ఇటీవల మా ఊరు కామారెడ్డికి వెళ్లినప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఓ ముసలవ్వ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ అభయ ముద్రతో రెండు చేతులు పైకెత్తి అన్న మాటలివి. అవి అలతి అలతి మాటలే అయినా అచ్చంగా కామారెడ్డి ప్రజల మనోభావాలకు అద్దం పట్టేట్టుగా ఉన్నాయి.
నిజమే కదా. అడిగిన వరాలు ఇచ్చే దేవుడు, అడగని వరాలు కూడా ఇచ్చే దేవుడు స్వయంగా ఇంటి గడప లోపలికి వచ్చి నిలబడితే ఆ కుటుంబసభ్యుల భావోద్వేగం, తన్మయం ఎలా ఉంటుందో ఇవాళ ఉద్యమ నేత రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సందర్భంలో స్థానిక ప్రజల మనోభావాలు అట్లాగే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించడానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీలో దిగి తొడలు చరుస్తున్న బుడత కీచుల పీచమణచడానికి నడుం బిగించిన కామారెడ్డి కదనకుతూహలంతో ఊగిపోతున్నది.
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆగస్టు 21 నాడే కామారెడ్డిలో కేసీఆర్ విజయం ఖాయమైపోయింది. ఇక మిగిలింది రికార్డు మెజారిటీ ఎంత? అన్నదే. ఈ నేపథ్యంలో జరుగుతున్న బీఆర్ఎస్ సభలు, సమావేశాలకు హాజరవుతున్న పార్టీ శ్రేణులు ప్రజల ఉత్సాహం చూస్తుంటే అవి ఎన్నికల కోసం అన్నట్టుగా లేవు. డిసెంబర్ 3 నాటి కేసీఆర్ విజయోత్సవ సన్నాహక సమావేశాలుగా అగుపిస్తున్నాయి.
69 ఏండ్ల కిందట కామారెడ్డి నియోజకవర్గం బీబీపేట మండలం పోసానిపల్లి (కోనాపూర్)లో కల్వకుంట్ల రాఘవరావు-వెంకటమ్మ దంపతుల కడుపు పంటగా జన్మించిన కేసీఆర్, తెలంగాణ ప్రజల కలల పంటగా అవతరిస్తారని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. మా పెద్దలు బతికినంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్న వారే. సమైక్య పాలనలో వివక్షను ఎదుర్కొన్నవారే.
ప్రత్యేకించి కామారెడ్డి జిల్లా కేంద్రం కావాలని పరితపించిన వాళ్లే. అందుకోసం నాటి ముఖ్యమంత్రులకు లేఖలు రాసి విజ్ఞాపనలు చేసినవారే. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడ్డప్పుడు పిడికిలి బిగించిన కామారెడ్డి బిడ్డలు ఆ తర్వాత ఉద్యమం చల్లారిపోవడంతో మూగ సాక్షులుగా మిగిలిపోయారు. మా ముందుతరాల్లో అంటే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రం ముసుగులో ఆనవాళ్లు లేకుండా చేసిన సంవత్సరం 1956 నాటికి యువకులుగా ఉన్న వాళ్లు పోగా పోగా ఊపిరి బిగ పట్టి బతికిన పిడికెడు మంది అవసాన దశలో 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని కండ్లారా చూశారు.
ఆరు దశాబ్దాల అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్‌ను నిండు మనసుతో ఆశీర్వదించారు. వారిలో కామారెడ్డి స్కూల్లో మాకు చిన్ననాడు పాఠాలు చెప్పిన మఠం భద్రయ్య (90) సార్, ప్రొఫెసర్ అమరేశం రాజేశ్వర శర్మ (90) సహా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో కొంతమంది వృద్ధవీరులు, మలిదశ ఉద్యమంలో సైతం మేమున్నామంటూ కదిలి వచ్చిన ఆ అపర భీష్ములు, కామారెడ్డికి కలిసొచ్చిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నారు. కామారెడ్డి ప్రాంత హైస్కూల్ విద్యార్థులుగా 1969 ఉద్యమంలో ఉడుతాభక్తిగా పాల్గొన్న మా తరాలవారు 70 వయస్సుకు దగ్గరవుతున్నా విశ్రాంత జీవితాన్ని పక్కనపెట్టి కేసీఆర్‌ను గెలిపించడానికి సమాయత్తమవుతున్నారు.
