‘ప్రజాస్వామ్యంలో కనిపించే అత్యంత సుందర దృశ్యాల్లో ఒకటేమిటంటే, అతి సాధారణ ఓటర్లు అత్యంత శక్తిమంతులకు ఎదురునిలవటం, వారిని ఓడించటం-అమితావ్ ఘోష్ ’. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఈ కాలంలో చిరంజీవి ఇంకా ఎంతోమంది మంత్రులుగా ఉండి కూడా ఓడిపోవటం చూశాం. అయితే వ్యక్తులుగా ఓడిపోవటానికి వారు అధికారంలో ఉండగా చేసిన, చెయ్యని పనులు కారణాలైతే, ఐదేండ్లు అప్రతిహతంగా అధికారంలో ఉన్న పార్టీలు ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవటానికి మాత్రం కులమో, ప్రాంతమో కారణాలు కావు. ఆ పార్టీ భావజాలం, ఐదేండ్లలో వారి పాలనాపద్ధతి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, నిబద్ధతతో అందించిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సామాన్య జనజీవనంలో జరిగిన మంచి, చెడ్డ విషయాలు… వీటన్నింటి ప్రభావంతో, ఓటర్ల జీవితంలో బాగు జరిగిందా, ఇంకా దిగజారిందా అన్న విషయం మాత్రమే! ఉదాహరణకు కర్ణాటక ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం!
దేశమంతటా వచ్చిన కష్టాలు- ధరల పెరుగుదల, సబ్సిడీల తీసివేత, రైతు వ్యతిరేక చట్టాలు, ఆశ్రిత పక్షపాతం.. వంటివే కాకుండా కర్ణాటక ప్రజలు ముఖ్యంగా బాధపడ్డవి ఇంకా ఉన్నాయి. 40 శాతం లంచాలు, రాజకీయాలు పట్టించుకోకూడని హిజాబ్, హలాల్ వంటి మతపరమైన అంశాలు, మత మౌఢ్య సంస్థలైన బజరంగ్దళ్ లాంటి వారి అక్రమాలు- ఏ రంగంలోనూ ప్రగతి కనిపించకపోవటం వంటివి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పనిచేశాయి. అందుకే ప్రధానమంత్రితో సహా కార్యకర్తలు ‘జై బజరంగ్ బలి’ అని రెండు చేతులెత్తినా హనుమంతుడు ఆ చేతులు పట్టుకొని హిందూ మహా సముద్రంలోకి విసిరేశాడు. సరైన పాలన చేయకుండా, అధికార దుర్వినియోగం చేస్తే ఈ రామ సేవకుడే కాదు, స్వయంగా ఆ శ్రీరాముడే శిక్షిస్తాడన్న సత్యం మొన్న అయోధ్యలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి నిరూపించింది. బీజేపీ నాయకులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి. పాలన సరిగా చేయకుండా దేవుళ్ల పేర్లు వల్లించినంత మాత్రాన ఆ దేవుళ్లు కూడా వీళ్లని రక్షించరన్నది కఠోర సత్యం. మానవ ప్రయత్నం లేకపోతే దైవ సహాయం ఉండదు. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్వ్స్.
