ఏ షాజహాను రూపుదిద్దిన మహా గుమ్మటమో
ఏ నిజాము పునాది వేసిన అపురూప కౌశలమో..
ఏ చక్రవర్తి రంగులద్దిన వన్నెల గోపురమో..
కాకతీయ కళామ తల్లి తోరణమో..
భువనమెల్ల పరచుకున్న ధవళీకృత దీధితులు..
నవ లోకోత్తర భావ ప్రకటిత సంకేతములు..
మహోన్నత సౌధశైలి మహోత్కృష్ట నిర్మాణం..
భళారే.. తెలంగాణ ప్రగతికిదే తార్కాణం..
రాచవన్నెలలరించి రమ్యత శోభిల్ల జేర్చి..
కూర్చి, భాగ్యనగరేతిహాస యశఃచంద్రికలను
దిశాంతాల దునాళించి దీప్తులెల్ల వెలయింపగ వహ్వా.. యే ఇమారత్..
అవ్వల్ హై హకీఖత్ అని పొగడుట ఖాయం..
అదే.. భవన విజయం..
కుతుబ్ షాల కొలువైనా..
నిజాం రాజు నెలవైనా..
దక్కన్‌గా కీర్తి దక్కినా..
పక్కా తెలగాణ మాది..
కులం, మతం కడుదూరం కలిసి బతుకుటే ధర్మం..
సహకారం మా కులం..
సమ్మతమే మా మతం..
సచివులైననేమి వారు..
సహోద్యోగులైననేమి..
గద్దెపైన నున్న నేమి..
కర్మచారులైననేమి..
పాలకులు, పాలితులు..
ప్రజాసేవకే నిత్యం..
ప్రకటితమైనదీ సత్యం..
సచివాలయ ప్రాంగణం..
సహృదయతకు నిదర్శనం..
సచివులు కర్మచారుల కార్యనిరతి, సేవా తత్పరత ఓ తపస్సులా, ఓ యోగంలా, ఓ యాగంలా కొనసాగించడానికి ఆలయం లాంటి స్థల నిర్మాణమే సచివాలయం..అంబేద్కర్ మహాశయుని మహదాశయాలకు తార్కాణంగా ఆయన పేరిట నిర్మాణం ఆయన ఉద్దేశించిన లక్ష్యసాధనకు అభినివేశం.. అందుకే ఆ మహానుభావునికి అంకితం.
భువనాలు సమస్తం మెచ్చిన భవన విజయం..
బాపు కేసీఆర్ సత్సంకల్పం సారథ్యం సముచిత నేతృత్వం..
శిరమెత్తి చూడగ చిత్రమ్ముగాదోచు భవన సౌందర్యపు పాలవెలుగు గుమ్మటముల చేర్పు, కుఢ్యముల మేల్గూర్పు కన్ను గదుపనీదు కదలనీదు..
సౌధాంతరమునందుసౌఖ్యవంతములైన గదుల నిర్మాణము పదిలముగను సచివుల నిలయము సౌకర్యముల తోడ చరితార్థముగనిల్చు తరతరముల..
పూర్వ రాజులు గట్టిరీ పుడమిపైన సౌధముల తోడ వసతిగ వీధులెల్ల రాచబాటలు, కొలనులు, రాష్ట్రమందు నేటి సచివాలయము వాని సాటిగాదె..!
Secretariat | తెలంగాణ రాష్ట్ర వైభవానికి దర్పణం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అసలు తెలంగాణ ఆత్మగౌరవానికి పునాది పడ్డదే తెలంగాణ భవన్ ద్వారా. దశాబ్దాల కిందట కొన్ని దోపిడీ వర్గా ల కుట్రతో అధికారం, అస్తిత్వం కోల్పోయిన మన తెలంగాణ నేడు నూతన సచివాలయ భవనం ద్వారా సగర్వంగా నిలిచింది. ఒకప్ప టి సచివాలయం దోపిడీ వర్గాల చీకటి అడ్డా, తెలంగాణ ప్రాంత మంత్రులకు, ప్రజాప్రతినిధులకు కూడా అంతుచిక్కని గూడుపుఠాణీల రహస్య నిలయం. పైరవికారులే చక్రం తిప్పేచీకటి కోట. ఏ విభాగం ఎక్కడుందో, ఏ ఫైల్ ఏ బల్ల కింద నక్కిందో తెలియని అయోమ యం. నేడు ఆ చీకటి చరిత్రను దూరం చేసే వెలుగుల పుంజం మన సచివాలయం.
ఒక్క సచివాలయమే కాదు.. అన్నదాతలకు అండగా, అడ్డాగా రైతువేదిక భవనాలు, ఆదివాసీలకు, బంజారాలకు, అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ గ్రామాన కమ్యూనిటీ భవనాలు, సమీకృత అంగన్వాడీ భవనాలు, 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసుకొని ప్రతి జిల్లాకు ఒకే చోట పరిపాలనా సౌలభ్యం కోసం సమీకృత జిల్లా కలక్టరేట్ భవనాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్, పలు దవాఖానలు, యాదాద్రి దేవాలయం, వివిధ ఐటీ హబ్‌లు.. ఎన్నో, ఎన్నెన్నో… రాజకీయంగా తనపై కుట్రలు జరుగుతున్నా, లక్ష నిందలు వేస్తున్నా తెలంగాణ సముజ్వల స్వరూపాన్ని చెక్కుతున్న కలియుగ విశ్వకర్మ బాపు కేసీఆర్. చరిత్రలోని పురాతన కట్టడాలైన మైసూరు ప్యాలెస్, బెంగళూరులోని విధానసౌధ, ముంబయిలోని తాజ్‌మహల్ హోటల్ లాంటివాటికి దీటుగా నిలవనున్నదీ సచివాలయం.
