బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి తెలంగాణ సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసింది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో అనేక పథకాలను ఆచరణలోకి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యనందించడానికి రూ.2079.22 కోట్లు ఖర్చు చేసింది. విదేశీ విద్యానిధి ద్వారా 3 వేలకు పైగా బీసీ విద్యార్థులు వివిధ దేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. బీసీ కులాలకు చెందిన 10 వేల మంది నిరుద్యోగులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నది. బీసీ విద్యార్థుల కోసం రూ.11,247.97 కోట్ల నిధులను విడుదల చేసింది. బీసీ కార్పొరేషన్ ద్వారా 38,356 మందికి రూ.230.09 కోట్ల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది.
4,21,111 మంది బీసీ విద్యార్థుల కాస్మొటిక్ చార్జీల కోసం రూ.1249 కోట్లను విడుదల చేసి వారి భవితకు బంగారు బాటలు పరిచింది. 11 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా 22,223 లబ్ధిదారులకు రూ.134.26 కోట్ల నిధులను విడుదల చేసి ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్కించుకుంది. బతుకమ్మ చీరల తయారీకి రూ.1878.50 కోట్లు విడుదల చేసి చేనేతకారులకు చేతి నిండా పని కల్పించింది. రజకుల ఉపాధి కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని 141 పట్టణ ప్రాంతాల్లో రూ.282 కోట్లతో ఆధునిక ధోబీ ఘాట్ల నిర్మాణానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. దేశమే అబ్బురపడే విధంగా బీసీ కులాల్లోని వృత్తి దారులకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది కేసీఆర్ సర్కార్. ఇందుకోసం రూ.400 కోట్లను ఇటీవల విడుదల చేసింది. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అత్యంత వెనుకబడిన కులాలను (ఎంబీసీలు) గుర్తించిన ఘనత కేసీఆర్ సర్కారుదే. సేవా వృత్తిదారులైన రజక, నాయీబ్రాహ్మణ, సంచార జాతులకు చెందిన 56 వేల మంది లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించింది. ఎంబీసీల కోసం అడిగిన వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రజక, నాయీ బ్రాహ్మణ కులాల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి బాటలు పరిచారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల పక్షపాతిగా ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం బీసీల ఉద్యోగ రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసులను అమలు చేయడంలో 6 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఇప్పటికైనా రోహిణి కమిషన్ రిపోర్టును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఎంబీసీలకు బీజేపీ సర్కారు తగిన న్యాయం చేయాలి.
(వ్యాసకర్త: ఎంబీసీ జాతీయ కన్వీనర్)
– కొండూరు సత్యనారాయణ 91543 83679