తెలంగాణ రాష్ట్రాన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ వేసిన అడుగుల్లో ఎక్కువగా తడబాట్లే కనిపిస్తున్నాయి. బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులు 15 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన హస్తం పార్టీ తొలి బడ్జెట్లో 7.31 శాతానికే పరిమితమైంది. విద్యావిధానంపై తగు సూచనలు చేయడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను సభ్యులుగా నియమించడం గమనార్హం. అంతేకాదు, ఆ కమిషన్ సిఫారసులు చేయకముందే హడావుడిగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ వంటి ప్రచార ఆర్భాటపు చర్యలు చేపట్టింది. ఈ చర్యలతో విద్యా కమిషన్ కాళ్లకు బంధాలు వేసినట్టు అయింది.
Congress Govt | సమానత్వం, వివక్ష లేని విధానాలు ఉండాలనే రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా.. పార్లమెంటు ఆమోదం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా నూతన విద్యా విధానాన్ని కేంద్రప్రభుత్వం ముందుకుతెచ్చింది. అంతేకాదు, దాన్ని అమలు చేయాలని రాష్ర్టాలపై ఒత్తిడి చేయడం మన దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ విధానాన్ని నిరాకరిస్తూ, ప్రతిభ అనే భావనను ఈ నూతన విద్యా విధానం ముందుకు తెస్తున్నది. అందరికీ ఉచిత నిర్బంధ విద్య ప్రస్తావన అందులో లేదు. ఇది ముమ్మాటికీ ప్రాథమిక విద్యాహక్కును ఉల్లంఘించడమే. అయితే, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై పెత్తనాన్ని రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంపై రాష్ట్ర సర్కార్ తన వైఖరిని ఇప్పటికీ వెల్లడించకపోవడం శోచనీయం.
పాఠశాల విద్యలో 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం లేదు. తరగతి గదుల నిర్మాణంపై చర్యలు చేపట్టలేదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ప్రతి చిన్న గ్రామానికి ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాల, హైస్కూల్ ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. గురుకులాలను గాలికొదిలేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లక్ష ఇరవై వేల ఖాళీలు ఉండటమే అందుకు నిదర్శనం. పునాది లేకుండా భవనం నిర్మించినట్టు పీఈటీలను నియమించకుండా, స్పోర్ట్స్ యూనివర్సిటీని సర్కార్ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకుండా క్రీడా విశ్వవిద్యాలయ స్థాపనతో ఒలింపిక్స్‌లో పతకాలు వస్తాయని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు.
విశ్వవిద్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, డైట్ విద్యా శిక్షణ సంస్థల్లో అధ్యాపక ఖాళీలు పేరు కుపోయాయి. నిరుద్యోగుల తయారీ కేంద్రాలుగా వర్ధిల్లుతున్న యూనివర్సిటీలను తక్షణం సంస్కరించాలి. పరిశ్రమల అవసరాలకు, చదువులకు మధ్య అగాధాన్ని పూడ్చాలి. ప్రైవేటు రంగంలోని అన్ని విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించే విధంగా చట్టాలకు సవరణలు చేస్తానన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించే చర్యలు చేపట్టలేదు.
ఉన్నత విద్య అనేది విమర్శనాత్మక, స్వతంత్ర ఆలోచన, సమాజాభివృద్ధికి నిబద్ధతను పెంపొందించే లక్ష్యంతో ఉండాలి. కేవలం మార్కెట్‌కు అవసరమైన గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేయడం కోసం ఉన్నత విద్య లక్ష్యాన్ని తగ్గించడం దాని విస్తృత సామాజిక, మేధో ప్రయోజనానికి విఘాతం కలిగిస్తుంది.
బహుళజాతి సంస్థలకు చౌక కూలీలను అందజేసే సంస్థలుగా మారకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే పరిశోధక కేంద్రాలుగా సాంకేతిక విద్యాసంస్థలను అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో సాంకేతిక విద్య కేవలం ఇంజినీరింగ్ కళాశాలల చుట్టే తిరుగుతున్నది. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిరాదరణకు గురవుతున్నాయి. ఒక ఇంజినీరుకు ఉండాల్సిన డిప్లొమా, ఐటీఐ నిపుణుల నిష్పత్తిలో సమతూకం దెబ్బతినడంతో వేలాదిమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు.
అయితే, నైపుణ్యం ఉన్న అధ్యాపకులు లేకపోవడంతో టాప్ ర్యాంకర్లు ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం లే దు. వారంతా ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. సుమారు 8 వేల మంది విద్యార్థులున్న బాసర ట్రిపుల్ ఐటీ సంక్షోభంలో కూరుకుపోయింది. అధ్యాపకులు లేక ఆ విద్యాసంస్థలో బోధన కునారిల్లింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణం. ఐటీఐ, పాలిటెక్నిక్‌లను సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తూ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కోర్సులను, సిలబస్‌ను అప్డేట్ చేస్తూ సాంకేతిక విద్యను మెరుగుపరచాలి.
ప్రపంచవ్యాప్తంగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు బోధించేలా స్కిల్ యూ నివర్సిటీ ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విజయవంతంగా పరిశ్రమలు నడుపుతున్న ప్రముఖులను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ లో భాగస్వాములను చేశారు. కానీ, అదే సమయంలో బాసర ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల, జేఎన్టీయూ లాంటి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధిపై నిర్దిష్ట చర్యలు ప్రారంభించలేదు. డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తుండటంతో కన్వీనర్, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది.
ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొఠారి కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్ర బడ్జెట్లోనూ 30 శాతం నిధులను కేటాయించాలి. నాణ్యమైన విద్యనందించి విద్యను గాడినపెడతామని ప్రభుత్వం అంటున్నది. వినడానికి ఇది బాగానే ఉన్నా.. నూతన జాతీయ విద్యావిధానం -2020 చట్రానికి భిన్నంగా ఆలోచించకుండా, ప్రపంచబ్యాంకు షరతుల నుంచి బయటకు రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విద్యారంగానికి ఏ విధంగానూ మేలు జరగదు.