కొత్త సచివాలయం భావితరాలకు ఆదర్శ నిలయం. ఎనిమిదేండ్లలో అన్నిరంగాలలో బాపు కేసీఆర్ నాయకత్వంలో మెరుపు వేగంతో దూసుకుపోతున్న ప్రగతికి ప్రతిరూపం. అన్ని సామాజిక మార్పులకు రాజకీయాధికారమే మాస్టర్ కీ అని బాబాసాహెబ్ చెప్పిన మాటకు, తెలంగాణ ప్రజల అధికార దర్పానికి దర్పణం.
స్వాభిమానానికి, స్వతంత్రతకు, అధికారానికి, స్వావలంబనకు శిఖరాగ్ర రూపం. అద్భుతమైన గుమ్మటాలతో ఈ కట్టడం అపురూప కౌశలానికి నిదర్శనం. గుమ్మటాలు కావవి, తెలంగాణ తల్లి పిల్లల తలపై శిరస్ర్తాణాలు. పార్టీలు, జెండాలు మార్చేటోళ్లకు, దోపిడీ ముఠాల చక్రవర్తులకు, చెప్పులు మోసే మరుగుజ్జులకు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అర్థం కాదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు, సిబ్బంది ఒకే భవనంలో ఒకరికొకరు అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా తీసుకునే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు అట్టడుగుస్థాయి వరకు త్వరితగతిన చేరనున్నాయి. ఇంటిని చూసి ఇల్లాలి గొప్పదనాన్ని అంచనా వేసినట్టు, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు మన సచివాలయాన్ని చూసి, అక్కడ వేగంగా నిర్ణయాలు తీసుకోవటం చూసి, తమ నిర్ణయాలను త్వరితగతిన వెల్లడించే అవకాశం ఉన్నది. సెలవు రోజుల్లో సందర్శకులకు సచివాలయ వీక్షణకు కల్పించటమనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కాలేజీ రోజుల్లో విహారయాత్రలో భాగంగా వైట్‌హౌస్‌ను సందర్శించినప్పుడు, దేశానికి సారథ్యం వహించి మంచి పరిపాలనను అందించాలని స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. మన సచివాలయాన్ని సందర్శించే భవిష్యత్ తరాలు కూడా ఇదే విధంగా గొప్పస్ఫూర్తిని పొందుతాయి.
చరిత్రను విస్మరించేవారు చరిత్రను నిర్మించలేరు. చరిత్రను వక్రీకరించేవారు చరిత్ర హీనులవుతారు. గత చరిత్ర పునాదుల మీద నిలబడే వర్ధమాన, భవిష్యత్తు చరిత్రను నిర్మించుకోగలం. చరిత్రను తెలుసుకోవడం వల్ల గతంలో జరిగిన దురాచారాలను, చెడును భవిష్యత్తులో నివారించుకోగలం. ఇది అర్థం కాని అరాచకశక్తులే గత చరిత్రను వక్రీకరిస్తాయి. మసీదులు తవ్వుతాం, చార్మినార్ కూలగొడతాం, పాతబస్తీని మాయం జేస్తామని విద్రోహ ప్రకటనలు చేస్తాయి. ఇది ఎంతవరకొచ్చిందంటే.. మహాత్ముడిని హత్య చేసినవాడిని మహాత్మా గాడ్సే అంటున్నారు. బ్రిటిష్ వాడికి క్షమాపణ పత్రం రాసిచ్చిన వాడిని బాపూజీ అంటున్నారు. మన తెలంగాణలో సబ్బండవర్గాల ప్రజలు సాగించిన రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా హిందువులకు, ముస్లిం పాలకులకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో తరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్న మన సమాజాన్ని మతపరంగా విడగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను మరో గుజరాత్‌గా మార్చాలనుకుంటున్నారు. ఉద్యమ చైతన్యం కలిగి ఉన్న మనం మతోన్మాద మూకల ఆటలు సాగనివ్వకూడదు. అరువై ఏండ్ల బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసిన బాపు కేసీఆర్‌పై మోదీ-షాల ముఠా సాగిస్తున్న దాడిని మనం తిప్పికొట్టాలి.
‘అశోకుడు చెట్లు నాటించెను, కాకతీయులు చెరువులు తవ్వించారు’ అని మనం పాఠాలు చదువుకున్నట్టుగా.. భవిష్యత్ తరాల వారు ‘బాపు కేసీఆర్ ప్రపంచం అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించెను, యాదాద్రి క్షేత్రం నిర్మించెను, గొప్ప సచివాలయం కట్టించెను’ అని చదువుకుంటారు.
వహ్వా! బేషక్ సారే కాయినాత్ మే బే షుమార్ యే ఇమారత్ హై!
దునియామే బేమిసాల్ ఇస్కీ హిమాయత్ హై!
తహజేబె గంగా జమునా ఝల్కే ఇస్కే నూర్ సే!
తారీఫె కాబిల్ హర్ అదా ఇస్కీ మానో తో ఏ చష్మె బద్దూర్ హై
– మంత్రి శ్రీదేవి
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు
98482 54678