‘ఎహె తెలంగాణోళ్లకు పనొస్తదా, వ్యవసాయమొస్తదా? అసలు అక్కడ పంటలు పండుతయా? అదంత ఎడారే కదండీ.. అందుకే వాళ్లు బొంబాయికి, దుబాయికి బతుకపోతరు’ తెలంగాణ రాకముందు ఇసొంటి మాటలెన్నో విన్నం. నిజం చెప్పాలంటే అట్లనే ఉండే మన బతుకులు. ఎప్పుడు కరెంటు వస్తదో తెల్వది, ఒకవేళ వస్తే ఎప్పుడు పోతదో తెల్వదు. బాయిలళ్ల నీళ్లు లేకుండా, బోరు పొక్కలు ఎండిపోతుండే పంటలు పండక అలమటించినం. ఆ రోజులు తల్సుకుంటే ఒళ్ళు జలదరిస్తది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణ తన జీవితాన్ని పునఃప్రారంభించింది. శిథిలమైన, పాలనా సౌలభ్యం లేని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసి మళ్లీ అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మించుకుంటూ ముందుకుపోయింది. నూతన సచివాలయమే తాజా ఉదాహరణ. బ్రిటిష్ పార్లమెంటుకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నటువంటి ఈ అధునాతన సచివాలయం భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
ఎట్లుండె తెలంగాణ, ఎట్లయింది? తొమ్మిదేండ్లళ్ల అద్భుతంగా అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు, ఉపాధి, పంటలు.. ఇలా ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ. ప్రపంచ నగరాలతో పోటీపడుతున్నామంటే అతిశయోక్తి కాదు. మొన్నటికి మొన్న హీరో రజనీకాంత్ ‘తాను ఇరువై రెండేండ్ల తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ కోసం వచ్చానని, ఇది హైదరాబాదా లేక న్యూయా ర్కా?’ అంటూ ఆశ్చర్యపోయారు. అంటే మన రాష్ట్రం లో అభివృద్ధి ఏ స్థాయిలో దూసుకుపోతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు తెలంగాణ నగరా లు ప్రపంచ మేటి నగరాలతో పోటీపడుతున్నాయంటేనే ఒంటి మీద రోమాలు నిక్కపొడుస్తున్నాయి.
పట్టుదలతో, దీక్షతో, కసితో, కోపంతో, ప్రేమతో, ఇష్టంతో పనిచేస్తేనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. తొమ్మిదేండ్లలో దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఉదాహరణకు దళితబంధు, రైతుబంధు, రైతుబీమా లాంటి గొప్ప పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి అమలుచేస్తున్నారు. వారి పాలనలో అద్భుతమైన పథకాలు తెలంగాణకు గుండెకాయలా నిలిచాయి. తత్ఫలితంగా నేడు తెలంగాణ దేశానికే దిక్సూచి అయ్యింది. బీజేపీ వాళ్లు లావు మాట్లాడుతరు కనీ తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాలు ఎందుకు కాపీ కొడుతున్నాయో చెప్పాలి. కేంద్రం మన దగ్గరి నుంచి కాపీ కొట్టిన పథకాలు మచ్చుకు ఓ పది రాస్తాను చూడండి.‘రైతుబంధు-ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’, ‘మిషన్ భగీరథ-జల్ జీవన్ మిషన్’, ‘టీఎస్-ఐపాస్-ఇన్వెస్ట్ ఇండియా ఇన్షియేటివ్’, ‘తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-ప్రధాన్‌మంత్రి కుశాల్ వికాస్ యోజన’, ‘టీ-హబ్-స్టార్టప్ ఇండి యా’, ‘షీ టీమ్స్- కేంద్రమే కాదు, ఇతర రాష్ర్టాలు కూడా మహిళల భద్రత కోసం ఈ పథకాన్ని వేరే పేరు తో అమలు చేశాయి’, ‘కంటి వెలుగు- నేషనల్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపయిర్మెంట్ సర్వే’, ‘హరితహారం-గ్రీన్ ఇండియా మిషన్’, ‘మొబైల్ వెటర్నరీ క్లినిక్-కేంద్రమే కాదు ఇతర రాష్ర్టాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి’, ‘తెలంగాణ ఫైబర్ గ్రిడ్-నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్’.. ఇలా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని కొన్ని రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇది యావత్ తెలంగాణ జాతికే గర్వకారణం.
ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి పెద్ద కంపెనీలు వచ్చినా మొదట తెలంగాణ వైపే చూస్తున్నాయి. తెలంగాణలో కంపెనీలు పెట్టాలనే వాళ్ల ఉత్సాహం చూస్తే అసలు మన తెలంగాణ పదేండ్ల కింద పొట్టచేత పట్టుకుని ఆకలిచూపులు చూసిన ఆ తెలంగాణేనా అని అనుమానం వస్తున్నది. ఈ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రంగా, ప్రజలుగా మనం ఎంత ఎదిగామో, ఎంతదూరం ప్రయాణం చేశామో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఉబెర్, ఆపిల్, ఫేస్బుక్ ఇలా ప్రపంచ దిగ్గజాలు వాళ్ల సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేయడం వెనుక మంత్రి కేటీఆర్ కృషి ఎనలేనిది. అలాంటి పెద్ద కంపెనీల రాకతో వాటి అనుబంధ సంస్థలు ఎన్నో ఇతర చిన్నచిన్న కంపెనీలు కూడా తెలంగాణకు వచ్చాయి. ఎన్నో దేశీయ తెలంగాణ కంపెనీలు కూడా ప్రారంభమైనాయి. మొత్తంగా నేడు తెలంగాణ ఉపాధి గడ్డగా మారింది. దేశ నలుమూలల నుంచి యువత ఉపాధి కోసం తెలంగాణకు రావడం చూస్తుంటే ఒకప్పుడు బొంబాయి, దుబాయికి వలసపోయిన మనం నేడు భారతదేశ యువతను అక్కున చేర్చుకుంటున్నామని ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా ఉన్నది. భారత యువతకు ఉపాధినిస్తూ ఉద్యోగాలకు హరివిల్లులా ఉన్న తెలంగాణ దేశానికి దిక్సూచినే కదా మరి? ఒకనాటి గుజరాత్ మాడల్‌కు, నేటి తెలంగాణ మాడల్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. నాడు గుజరాత్ మాడల్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తే, నేడు తెలంగాణ మాడల్‌లో అభివృద్ధి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ కాంస్య విగ్రహం, హుస్సేన్‌సాగర్ ఒడ్డున గగన వీధుల్లో ఎగురుతున్న భారీ జాతీయ జెండా, నూతనంగా నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం, యాదగిరి నరసింహస్వామి ఆలయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం.. ఇలా ఒకటా, రెండా ప్రతి కట్టడం అద్భుతమే. ఇక ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి కాకుంటే మరేమవుతుంది? బడి పిల్లలకు గొప్ప విద్యాబుద్ధులు నేర్పిస్తూ, జిల్లాకు నలువైపులా అంతర్జాతీయస్థాయి దవాఖానాలు నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదంటే అతిశయోక్తి కాదు.
ఒకనాడు మనం మాట్లాడింది భాషే కాదన్నారు. ఇలాంటి ఎన్నో అవమానాల మధ్య నాడు కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తిండు. పట్టుబట్టి తెలంగాణ సాధించిండు. అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా మన తెలంగాణను నిలవెట్టిండు. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా.
(వ్యాసకర్త: కార్యదర్శి, బీఆర్ఎస్ యూకే ఎన్నారై విభాగం)
-చాడ సృజన్‌రెడ్డి