ఒకప్పుడు సీబీఐ నిబద్ధతకు మారుపేరు. నిజాయితీకి నిలువుదట్టం. వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. ఎందరో వర్ధమాన పోలీసులు సీబీఐని ఆదర్శంగా తీసుకునేవారు. సీబీఐ కేసులు, దర్యాప్తు విధానాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిని చూసి ఇన్స్పైర్ అయిన చాలామంది పోలీసులుగా, సీబీఐ ఆఫీసర్లుగా కూడా మారారు. కానీ, నేడు గత చరిత్రను చూసి మురిసిపోవడం తప్ప, చెప్పుకోవడానికేమీ లేదు. దశాబ్దం కిందట యూపీఏ పాలనలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఉన్న సీబీఐ కాస్త, ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో ‘పంజరంలో చిలుక’లా మారింది. సీబీఐని స్వయంగా సుప్రీంకోర్టు పంజరంలో చిలుక అని సంబోధించిందంటేనే పరిస్థితి ఎంతగా దిగజారిందో, దాని విశ్వసనీయత ఎంత దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు.
మోదీ సర్కారు చేతుల్లో కీలుబొమ్మ వంటి సంస్థకు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం దర్యాప్తు అప్పగించడమంటే, మన నీళ్లకు మనం నీళ్లు వదులుకోవడమే. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరాన్ని కొల్లగొట్టి, బనకచర్లకు లైన్ క్లియర్ చేసి, కావేరి ద్వారా తమిళనాడుకు నీళ్లు మళ్లించాలన్న కపటంతో మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి చేస్తున్న కుట్ర ఇది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం-1946 ప్రకారం.. 1963లో సీబీఐని కేంద్రం ఏర్పాటుచేసింది. రాష్ట్ర పోలీసులు తేల్చలేని, కఠినమైన కొన్ని ప్రత్యేక వ్యవస్థాగత నేరాలు, అవినీతి, భారీ మోసాలు తదితర కేసులను దర్యాప్తు చేసేందుకు ముఖ్యంగా దీన్ని అప్పట్లో ఏర్పాటుచేశారు.
మొదట్లో ఎన్నో కేసులను ఛేదించిన సీబీఐ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కానీ, రానురాను కేంద్ర పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది. మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఈ ధోరణి పరాకాష్ఠకు చేరుకున్నది. 2004 నుంచి 2014 వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కేంద్ర దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల వేటను మొదలుపెడితే, 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఏకంగా పంజరంలో చిలుకలా బంధించింది. గత పదేండ్లలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
గత రెండు దశాబ్దాల్లో కాంగ్రెస్, బీజేపీ పాలనలో సుమారు 200 మంది రాజకీయ నేతలపై సీబీఐ కేసు నమోదు చేయగా, వారిలో 80 శాతానికి పైగా ప్రతిపక్ష నేతలే. 2004-2014 మధ్యకాలంలో యూపీఏ హయాంలో 72 మందిపై కేసులు పెట్టగా, వారిలో 43 మంది రాజకీయ ప్రత్యర్థులే. అదేవిధంగా 2014-2024 దాకా మొత్తం 124 మంది పొలిటికల్ లీడర్లపై సీబీఐ కేసులు నమోదు చేయగా, వీరిలో 118 మంది విపక్ష నేతలే. ఇది సుమారు 95 శాతం. ఇక బీజేపీ పాలనలో పార్టీలవారీగా నమోదైన కేసులను చూస్తే టీఎంసీ 30, కాంగ్రెస్ 26, ఆర్జేడీ 10, బీజేడీ 10, వైఎస్ఆర్సీపీ 6, బీఎస్పీ 5, టీడీపీ 5, ఆప్ 4, ఎస్పీ 4, ఏఐఏడీఎంకే 4, సీపీఎం 4, ఎన్సీపీ 3, డీఎంకే 2. బీజేపీలో చేరాక వారిపై కనీస చర్యలుండటం లేదు.
పశ్చిమబెంగాల్లో సువేందు అధికారి, ముకుల్ రాయ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ, వారు బీజేపీలో చేరాక ఆ కేసు ఎటుపోయిందో తెలియదు. కాంగ్రెస్‌లో ఉండగా హిమంత బిశ్వశర్మపై కేసు పెట్టగా, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేసు పత్తా లేకుండాపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే, 100 కోట్ల విలువైన ఆస్తులపై ఉన్న సీజ్‌ను ఎత్తివేయడం కేంద్రంతో దర్యాప్తుసంస్థల లాలూచీని తెలియజేస్తున్నది. గతంలో టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరగానే వారి కేసులు మాయమయ్యాయి.
కాంగ్రెస్ హయాంలో బీజేపీ నేతలపై పెట్టిన కేసులను ఇప్పుడు దర్యాప్తు సంస్థలు చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. ఉదాహరణకు గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో సీబీఐ కనీసం అప్పీల్ కూడా చేయలేదు.
బీజేపీ పాలకులు వచ్చాక ఈడీ కోరలు మరింతగా పదునెక్కాయి. యూపీఏ హయాంలో రాజకీయ నేతలపై ఈడీ 26 కేసులు నమోదు చేయగా, వారిలో 14 మంది విపక్ష నేతలే. మోదీ హయాంలో మొత్తం 121 మంది రాజకీయ నాయకులపై కేసులు ప్టెటగా, వారిలో 115 మంది ప్రతిపక్ష నేతలే కావడం గమనార్హం. ఇది 95 శాతానికి పైగానే. మోదీ పాలనలో ఈడీ మొత్తం 3 వేలకు పైగా రైడ్లు చేయగా, వాటిలో 29 శాతం మాత్రమే కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసే కేసుల్లో నేర నిరూపణ రేటు ఒక శాతానికి కూడా మించకపోవడం శోచనీయం. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేయడం, కేసు ఫైల్ చేయడం, జైల్లో పెట్టడం, అవసరమైతే లొంగదీసుకుని తమ పార్టీలో చేర్చుకోవడం, లేదా అవినీతి మరక అంటించి ప్రజల్లో వారి పరపతిని తగ్గించజూడటం.. గత పదేండ్లుగా దేశంలో ఇదే తంతు కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై రాహుల్ సహా విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మన సీఎం రేవంత్ కూడా మొన్నటివరకు ఇదే పాట పాడారు. దేశంలోని అనేక విపక్ష పాలిత రాష్ర్టాల్లో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక సహా అనేక రాష్ర్టాలు ఇదే చేస్తున్నాయి. మొన్నటివరకు తెలంగాణలోనూ సీబీఐ ప్రవేశంపై నిషేధం అమల్లో ఉన్నది అందు కే. కానీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ విమర్శలకు, ఆరోపణలకు విరుద్ధంగా, తాను నడుపుతున్న కేం ద్ర హోంశాఖపై నమ్మకం లేక కేంద్రం పంజరంలోని చిలుకను రేవంత్‌రెడ్డి ఆహ్వానించడం విడ్డూ రం. తెలంగాణ భవిష్యత్తు, రైతుల జీవధార అయి న కాళేశ్వరాన్ని చిదిమేందుకు మోదీతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది?
– ( వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు )
ఓ.నరసింహారెడ్డి 80080 02927