ఇక కర్ణాటక ఎన్నికలు ‘సౌత్ గ్రూప్’ అని వారు పేరు పెట్టిన మిగతా రాష్ర్టాల మీద ఏమి ప్రభావం చూపిస్తాయన్నది ముఖ్య చర్చనీయాంశమైంది అందరికీ! ఈ ఏడాది జరగవలసిన ఐదు రాష్ర్టాల శాసనసభా ఎన్నికల్లో అందరి దృష్టి తెలంగాణ మీద ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మిజోరంలో స్థానిక పార్టీదే గెలుపు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభు త్వం ఉన్నది. కర్ణాటక ఫలితం అక్కడి కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు తేవచ్చు. ఇక బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీ పోట్లాడుకొని, ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్న రెండు రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్న సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఇక మిగిలింది 2014లో రాష్ట్రంగా ఏర్పడి, సమర్థుడైన ఉద్యమ నాయకుడి పాలనలో ప్రగతిపథంలో అత్యద్భుతంగా దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ. విలక్షణ చారిత్రక నేపథ్యంలో మినీ ఇండియాగా అన్ని భాషల, మతాల, సంస్కృతుల కలయికగా, ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం, ప్రకృతి వైపరీత్యాలు పెద్దగా కలగని దక్కన్ పీఠభూమి. ప్రత్యేక దేశంగా 1948 దాకా సుసంపన్నంగా అలరారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు రాజుగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం సంస్కృతిలోనూ, సంపదలోనూ, భాషా పటిమలోనూ, ప్రజల ఉత్తమ సంస్కారంలోనూ ఎంతో ఉన్నతమైనది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులకు ఊడిగం చేసినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి జరిగినా, ఒక్క మంచి మాట లేదు. చేస్తున్న పనులు పాడు చేయటానికే ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాలు కట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, దాన్ని కేసులు వేసి ఆపటం! రైతుల సౌలభ్యం కోసం తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేస్తాడట కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు! సత్తా ఉంటే అందులోని చిన్న చిన్న లోపాలు ఎలా సరిదిద్దాలో చెప్పాలి. చర్చకు వస్తాడా రేవంత్‌రెడ్డి? కాంగ్రెస్‌కు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మాలి తెలంగాణ వాసులు.. ఆలోచించండి?
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉద్యమం కోసం ఏర్పడి, దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న దాని విలువ తెలిసిన నాయకుడే ముఖ్యమంత్రిగా పాలన చేయడం ఒక అద్భుతమైతే, అన్నేండ్లు పడ్డ కష్టాలు కేవలం ఒక దశాబ్దం కాకుండానే తీర్చి రాష్ర్టాన్ని ప్రగతి మార్గంలో పరుగులు పెట్టించడం ఇంకో అద్భుతం! ఇక ఇప్పుడు పాత రెండు జాతీయపార్టీల దృష్టంతా తెలంగాణ మీద ఉన్నది. మొదటి ఎన్నిక కంటే రెండవ ఎన్నికల్లో తమ పాలన వల్ల ఎక్కువ ఓట్లు, సీట్లు తెచ్చుకున్న, భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీని 2023లో శాసనసభకు జరిగే ఎన్నికలో ఎలా ఎదుర్కోవాలి? కర్ణాటకలో ఓడినా తెలంగాణలో మాదే విజయం అంటూ భేషజాలకు పోతున్న బీజేపీ, కర్ణాటకలో గెలిచాం కాబట్టి తెలంగాణ మాదే అంటున్న కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఇక్కడ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం! గతంలో కేంద్ర, రాష్ర్టాల్లో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం పట్ల ఎటువంటి దృక్పథాన్ని గతంలో, ప్రస్తుతం వెలిబుచ్చుతున్నాయో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.
రాజకీయ నాయకులు-కాంగ్రెస్ పార్టీ: హిమాచల్‌ప్రదేశ్‌లో, కర్ణాటకలో ప్రియాంకా వాద్రా వాగ్ధాటి, తెలివి చూసి ముచ్చటేసింది. కానీ, తెలంగాణలో చేసిన భాషణ చూస్తే జాలేసింది. రథసారథి సమర్థుడు ఉంటే సరిపోదు; గుర్రాలు కుంటి గుర్రాలుంటే ఆ ప్రయాణం ఎట్లా సాగుతుంది? పాపం! ఆవిడకు స్పీచ్ ఎవరు రాసిచ్చారో కానీ తెలంగాణ గురించి, జరుగుతున్న కార్యక్రమాలు, విధానాలు, పారిశ్రామిక ప్రగతి వంటి విషయాల్లో 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు ఉన్నటువంటి పరిస్థితి నేడు ఉన్నట్టు రాసిచ్చారు. ఆవిడకేం తెలుసు? అదే నిజమనుకొని చదివేసింది.
