తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తెరవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ఫోర్త్ సిటీ ఊహాచిత్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న భారీ నెమలి విగ్రహం నా దృష్టిని ఆకర్షించింది. దాంతో పాటే అదే చిత్రంలో అక్కడక్కడా తచ్చాడుతున్న నెమళ్లు. కంచె గచ్చిబౌలీలో 400 ఎకరాల అడవిని చదునుచేసి అమ్ముకోవడానికి రేవంత్‌రెడ్డి సర్కారు ఓ అర్ధరాత్రి పంపిన వందలాది బుల్డోజర్లు వెంటనే నా కండ్ల ముందు మెదిలాయి. ఆ నిశీధి వేళ గూడుచెదిరి కకావికలమై ప్రాణభయంతో నెమళ్లు చేసిన ఆర్తనాదాలు గుర్తొచ్చాయి. ఉన్న నగరంలో అడవిని నరికేసి, నెమళ్లను చంపేసి భూములు అమ్ముకోవాలనుకునే నాయకుడు ఇప్పుడో కొత్త నగరం కట్టి అందులో నెమళ్లకు ప్రాణప్రతిష్ట చేస్తానని నమ్మబలుకుతున్నాడు. ఎంత విరోధాభాస!
విజన్ 2047 డాక్యుమెంట్ చదవడం మొదలుపెట్టగానే నాకు మరో సంగతి అర్థమైంది. అదేదో ఇవ్వాళే కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి రాసిన విజన్ డాక్యుమెంట్ లాగా అనిపించింది. కారణం 2014 నుంచి 2023 వరకూ అప్రతిహతంగా కొనసాగిన తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం గురించి అందులో అక్షరం ముక్క కూడా లేదు. స్వరాష్ట్రంగా అవతరించాక విద్యుత్, నీటి పారుదల, వ్యవసాయం, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ వంటి రంగాల్లో దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. గతాన్ని మరిచి, వర్తమానాన్ని విస్మరించి చేయబోయిన ఈ విజన్ 2047 విన్యాసం అందుకే పునాది లేని పేకమేడలా బొక్కబోర్లా పడింది. అయినా కండ్ల ముందు కనిపిస్తున్న నిజాన్నే చూడలేక కండ్లు మూసుకునే నాయకులు భవిష్యత్తు పట్ల ప్రకటించే విజన్‌కు అర్థమేముంటుంది?
ఏ వేదిక మీదైతే రేవంత్ రెడ్డి ఈ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిండో, అదే వేదిక మీద బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇద్దరూ తొలి పదేండ్లలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వేనోళ్ల కొనియాడటం పోయెటిక్ జస్టిస్ అనిపించింది. ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రధానంగా కనిపిస్తున్నది తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి (క్యూర్: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్: పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రేర్: రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ), ఒక అభివృద్ధి నమూనాను సూచించడం. దీన్నే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు గత కొన్నిరోజులుగా అన్ని వేదికల మీదా ఏదో కొత్త ఆవిష్కరణ చేసినట్టు ఊదరగొడుతున్నారు.
నిజానికి ఇట్లా రీజియన్లుగా విభజించే అభివృద్ధి నమూనా కొత్తదేమీ కాదు. ఇదివరకు సౌతాఫ్రికా, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో 1990ల్లోనే ప్రయోగం చేసి దారుణంగా విఫలమైన నమూనా ఇది. దీన్ని ఇప్పుడు కొత్తగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో పెట్టి, బ్రహ్మాండం బద్దలవుతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇందులో కోర్ రీజియన్‌లో సర్వీసెస్ రంగం (ఐటీ, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ), ప్యూర్ రీజియన్‌లో తయారీ రంగం, రేర్ రీజియన్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తారట. ఈ మూడు జోన్లు విభజించడానికి ప్రాతిపదిక మరీ విడ్డూరం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకూ ప్యూర్, రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్రం బార్డర్ వరకూ ఉన్నది రేర్ రీజియన్ అట. నిస్సందేహంగా ఈ అవకతవక అలోచన రేవంత్‌రెడ్డి బుర్రలో పుట్టిందే అనిపిస్తున్నది నాకు. రోడ్ల ప్రాతిపదికన ఒక రాష్ర్టాన్ని మూడు రీజియన్లు చేయడం, అలా చేసిన రీజియన్లు ఒక్కో దానిలో ఒక్కో రంగాన్ని ప్రోత్సహిస్తామనడం ఆ భూమ్మీద ఇప్పటివరకూ ఏ నాయకుడూ తలపెట్టని విజన్ కావచ్చు. ఇప్పుడున్న జిల్లాలు, మండలాల వంటి పరిపాలనా విభాగాలతో సంబంధం లేకుండా ఒక రోడ్‌ను సరిహద్దుగా తీసుకొని రీజియన్లు చేస్తే అక్కడ జరిగే పనులు ఎవరి పరిధిలోకి వస్తాయనే మౌలిక ఆలోచన లేకుండా రచించిన ప్రణాళిక ఇది.
వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ఎన్నో టౌన్లు ఇప్పటికే చాలా పట్టణీకరణ జరిగి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇప్పుడీ టౌన్లన్నింటినీ రూరల్ తెలంగాణ రీజియన్ కింద జమకట్టి అక్కడ వ్యవసాయం మాత్రమే ప్రోత్సహిస్తామనడం భావ్యమేనా? అసంబద్ధంగా, అశాస్త్రీయంగా తెలంగాణను మూడు రీజియన్లుగా విభజించే అలోచనను తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకించాలి. ఈ విజన్ డాక్యుమెంట్లో మరో ప్రధానాంశం 2034 నాటికి తెలంగాణ ఆర్థికవ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అంటే రానున్న 22 ఏండ్ల పాటు ఏటా క్రమం తప్పకుండా సుమారు 13 శాతం వృద్ధి రేటును సాధించాలన్న మాట. అది అసంభవం. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ ఏ దేశమూ, ఏ రాష్ట్రమూ అటువంటి అభివృద్ధి రేటును సాధించలేదు. ఇదే డాక్యుమెంట్లో వారి మాటల్లోనే తెలంగాణ ఆర్థికరంగం 2047 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇంకో చోట రాశారు. కాబట్టి 3 ట్రిలియన్ డాలర్లు అనేది వట్టి ముచ్చట.
ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటే తప్పేమిటి అనే ప్రశ్న కొంతమందిలో ఉండొచ్చు. భారీ లక్ష్యాలు పెట్టుకుని దాని దిశగా పనిచేయడం మంచిదే అయినప్పటికీ ఆ లక్ష్యాలు ప్రజలను మభ్యపెట్టేందుకు వల్లె వేసే వాస్తవదూరమైన అంకెలు కారాదు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు గత రెండేండ్లలో తెలంగాణ ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేసి, ఉన్న ఆదాయాన్ని పోగొడుతున్న పాలకుడు, రికార్డులు బ్రేక్ చేసే అభివృద్ధి రేటును
సాధిస్తాడంటే నమ్మేవారెవరు?
ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న తంత్రి మీడియాతో మాట్లాడుతూ తాము విజన్ రూపకల్పనలో 1950ల్లో వచ్చిన సోలో-స్వాన్ మోడల్ వాడామని చెప్పారు. అయితే, దేశాల కోసం రూపొందించిన సోలో-స్వాన్ మోడల్‌ను రాష్ర్టాల కోసం వాడటమే పెద్ద తప్పిదం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలకు కరెన్సీ ముద్రణ, ద్రవ్య వినిమయ విధానం, ఎగుమతులు, దిగుమతుల విధానం వంటి ఎన్నిటి మీదనో ఉండే నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు కాబట్టి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో తరచూ కనిపించేది మనకు అసలేమాత్రం సారూప్యత లేని విదేశీ అభివృద్ధి నమూనాలను తరచూ ఉదహరించడం. ఫిన్లాండ్ హెల్సింకీ, సింగపూర్, దక్షిణ కొరియాకు చెందిన అనేక ఉదాహరణలు ఈ డాక్యుమెంట్లో రచయితలు ఉటంకించారు. మన స్థానిక సమస్యలకు ఈ విదేశీ పరిష్కారాలు పనిచేయవని ఇదివరకు అనేకసార్లు రుజువైంది.
రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు కూడా రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఏపీలో ఇటువంటిదే విజన్ 2020 అనే డాక్యుమెంట్ తెచ్చారు. అందులో కూడా ఇట్లాగే మనకు ఏ మాత్రం ఉపయోగపడని విదేశీ అభివృద్ధి నమూనాలను తెచ్చి రుద్దడానికి ప్రయత్నించారు. మేధావులు, బుద్ధిజీవుల నుంచి విజన్ 2020 డాక్యుమెంట్ పట్ల ఆనాడు తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త 2047 విజన్ డాక్యుమెంట్ కూడా సామాన్యుల సమస్యలేమీ తీర్చేది కాదు. పడికట్టు పదాలను వాడి, చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ టూల్స్ ఉపయోగించి అలవికాని రంగుల కలలు ఆవిష్కరించే ఈ విజన్ డాక్యుమెంట్లు ఆచరణసాధ్యం కావు. ఇవి ప్రజలను కొంతకాలం మత్తులో ముంచి, మభ్యపెట్టే సాధనాలు మాత్రమే. ఆత్మన్యూనతాభావంతో తన ముందున్న పాలకుడి చరిత్రను రూపుమాపడానికి కుటిల ప్రయత్నాలు చేసే అంగుష్టమాత్రుడు దశాబ్దాలకు పనికివచ్చే దార్శనికతను ప్రదర్శిస్తానని ప్రజలను నమ్మించాలనుకోవడం అత్యాశే.
-కొణతం దిలీప్