75 ఏండ్ల కిందట జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన కామారెడ్డి వాస్తవ్యుడు ఫణిహారం రంగాచారి మొదలుకొని మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సహా ఎందరో అమరవీరులు, వేలాదిమంది సమరవీరులు కామారెడ్డి కన్నబిడ్డలే. ఆ చైతన్యస్ఫూర్తి భూమికగా కామారెడ్డి కేసీఆర్‌ను తొలినాళ్లలోనే ఆదరించింది, అక్కున చేర్చుకుంది. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా అడుగు ముందుకు వేసినప్పుడు కామారెడ్డి తల్లి చేతులు చాచి హత్తుకున్నది.
కేసీఆర్ జలసాధన దీక్ష, కూలిపని, నేతన్నల కోసం భిక్షాటన కార్యక్రమాల కేంద్రం కామారెడ్డి. రాష్ట్రంలోనే తొలిసారిగా కామారెడ్డి బార్ అసోసియేషన్ తెలంగాణ కోసం తీర్మానం చేయగా, ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘ధూంధాం’ పురుడు పోసుకున్నది కామారెడ్డిలోనే. 20 ఏండ్ల కిందటే కామారెడ్డి మండలం ఉద్యమ బ్రిగేడియర్‌గా కేసీఆర్ వ్యవహరించారు. టీఆర్ఎస్ ఏర్పడిన తొలినాళ్లలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి గులాబీ జెండా ఎత్తి కేసీఆర్ వెంట నడిచింది.
నాడు నిజామాబాద్ జిల్లా పరిషత్తుపై గులాబీ జెండా ఎగిరింది అంటే అది కామారెడ్డి కన్నబిడ్డలు ఇచ్చిన తీర్పు పర్యవసానమే. 2004, 2009 ఎన్నికల్లో పొత్తుల వల్ల ఇతర పార్టీల అభ్యర్థులు టీఆర్ఎస్ మద్దతుతో కామారెడ్డి అసెంబ్లీకి పోటీచేసి యాభై వేల మెజారిటీలు సాధించగలిగారంటే అది కేసీఆర్ పట్ల ప్రజలకున్న అభిమానమే. 2012, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది. 2001 నుంచి నేటివరకు కామారెడ్డి కేసీఆర్ కంచుకోట. ఈ నేపథ్యంలో కామారెడ్డి భూమిపుత్రుడు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ రంగంలో అడుగు మోపి విజయం సాధించడం నల్లేరు నడకే. 38 ఏండ్ల ఎన్నికల ప్రస్థానంలో ఎక్కడ పోటీచేసినా ఓటమి ఎరుగని అజేయుడు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఆ గడ్డ చేసుకున్న అదృష్టంగా చెప్పవచ్చు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఏ ఊరు వెళ్లినా, ఏ వాడ వెళ్లినా ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధి పట్ల సంతృప్తి, ఇకపై కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయని దశ తిరిగినట్టేనన్న హర్షాతిరేకాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంటింటికి తాగునీరు, రోడ్లు, రవాణా సదుపాయాలు, నిండుకుండలా చెరువులు కుంటలు, పెరిగిన భూగర్భ జలాలు, 24 గంటల కరెంటు, పచ్చదనం, పరిశుభ్రం, పంట పొలాలు, విద్యాసంస్థలు, వైద్య సౌకర్యాలు, వంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కామారెడ్డి కండ్లముందే సాక్షాత్కరిస్తాయి.
