నాడు తెలంగాణ భూములు నెర్రెలు వారి, పల్లేర్లు మొలసి, పడావు వడి పనికి రాకుండా ఉండేవి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములు పనికిరాకుండా పోయినయి. అటువంటిది ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసిన పుట్ల కొద్దీ ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయి. నేడు తెలంగాణ బంగారు పంటలు పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
అరవై ఏండ్లలో రైతుల గోసను పట్టించుకున్నవారెవరూ లేరు. వందల ఏండ్ల చరిత్ర గలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ రైతుల కష్టాలను ఎన్నడూ తీర్చ లేదు. అలాంటి కాంగ్రెస్ మాటలను తెలంగాణలో ఎవరూ నమ్మే స్థితిలో లేరు. కర్ణాటకలో గెలిచామని, తెలంగాణలో గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రజల ఆవేదనలను ఎన్నడూ పట్టించుకోలేదు. కర్ణాటక రైతులు ఇపుడు మొసళ్లను తెచ్చి, సబ్ స్టేషన్ల ముందు నిరసన తెలుపుతున్నారంటే వారి గోసను మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అంటేనే కాలయాపన. ఆ పార్టీతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యం.
ఒకనాడు చెప్పులు వరుసలో పెట్టి యూరియా కోసం ఎదురుచూసినం, మళ్లీ మొసళ్లను తెచ్చి నిరసన తెలిపే పరిస్థితులను తెచ్చుకోవద్దు. కాంగ్రెస్ కాలయాపన కమిటీల పేరుతో తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించకుండా, మరోవైపు ఉద్యమాన్ని అణచివేయాలని చూసింది. అటువంటి పార్టీ ఇప్పుడు అధికారమే ధ్యేయంగా చూస్తోంది. అందుకే మనం మరింత అప్రమత్తతతో మెదలాల్సిన అవసరం ఉన్నది.
‘రైతు రాజ్యం రావాలి’, ‘రైతులు మహారాజు కావాలి’ అంటూ రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం మాట్లాడే మాటలవి. ఆచరణలో అమలుకు నోచుకోవు. అన్నమో రామచంద్ర అన్నా, కనీసం కనికరించని కసాయి పాలనలో రైతు తనను తాను బలితీసుకున్న సంఘటనలు మన తెలంగాణలో ఒకప్పుడు ఎన్నో.
పుట్టెడు దుఃఖంతో తమ కష్టాన్ని తీర్చాలని శాంతియుత నిరసన చేస్తే రైతులపై తుపాకీ తూటాలు దించిన చరిత్ర. ఓ దశలో వ్యవసాయమే దండుగ అంటూ రైతుల బతుకులను సర్వనాశనం చేసిన సందర్భాన్ని చూశాం. తెలంగాణ రైతాంగాన్నే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పంటలే పండకుండా, చుక్క నీరు మన భూములకు అందకుండా చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. నల్ల రేగడి భూములు, ఎర్రనేలలతో బంగారం లాంటి పంటలు పండే తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం గట్టిగానే జరిగింది. ఫలితంగా రైతాంగం వ్యవసాయాన్ని వదిలి వలస వెళ్లారు. అటువంటి అమానవీయ దాడి రైతాంగంపై జరిగింది. రైతులను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప, రైతు లేని రాష్ట్రం రాజు లేని రాజ్యం వంటిదని గుర్తించలేకపోయారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఉద్యమనాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తిగా మార్చివేశారు. ‘నేడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అన్నట్టు వ్యవసాయాన్ని పండగలా మార్చారు. అందుకోసం రైతుకు మద్దతు ధర అందించడంతో పాటు పెట్టుబడి సాయం.. రైతుబంధు, రైతుబీమా లాంటి భరోసా కల్పించారు. మత్తడి దుంకుతున్న చెరువులు, పెరిగిన భూగర్భ జలాలు, తిప్పలు లేని కరెంటు సరఫరా… సకాలంలో ఎరువులు విత్తనాల సరఫరా చేయడం వల్ల రైతులు గుండె నిబ్బరంతో ఉండగలుగుతున్నారు.
రైతుల వ్యథలు, కన్నీటి గోసలు తెలిసిన అసలు సిసలైన రైతు బిడ్డ మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అందుకే, ఈ దేశానికి ఇప్పుడు రైతును ఆదర్శంగా నిలుపుతున్నారు. రైతు అభివృద్ధే,దేశాభివృద్ధ్దిగా భావించే కేసీఆర్ పాలనలో మహారాజు అవుతున్నారు. ఈ దేశానికి ఇప్పుడు రైతు రాజ్యం కావాలి. అది కేసీఆర్ తోనే ఆవిష్కృతమవుతుంది.
సంపత్ గడ్డం
78933 03516