చెల్లించనున్నది. వాళ్ల చేత బస్సులు కొనుగోలు చేయించి ఈఎంఐలు సరిగ్గా కట్టేలా ఆర్టీసీ, ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తాయన్నది సందేహాస్పదం. మరోవైపు ఏకంగా 637 బస్సులు 15 ఏండ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నాయి. వీటితో సంస్థ నిర్వహణ భారంగా మారింది. ప్రతిసారి బస్సులు రోడ్లపై ఆగిపోవటం రిపేర్లు, నిర్వహణ సరిగ్గా లేకపోవటం వల్ల ఇంధనం ఖర్చు పెరుగుతున్నది. మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసే బస్సులు మండల స్థాయిలో తిప్పుతామని ఆర్టీసీ స్పష్టం చేసింది. లాభాలు లేని రూట్లలో ఈ బస్సులు తిప్పటం వల్ల కొన్నేండ్లలోనే ఆ బస్సులు నష్టాలను చూపే ప్రమాదం ఉన్నది.
ఆర్టీసీ ఇలా అద్దెకు తీసుకున్న బస్సులను డిమాండ్ ఉన్న దారుల్లో నడినప్పుడే మహిళా సంఘాల బస్సులు లాభాలు ఆర్జిస్తాయి. అవసరమైతే ఈ 450 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చులు తగ్గి ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల బస్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, ఇంధన ఖర్చులు, దారులపై ఎలాంటి అవగాహన లేని మహిళా సమాఖ్యలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందుకే వాళ్లకు సరైన రీతిలో అవగాహన, శిక్షణ కల్పించాలి. ఆర్టీసీ సైతం అద్దె బస్సులపైనే కాకుండా సొంతంగా బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టు నడిపించాలి. కాలం తీరిన బస్సుల స్థానంలో నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి.
– (వ్యాసకర్త: కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్) తుల ఉమ