Congress | బీసీ రిజర్వేషన్ల చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను కాంగ్రెస్ పార్టీ తమ వైపునకు మలుపుకొన్నది. ఆ వ్యూహాత్మక రాజకీయం ఫలించి కాంగ్రెస్‌కు అధికార పీఠం దక్కింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ గొప్పగా ప్రకటించినా, ఇంకా ఆ హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తోంది. బీసీలను కాంగ్రెస్ మరోసారి బలి పశువులను చేసిందనే చెప్పవచ్చు. అయితే, రిజర్వేషన్ల లెక్క తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక వలె మారింది.
బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసే దిశగా అడుగులు వేస్తున్నా, ప్రజలకు మాత్రం నమ్మకం ఏర్పడటం లేదు. బీసీ కులగణన మాత్రమే కాదు, సమగ్ర కులగణన చేయాలని పట్టుబడుతున్నారు. కాగా, కులగణన మాత్రమే చేసి చేతులు దులుపుకుంటే మరోసారి బీసీలకు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ద్రోహం తలపెట్టినట్టే. బీసీల పట్ల కాంగ్రెస్ వంచన కొత్త కాదు, ఇదే ఆఖరిదీ కాకపోవచ్చు. నాడు కాలేల్కర్ కమిషన్ నుంచి.. నేడు రాహుల్‌గాంధీ సామాజిక న్యాయం సమగ్ర కులగణన అనే జపం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా, అందుకు విరుద్ధంగా రేవంత్‌రెడ్డి ఆ పరంపరను కొనసాగిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది.
బీహార్‌లో 69 శాతం రిజర్వేషన్లు కల్పించగా దానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అందుకే, అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఏం చొరవ తీసుకుంటుందని బీసీ సమాజం వెయ్యికండ్లతో చూస్తున్నది. అయితే, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఓ బోగస్‌గానే కనిపిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీసీ కులగణన చేయాలని పల్లవి అందుకున్నారు. న్యాయ్‌యాత్ర ఆసాంతం బీసీ కులగణన జపం చేశారు. కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో బీసీలు కోరుతున్నట్టుగా సమగ్ర కులగణన చేపట్టకపోగా, బీసీ కులగణనను కూడా చేపట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తెలంగాణలో బీసీ కులగణన జరుగుతున్నా, రేపు న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే బీసీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ తీసుకుంటుందా? అనే విషయాన్ని బట్టి బీసీల పట్ల కాంగ్రెస్ ధోరణి తెలుస్తుంది.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కప్పదాటు నిర్ణయాలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా చిక్కిశల్యమవుతున్నాయి. గ్రామాల్లో పాలన ముగిసినా ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించలేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి మళ్లాయి. అటు కేంద్రం నిధులు రాక, ఇటు సర్పంచ్‌లు లేక గ్రామాలు తిరోగమనంలోకి వెళ్తున్నాయి. మెజారిటీ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహాత్ముడి బోధనలను పదే పదే వల్లించే ముఖ్యమంత్రి రేవంత్ గాంధీ కలలుగన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏ ఒక్కరికీ భరోసానివ్వడం లేదు.
ఇక, బీసీలకు కాంగ్రెస్ ఆది నుంచి ద్రోహం చేసుకుంటూనే వస్తున్నది. తెలంగాణలో ఆ పార్టీ బీసీల నుంచి అగ్ని పరీక్షను ఎదుర్కొంటుండగా, జాతీయ స్థాయిలో బీజేపీ సైతం ఎలాంటి వైఖరి తీసుకోబోతుందన్నది బీసీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నా బీసీల పట్ల బీజేపీ వారి విశ్వసనీయతను మరింత పెంపొందించుకోవాలంటే జాతీయస్థాయిలో సమగ్ర కులగణన చేయాలి. అన్నివర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నట్టుగానే.. ఇంకా బ్యాక్వర్డ్ క్లాజ్గానే ఉండిపోయిన బీసీలను బ్యాక్‌బోన్ క్లాజ్‌గా మార్చాల్సిన తక్షణ కర్తవ్యం బీజేపీ ముందున్నది. సమగ్ర కులగణన తర్వాత బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో రిజర్వేషన్లు అమలుచేసి సామాజిక న్యాయం చేస్తుందని ఆశిద్దాం.
– చింతపల్లి కిరణ్, 99896 32612