అరువై ఏండ్ల పాటు ఉమ్మడి పాలకులు నీళ్లు ఇవ్వకనే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. తలాపున పారే కృష్ణా, గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లను తడపకుండా, ఈ గడ్డపై నిలవకుండా.. పడ్డ చినుకు పడ్డట్టుగా తరలించుకుపోయిన కుట్రల ఫలితంగానే తెలంగాణ వలసబాట పట్టింది. కరువుకు.. రైతన్నల ఆత్మహత్యలకు నెలవైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్లో నదీజలాల హక్కులు ప్రధానంగా నిలిచాయి. ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలో సీమాంధ్ర పాలకుల జల కుట్రలను బట్టబయలు చేసి, కాలరాయబడిన హక్కులను అవిశ్రాంత పోరాటంతో తెలంగాణ తిరిగి సాధించుకున్నది. చెరువుల పూడిక తీసుకున్నది. మూలకుపడ్డ ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. కృష్ణమ్మ, గోదారమ్మను ఒడిసిపట్టింది. మొత్తంగా పదేండ్ల స్వరాష్ట్రంలో జల ఫలాలను తెలంగాణ పల్లె అనుభవించింది. నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకునే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది.
రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తున్న వేళ మళ్లీ ఇప్పుడు ఉమ్మడి కుట్రలకు తెరలేచింది. తెలంగాణ జల హక్కులను కబళించే పన్నాగాలకు పదునెక్కింది. దాని పేరే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు. సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబు, పాత్రధారి కేంద్రంలోని బీజేపీ. ప్రేక్షకుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సారథి రేవంత్రెడ్డి. ‘ఏపీ అన్నింటికన్న దిగువనున్న రాష్ట్రం. ఏటా సముద్రంలోకి 3 వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయి. అందులో నుంచి 200 టీఎంసీల వరద జలాలనే బనకచర్లకు మళ్లించి రాయలసీమకు అందిస్తాం.’ ఇదీ ఏపీ చెప్తున్న మాట. కానీ, వరద ఎక్కడి నుంచి వస్తున్నది? ఎందుకు పోతున్నది? మళ్లింపు వల్ల వచ్చే నష్టమేంటి? అన్నవే అసలు ప్రశ్నలు.
మొదటగా వరద ఎక్కడిదో తెలుసుకుందాం. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి బేసిన్ను 12 సబ్బేసిన్లుగా విభజించింది. ఆ తర్వాత 75 శాతం డిపెండబులిటీ అంటే కనీసం నాలుగేండ్లలో మూడేండ్ల పాటు కచ్చితంగా వచ్చే వరద ప్రవాహాలు. ఆ ప్రకారం గోదావరిలో ఏటా ఎంత నీరు అందుబాటులో ఉంటుందో లెక్కగట్టింది. ఆ జలాలన్నింటినీ బేసిన్లోని ఉమ్మడి ఏపీతో పాటు, పూర్వ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలకు వాటి వాటి పరీవాహక ప్రాంతం ఆధారంగా పంపిణీ చేసింది. 2023లో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) గోదావరిలో ఎంత నీరుందనే దానిపై అధ్యయనం చేసింది. ఆ గణాంకాలు తేల్చిందేమంటే 75 శాతం డిపెండబులిటీపై గోదావరిలో నీటిలభ్యత 3,396.9 టీఎంసీలు.
50 ఏండ్ల సగటు నీటి లభ్యత 4,535.1 టీఎంసీలు. ఈ లెక్కన మిగులుతున్నది 1138.2 టీఎంసీలు. వాస్తవంగా ఇది మిగులు కాదు. ఇవి బేసిన్లోని రాష్ర్టాలు వినియోగించుకోని నికరజలాలే. ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ 1,486 టీఎంసీలను కేటాయించింది. అందులో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 531 టీఎంసీలు. అయితే, రాష్ట్ర ఏర్పాటు నాటికీ తెలంగాణ తన వాటాలో కనీసం 200 టీఎంసీలను కూడా వినియోగించుకోని దుస్థితి. అలాగే ఛత్తీస్గఢ్ కూడా తన వాటా 400 టీఎంసీలను ఇప్పటికీ వినియోగించుకోవడం లేదు. మహారాష్ట్ర కూడా అంతే. అందుకే గోదావరిలో వరద కనిపిస్తున్నది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నీటి నిల్వ సామర్థ్యం పెంచుకున్నది. కాళేశ్వరం ద్వారానే 141 టీఎంసీల రిజర్వ్ కెపాసిటీ పెరుగగా, 400 టీఎంసీలకు పైగా వినియోగించుకునే వ్యవస్థలను ఏర్పాటుచేసుకుంది. ఇవికాకుండా సమ్మక్కసాగర్ 44, సీతమ్మసాగర్ 67 టీఎంసీలు మొత్తంగా నికర వాటాలో 824 టీఎంసీలను వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాల కోసం ఒక 144 టీఎంసీలను రిజర్వ్ చేసి పెట్టుకున్నది. ఛత్తీస్గఢ్ కూడా ఇటీవల సుబోధ్ఘాట్ ద్వారా 90 టీఎంసీలు, మహానది-ఇంద్రావతి లింక్ ద్వారా 150 టీఎంసీలను వినియోగించుకునేలా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నింటి ద్వారా నీటి వినియోగం పెరిగితే ఆ మేరకు జలాలు దిగువకు పోవన్నది కండ్లముందు కనబడుతున్న సత్యం.
