దేశానికి దిక్సూచితెలంగాణ.. ఒక రాష్ట్రం మాత్రమే కాదు, దేశానికి ఒక స్ఫూర్తి కిరణం. అభివృద్ధి వైపు నడవాలనుకునే వారికి ఓ మార్గదర్శి. బుడిబుడి అడుగుల వయస్సులోనే దేశానికే వన్నె తెచ్చిన ఓ ప్రయోగశాల. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే.. తెలంగాణ ఏర్పడిన పదేండ్లలోనే చాలా సాధించి చూపించింది. సున్నా నుంచి కూడా కాదు, అంతకు దిగువ నుంచి మొదలైన ప్రయాణం నేడు వంద సంఖ్యను చేరుకుంది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించింది. ఇదంతా ఏదో తనంతట తానుగా జరిగిన అభివృద్ధి కాదు.
ఈ స్థాయిలో ప్రగతి కండ్ల ముందు కనిపిస్తోందంటే దాన్ని నడిపిన నాయకుడు ఎంత నైపుణ్యం కలిగినవాడు అయ్యుండాలి? ప్రతీక్షణం ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఉండాలి? అలాంటి లక్షణాలున్న, నైపుణ్యమున్న గొప్ప వ్యక్తే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడమే కాదు, దానిని దేశానికే వెలుగుగా మార్చిన గొప్ప వ్యక్తి, మహాశక్తి కేసీఆర్. ఎన్నో అవమానాలను తట్టుకొని, అడ్డంకులను దాటుకొని తెలంగాణ నిలబడిందంటే దానికి కారణం కేసీఆర్.
తెలంగాణ ఆవిర్భావమే ఓ గొప్ప మహోద్యమం. అడుగడుగునా అడ్డంకులు, చీదరింపులు, ఛీత్కారాలు. ‘మీకెందుకు రాష్ట్రం?’ అని ఒకరు, ‘మీకు పాలన తెలియద’ని మరొకరు, ‘అసలు చిన్న రాష్ర్టాలతో ఉపయోగం ఉండదు. మరింతగా కష్టాల్లోకి వెళ్లక తప్పద’ని మరికొందరు అన్నారు. ఎన్నో ఉదాహరణలు చూపించారు. కానీ, చిన్న రాష్ర్టాలతో ఉపయోగం ఉండదని మాట్లాడినవారికి చెంపపెట్టు లాంటి సమాధానాలు ఇచ్చింది ఈ నేల. చిన్న రాష్ర్టాలతో ఎంత ప్రగతి సాధించవచ్చో కండ్లకు కట్టింది. ‘చిన్న రాష్ర్టాలే దేశాన్ని నడిపిస్తాయి. దేశానికి అన్నం పెడతాయి. పెద్ద రాష్ర్టాలను సాకుతాయి’ అని చూపించింది, ప్రస్తుతం చూపిస్తున్నది మన తెలంగాణ.
ఒకప్పుడు ఈ ప్రాంతం కరువుకు, కష్టాలకు, కన్నీళ్లకు చిరునామా. పేదరికాన్ని భరించలేక, పని దొరక్క బొంబాయి, దుబాయి వలసపోయిన కుటుంబాలెన్నో. పంటలకే కాదు, పాడి పశువులు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి తెలంగాణది. అలాంది పరిస్థితుల్లోనూ మన వనరులు, సంపదను దోచుకునేందుకు నాటి పాలకులు కాచుకుని కూర్చునేవారు. ఈ ప్రాంత ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. కానీ, నేడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. వ్యవసాయరంగంలో ఉమ్మడి రాష్ర్టాన్ని మించి ప్రగతి సాధించింది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. ఒక్క వ్యవసాయరంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ నేడు అగ్రభాగాన నిలిచిందంటే దానికి కారణం కేసీఆరే.
ఈ సందర్భంగా మనం మరో ఉదాహరణను పరిశీలించాలి. చిన్న రాష్ర్టాలపై అపోహలకు కారణాలు ఏమిటనేది తెలుసుకోవాలి. 2000వ సంవత్సరంలో అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడు కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేసింది. అవే ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ర్టాలు. అవి ఏర్పడి 24 ఏండ్లు పూర్తయ్యాయి. అంటే వాటి ప్రగతి ఏ స్థాయిలో ఉండాలి? కానీ, ఆ రాష్ర్టాలు నత్తలకు నడక నేర్పిస్తూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్ జీఎస్డీపీ రూ.3.33 లక్షల కోట్లుగా ఉంటే.. అందులో 28.2 శాతం అప్పులున్నాయి. ఝార్ఖండ్ జీఎస్డీపీ రూ.4.23 లక్షల కోట్లు కాగా.. 27 శాతం అప్పులే. ఛత్తీస్‌గఢ్ జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లయితే.. అందులో 25 శాతం అప్పులే. అదే తెలంగాణ విషయానికొస్తే.. జీఎస్డీపీ దాదాపుగా రూ.14 లక్షల కోట్లు కాగా.. అప్పులు 23.8 శాతమే. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.05 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఇక ఆ రాష్ర్టాల తలసరి ఆదాయాలు వరుసగా.. ఛత్తీస్‌గఢ్ రూ.1.33 లక్షలు, ఝార్ఖండ్ రూ.91 వేలు, ఉత్తరాఖండ్ రూ.2.33 లక్షలు కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3 లక్షలకు పైగా ఉండటం విశేషం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.28 లక్షలు. అదే ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం రూ.1.32 లక్షలు, ఛత్తీస్‌గఢ్ తలసరి ఆదాయం రూ.72 వేలు, ఝార్ఖండ్ తలసరి ఆదాయం రూ.57 వేలు. ఒకసారి గత, ప్రస్తుత తలసరి ఆదాయాలను పరిశీలిస్తే.. ఏ రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉందనేది తేటతెల్లమవుతుంది. పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతికి ఇది ఒక పరిపూర్ణమైన ఉదాహరణ.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో 2014-15లో 2.815 శాతం పెరుగుదల ఉండగా.. 2022-23లో 5.879 శాతం పెరుగుదల నమోదైంది. పారిశ్రామిక రంగంలో మహిళలకు అవకాశాలు పెరిగాయి. 40 శాతం పరిశ్రమలు మహిళలే యజమానులుగా పురుడుపోసుకున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ మహమ్మారిని పారదోలారు. భూగర్భ జలాలు పెరిగాయి. అటవీ విస్తీర్ణం పెరిగింది. పట్టణాల్లో చెత్త నుంచి విద్యుత్తు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, గ్రామాల అభివృద్ధి.. ఇలా ఒక్కటేమిటి అన్నీ కండ్ల ముందే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తించిన కేంద్రం అవార్డులతో పట్టం కట్టింది.
ఇలా చెప్పుకొంటూపోతే తెలంగాణ విజయాల పరంపరకు ముగింపు ఉండదు. ఆ విజయాలకు ఆద్యుడు కేసీఆర్. చీకటి నుంచి వెలుగుల వైపు తెలంగాణ ప్రయాణానికి ఒక వారధి మాత్రమే కాదు, సారథిగా ముందుండి నడిపించారు. ఒక పరిపూర్ణమైన తెలంగాణను రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికైనా మనం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్)
-వై.సతీష్‌రెడ్డి
96414 66666