ఆంధ్రా, రాయలసీమ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ఎమ్మెల్యేలు తమ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. మంత్రివర్గంలో కూడా వ్యవసాయ మంత్రి తెలంగాణవాడే, కృష్ణా, గోదావరీ నీళ్లన్నీ ఆంధ్రకు తరలిస్తారు; హోంమంత్రి తెలంగాణవాడే, ఉద్యమం చేస్తున్న యువతను చితక్కొట్టడానికి. జయశంకర్ సార్ ఎన్నో సభలలో చెప్పారు. ‘హోంమంత్రి తెలంగాణ మనిషి ఉన్నా ఏం లాభం? టోపీ ఆయన నెత్తి మీద, లాఠీ ఆంధ్ర ముఖ్యమంత్రి చేతుల్లో’ అని! అలా 41 ఏండ్లు చేవ చచ్చి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ కాలం గడిపారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు కూడా కర్ణాటకలో గెలిచామని ఎగిరిపడుతున్నారు. అక్కడ పరిస్థితులు వేరు. మరి తెలంగాణలో? పాత వాసనలు వదులుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా సైంధవుల్లాగా అడ్డుపడుతారు. నోరుతెరిస్తే అబద్ధాలు, అడ్డగోలు మాటలు! పరిపాలనలో లోపాలు ఎత్తిచూపలేక వ్యక్తిగత దూషణలు. అసలు కాంగ్రెస్ పార్టీవారికి ఎవరినైనా కుటుంబ పాలన అని అనే అర్హత ఉన్నదా? 2004లో పొత్తు పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రం ఆరు వారాలలో ఇస్తామని మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక ముఖ్య విషయం.. కేసీఆర్ నిరాహార దీక్షకు భయపడి 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని డిసెంబర్ 9న ప్రకటన చేసి, మళ్లీ 23న మాట వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వల్లనే 1200 మంది తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలే. ఈ పాపం ఆ పార్టీకి ఊరికే పోదు.
ఇక చివరగా కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి గురించి కొద్దిగా ఆలోచించాలి. నిజానికి మొదటినుంచి జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది పార్టీలుగానే మిగిలిపోయాయి, కానీ వారికి దక్షిణాది వారి సంస్కృతి, సమాజం గురించి ఏమీ తెలియదు. అందుకే ఇక్కడి సమస్యలు, ప్రజా జీవన విధానం వారికి అర్థం కాదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అన్ని సంస్కృతుల అవగాహనతో పాటు, అపారమైన మేధోసంపత్తి, అన్య మతాల పట్ల గౌరవాభిమానాలు, మనుషులంతా ఒకే సమాజమన్న సమభావన ఉన్నాయి. తెలియని విషయం, చదివి, అడిగి తెలుసుకునే సహనం, ఓపిక ఉన్నాయి. అధికారం ప్రజా సేవ కోసమే అన్న సోయి ఉన్నది. ఈ వ్యక్తిగత లక్షణాలకు తోడు నూతన పథకాలను ఆవిష్కరించే ప్రజ్ఞ, తెలివి, వాటిని ఆచరణలో పెట్టగలిగిన స్థయిర్యం ఉన్నాయి. పద్నాలుగేండ్లు ఉద్యమ సయయంలో ఎంత పట్టుదల చూపించారో, తొమ్మిదేండ్లు ప్రభుత్వ పాలనలో అంతకు రెట్టింపు నిబద్ధత చూపించారు. సౌహార్దత, సౌభ్రాతృత్వం, ఐక్యత ఉంటే సాధించలేనివేవీ లేవని నిరూపించారు. ఇటువంటి విశాల భావాలు, గొప్ప హృదయం గల మానవీయ నాయకుడు భారతదేశానికి అత్యవసరం. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి పాలన చేస్తే ఒక దశాబ్దంలోనే భారత్ విశ్వగురు అవడం ఖాయం! ఆలోచించండి, ఎన్నుకోండి. 2024 ఎన్నికల సునామీలో నిలిచి గెలవండి!
కనకదుర్గ దంటు
89772 43484