వరద మాటున ఏపీ జలాల వినియోగానికి అంగీకరిస్తే తెలంగాణకే కాదు, బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు నష్టం వాటిల్లుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీనే కండ్లముందు కనబడుతున్న సజీవ సాక్ష్యం. రేపటి రోజున బనకచర్ల కూడా మరో పోతిరెడ్డిపాడులా మారుతుంది. బనకచర్ల ద్వారా ఒక్క గోదావరినే కాదు, కృష్ణా జలాలను కబళించేందుకు ఏపీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నది. సాగర్ కుడికాలువ 80 కిమీ వద్ద బొల్లాపల్లి రిజర్వాయర్ను కట్టనున్నది.
బనకచర్ల ద్వారా ఇటు గోదావరి, అటు కృష్ణా జలాలు తెలంగాణకు దక్కకుండాపోయే ప్రమాదం ఉన్నది. అదీగాక ఏపీ ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రేపటి రోజున అది ఏర్పడితే బనకచర్లకు చట్టబద్ధత వచ్చే ప్రమాదం ఉంటది. అదే జరిగితే తెలంగాణ వాటాకు గండిపడే ప్రమాదం ఉన్నది.
ఎందుకంటే ట్రిబ్యునల్ ఎప్పుడైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అనే సూత్రాన్ని పాటిస్తుంది. అప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తుంది. దీనికి సాగర్ కింద కృష్ణా డెల్టాకు కేటాయించిన 180 టీఎంసీలే నిదర్శనం.
వరదజలాలు పుష్కలంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో ఏపీ ఎందుకు అడ్డుకున్నది? కారణం సుస్పష్టం. తెలంగాణకు నదీజలాలు దక్కకూడదు. నాడైనా, నేడైనా ఏపీదీ అదే కుట్ర.గోదావరిలో మిగులు జలాలు లేనే లేవు. బనకచర్ల వద్దంటూ కేంద్ర సంస్థలే ముక్తకంఠంతో తెగేసి చెప్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ఏపీకి కేంద్రం దన్నుగా నిలుస్తున్నది. ఈ కుట్రలకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఆ రెండు పార్టీలకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కరూ గొంతు విప్పకపోవడం విషాదం. తెలంగాణ జల హక్కులను ప్రశ్నించకుండా పెదవులు మూసుకోవడం దారుణం. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలంగాణ నీటిహక్కుల కోసం నిలదీస్తున్నది బీఆర్ఎస్ ఒక్కటే. ఉద్యమనేతగా కేసీఆర్ ఆనాడు కృష్ణా జలాల కోసం యుద్ధమే చేశారు. పోతిరెడ్డిపాడు అక్రమ విస్తరణకు వ్యతిరేకంగా గులాబీ నేతలు పదవులను త్యాగం చేశారు. కంఠ నరాలు చిట్లిపోయేలా గర్జించారు.
పేగులు తెగుతున్నా కొట్లాడారు. విలీనం వల్ల కోల్పోయిన జల హక్కులను సెక్షన్-3 సాధించడం ద్వారా తెలంగాణకు తిరిగి దక్కేలా చేశారు కేసీఆర్. ప్రాజెక్టులను పూర్తిచేశారు. జల ఫలాలను అందించారు. ఇప్పుడు బనకచర్లపైనా గర్జిస్తున్నది కేసీఆర్ సారథ్యంలోని ఆ బీఆర్ఎస్ సైన్యమే. జల కుట్రలను నిలదీస్తున్న తీరే అందుకు నిదర్శనం. ఏపీ, కేంద్రం, రేవంత్ సర్కార్లకు ఎదురొడ్డి పోరాడుతున్నది కేసీఆర్ ఆశయసాధకులే. నాడైనా, నేడైనా, రేపైనా తెలంగాణ జల హక్కులను కాపాడేది, అందుకోసం బరిగీసి కొట్లాడేది ఒక్క బీఆరెస్సే. ఒక్క కేసీఆరే.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకలు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817