తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. శతాబ్దాల చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ. సామాజిక ఉద్యమాలైనా, అస్తిత్వ పోరాటాలైనా అలుపెరుగకుండా సాగించిన నేల. వందేమాతరం ఉద్యమమైనా, సాయుధ రైతాంగ తిరుగుబాటైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటమైనా విజయతీరాలకు చేర్చిన వీరులగన్న పోరు భూమి. అద్భుతమైన చరిత్ర మన సొంతం. ఇటువంటి నేలపై నేడు ఏం జరుగుతోంది? రాజకీయం పేరుతో జరుగుతున్న రాక్షస క్రీడ ఏమిటి? ఇటువంటి గడ్డపై చిల్లర నాటకాలు నడుస్తాయా?
తెలంగాణ తల్లి దశాబ్దాల బానిస సంకెళ్లను తెంచేందుకు కేసీఆర్ చేసిన పోరాటం మన కండ్ల ముందున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో, ఆయన మార్గదర్శనంలో, ఉక్కు సంకల్పం తో అభివృద్ధి పథంలో మనం దూసుకుపోతున్నాం. బీడువారిన నేలలు పచ్చగా మారినయి. మన బతుకుల్లో సంక్షోభం పోయి సంక్షేమం వచ్చింది. మన భావితరా లూ బాగుపడేలా తెలంగాణ సుభిక్షమైంది. పదేండ్ల ప్రస్థానంలో కేసీఆర్ సారథ్యం, ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణం నెలకొన్నది.
శాసనసభ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా కారు జోరు కనిపిస్తున్నది. ‘తీస్రీ బార్ కేసీఆర్’ అని సర్వత్రా జనం నినదిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్ నాయకులు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో వెయ్యి రెట్లు కనిపిస్తున్నది. డిసెంబర్ 3 నాడు వచ్చే ఫలితాలు కండ్లముందు కనిపిస్తుంటే రేవంత్‌రెడ్డి కాళ్ల కింద నేల కదులుతోంది. చికెన్ సెంటర్ ముందుకెళ్లి తొడగొట్టిన కోడి చికెన్ సెంటర్ ఓనర్‌కే దొరికితే ఏం జరగొచ్చు? ఊహించుకుంటేనే సినిమా ఆ కోడికి అర్థమైపోతుంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ను ‘ఉరేసి, రాళ్లతో కొట్టి, పిండం పెట్టాల’ని ఇటీవల రేవంత్‌రెడ్డి అన్నాడు. సభ్యసమాజం ఈ వ్యాఖ్యలను హర్షిస్తుందా? పార్టీలు వేరైతే ఇలాంటి మాటలతో దూషించవచ్చా? ఏం సంస్కృతి ఇది? ఎక్కడ నేర్చుకున్న సంస్కృతి? కార్యకర్తలను కాళ్లతో తంతున్నాడు, కండువాలు వేసుకోవడానికి వచ్చిన కార్యకర్తలను తోసి పడేస్తున్నాడు. మరోవైపు… ప్రశ్నించే పాత్రికేయులకు సమాధానాలు చెప్పుకొనే పరిస్థితి లేక రెచ్చిపోతున్నాడు. తనదైన నీచమైన శైలిలో వారిపైనా దూషణలకు దిగుతున్నాడు. చానళ్లున్నాయని రాస్తే ‘పండవెట్టి తొక్కి పేగులు తీస్తా ఒక్కొక్క గాడిద కొడుకుల్ని’ అన్నాడు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు కోకొల్లలు. ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.
ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో, చట్టసభలో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా? ఇది కేవలం ఆటవిక వ్యవహార శైలి మాత్రమే. రేవంత్ రెడ్డి పట్టపగలు డబ్బుల సంచులతో దొరికిపోయిన ఓ దొంగ. ఇది వాస్తవం కాదా? సీక్రెట్ కెమెరాల్లో రికార్డ్ కాకపోతే బుకాయించేవాడేమో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగం అని చిత్రీకరించేందుకు శత్రువులు కుట్ర చేశారు. తొలి ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పూనుకున్నారు. అందుకు ఇంటిదొంగ రేవంత్‌రెడ్డిని వాడుకున్నారు.కానీ..కేసీఆర్ వ్యూ హాల ముందు శత్రు శిబిరం ఆటలు సాగలేదు. దొంగలంతా బోనులో చిక్కారు. కటకటాలు లెక్కబెట్టారు.
దొంగతనం కేసులో దొరికి జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి అప్పట్నుంచి వ్యక్తిగతంగా రగిలిపోతూ కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. కక్ష సాధించుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నాడు. రేవంత్‌రెడ్డి రాజకీయంలో ఎక్కడా కూడా ప్రజల ఎజెండా కనిపించదు. కేవలం తన దొంగతనాన్ని పట్టుకున్న కేసీఆర్‌పై పగ తీర్చుకోవాలనే అక్కసు, విపరీత ప్రవర్తన కనిపిస్తాయి. కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా రాజకీయం చేస్తే…ఎప్పటికీ దింపలేరు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలి. ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని గద్దెనెక్కించాలో ప్రజలు నిర్ణయిస్తారు.
తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే నేతలను ఓటుతోనే రాజకీయంగా అంతం చేయడం ప్రజలు నేర్చుకున్నారు. ఇక్కడ దొంగల ఆటలు సాగవు. రేవంత్‌రెడ్డీ… నీకు అధికారం కావాల్నా? నువ్వొక పట్టపగలు దొరికిన దొంగవు. పండవెట్టి తొక్కుతనంటే పగ్గాలెట్ల ఇస్తాం?
(వ్యాసకర్త: జర్నలిస్టు)
-ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343