మేము చదివిన డిగ్రీ కళాశాల పక్కనే మెడికల్ కళాశాల వస్తుందని ఆరు దశాబ్దాల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏనాడైనా ఊహించారా? రథాల రామారెడ్డి, రాజంపేట, బీబీపేట మండలాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారి, ప్రభుత్వం ప్రజలకు ఇంత చేరువ అవుతుందని అనుకున్నామా?ఇవన్నీ చూస్తున్న కామారెడ్డి ప్రజలు తొందర్లోనే కాళేశ్వరం 22వ ప్యాకేజీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ, వివిధ పరిశోధన కేంద్రాలు, డైలీ మార్కెట్ భవనాలు, పాత రాజంపేట గేట్, పంచముఖి హనుమాన్ రైల్వే కమాన్లు ఇవన్నీ సాకారం కావాలంటే అదొక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్న నిశ్చయంతో స్వాగతిస్తున్నారు. రాష్ట్ర సాధన మొదలుకొని విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమ, ఐటీ, విద్య, వైద్య రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించిన కేసీఆర్‌కు కామారెడ్డి కోర్కెలు పెద్ద విషయమేమీ కాదని చెప్పుకొంటున్నారు. చర్చించుకుంటున్నారు.
ఐదు శతాబ్దాలుగా విలసిల్లుతూ వచ్చిన కామారెడ్డి ప్రాంత బిక్కనూరు, రామారెడ్డి, దోమకొండ సంస్థానాలు కళలకు సాహిత్యానికి కాణాచిగా నిలిచాయి. గొలుసుకట్టు చెరువులు, గుళ్లు, గోపురాలు, పాడిపంటలు, సహృదయులైన ప్రజలతో ఈ ప్రాంతాలు విరాజిల్లినట్టు 200 ఏండ్ల కిందట ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన ఏనుగుల వీరాస్వామయ్య (1780-1836) తన ‘కాశీ యాత్రా చరిత్ర’లో పేర్కొన్నాడు. ప్రత్యేకించి దోమకొండ సంస్థానాన్ని తిరుపతి వేంకటకవులు, శేషాద్రి రమణ కవులు సందర్శించారు అంటే ఆశ్చర్యం కలగకమానదు.
దోమకొండను పరిపాలించిన కామినేని వంశీయులు సృష్టించిన రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఆ రోజుల్లోనే వారు తెలుగు, ఉర్దూ, పారశీక నిఘంటువులు వెలువరించి తమ లౌకిక స్ఫూర్తిని చాటుకున్నారు. అలా వెలుగు వెలిగిన కామారెడ్డి ప్రాంతం, జాతీయ రహదారి, రైల్వే సౌకర్యాలు ఉండి కూడా సమైక్య రాష్ట్రంలో ఆదరణకు నోచుకోలేదు. అన్యాయంపై వివక్షపై తిరగబడ్డ కామారెడ్డి బిడ్డలు అడవుల పాలయ్యారు. పోలీసుల పద ఘటనల్లో నలిగిపోయారు. మూడు దశాబ్దాల పాటు భయం కమ్మేసిన జీవితాలు, కూలిన గోడలు, నెర్రెలు పాసిన నేలలు, వలసలు, ఆత్మహత్యలు వెరసి ఒక సంక్షోభ కల్లోల కడలిగా కామారెడ్డి ఉక్కిరిబిక్కిరైంది.
కేసీఆర్ ఉద్యమ జెండా ఎత్తిన నాటినుంచి మళ్లీ జవసత్వాలు సంతరించుకుంది. కేసీఆర్ ఉద్యమ కవాతులో కామారెడ్డి కదం తొక్కింది. ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి కామారెడ్డి కర్తవ్యోన్ముఖమైంది. మరోవైపు తనవెంట నిరంతరంగా నడిచిన కామారెడ్డి ప్రజల రుణం తీర్చుకోవడానికి సాక్షాత్తు కేసీఆర్ రంగంలో దిగుతున్నాడు. ఇదొక అద్భుత రాజకీయ సన్నివేశం. ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు. కేసీఆర్ ప్రజల వైపు ఉన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. కేసీఆర్ స్పష్టంగా ఉన్నారు. ఈ లెక్క పక్కా. ఇక కాకి లెక్కలు, కాలం చెల్లిన గణాంకాల అవసరం లేదు.
డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238