ఆదిలాబాద్ అన్నదాత తెలంగాణకు ఏదో చెప్పాలనుకున్నాడు. ఆ అమరుడైన దేవ్‌రావు ఇంతకీ మనకేం చెప్పాలనుకున్నాడు..? చెట్టుపై వాలిన పిట్ట ప్రాణాలకు ప్రమాదమొచ్చిందని చెప్పదలుచుకున్నాడా? పంట పొలాల్లో మిడతల దండు మాటేసిందని మనలందరినీ హెచ్చరించదలిచాడా? ఇదేదో తెలిపేందుకే, దేవ్‌రావు బలవన్మరణానికి బ్యాంకును వేదికగా చేసుకున్నాడు. తెలంగాణ నేల మీద అన్యాయంపై తిరుగుబాటు అనేది చారిత్రక సహజత్వం. భోళాతనం, బెబ్బులి గుణం రెండూ ఒకే ఒంట్లో ఒదిగి ఉండే మనుషుల సమూహం తెలంగాణ. ఆ స్వభావంతోనే దేశంలోనే వైవిధ్యమైన చరిత్రను తెలంగాణ సొంతం చేసుకున్నది. మరీ ముఖ్యంగా మన రైతాంగానిది రాజీలేని జీవన సౌందర్యం. సద్ది మూటల్లో ఉద్యమాలను బతికించడం దగ్గరి నుంచి, స్వయం పాలనలో సిరులను పండించడం వరకు ఇక్కడి మట్టి మనుషులది ఒడువని చరిత్ర. నిజానికి రైతు సహజ సిపాయి కదా!
అపాయాలపై, వైపరీత్యాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగినవాడు. మట్టికి, మేఘానికి మధ్య, నీటికి, విత్తుకు నడుమ అడ్డంపడే కంచెలపై సంపూర్ణ జ్ఞానం రైతులకు ఉంటుంది. ఈ సహజ సిపాయి, అసహజ మరణాన్ని ఆహ్వానించడం వెనుక ఏ ఆవేదనాగ్ని ఉంటుందో తెలంగాణకు గతానుభవం నేర్పించే ఉన్నది. వ్యవస్థలపై విశ్వాసం ఆవిరైనప్పుడు, చావులోనూ సందేశాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించే సమాజం తెలంగాణ. పదేండ్ల కిందట ఊర్ల మెడకు వేలాడిన ఉరితాళ్లు, పురుగుల డబ్బాలు మోగించిన చావు మేళాలు స్వయం పాలనలో మాయమవ్వడంతో చాలామంది యాది మరిచారు. కానీ, దేవ్‌రావు ఆత్మహత్యలో నాటి మరణ మృదంగం మళ్లీ చాటింపు వేసింది. కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని బ్యాంకులోనే బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టి, ఊపిరి వదిలిన దేవ్‌రావు ఉదంతం జరిగి 24 గంటలు కూడా గడవకముందే, అదే ఆదిలాబాద్ జిల్లాలో రాథోడ్ గోకుల్ అనే మరో గిరిజన రైతు రుణఘాతానికి రాలిపోయాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనలో 406 మంది రైతులు బలవన్మరణానికి బలైపోవడం ఎంత దారుణం? ఏడాదిలోనే తెలంగాణ ఎద పగలడం ఆవేదన కలిగిస్తున్నది. వాస్తవానికి ఆత్మహత్యలు లేని తెలంగాణనే కాదు, దేశం అవసరాలకూ ఆదరువుగా రాష్ర్టాన్ని నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వ్యవసాయంలో విశ్వాసాన్ని పండించి, పల్లెల్లో పండుగల ప్రభంజనం సాకారం చేసింది.
కేసీఆర్ ప్రభుత్వం రగిలించిన వ్యవసాయ విప్లవం వల్ల 2014కు మునుపు కోటి ఎకరాల్లో కూడా పొడవని విత్తులు, 2023 నాటికి 2.68 కోట్ల ఎకరాల్లో పచ్చని పంటగా విస్తరించింది. రాష్ట్ర ఏర్పాటు నాడు 68 లక్షల టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయితే, 2023 నాటికి 350 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగి, దేశంలోనే రికార్డ్‌ను మన రాష్ట్రం నమోదు చేసింది.
తడి ఎండి తంగేడు పూల చెట్లు కూడా మొలవని ఎడారుల్లా మారిన పొలాలు, ఆకు పచ్చని పైటను తొడుక్కోవడం వెనుక కేసీఆర్ సర్కార్ పడ్డ శ్రమ ఇప్పడు చాలామందికి అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం మా కోసమే అనే విశ్వాసం కలిగిస్తే, రైతులు రత్నాలు పండిస్తారు. అదే అన్నదాతలకు ఇది సవతి తల్లి ప్రేమ చూపుతున్న సర్కార్ అనేది మదిలో పడితే, ఒడ్డున పడ్డ చేపలా విలవిలలాడిపోతారు.
ప్రేమగల్ల ప్రభుత్వానికీ, మోసకారి సర్కార్‌కు మధ్య వ్యత్యాసాన్ని నేడు తెలంగాణ రాష్ట్రం కండ్లారా చూస్తున్నది. 24 గంటల ఉచిత విద్యుత్తు కోసం రూ.36,899 కోట్లు, రైతుబంధు కోసం రూ.73 వేల కోట్లు, బీమా కోసం 6,861 కోట్లు, వరిధాన్యం కొనుగోలు కోసమే 1,34,768 కోట్లు, ఇతర పంటల సేకరణకు రూ.11,439 కోట్లు, విత్తనాల ఎరువుల రాయితీకి రూ.983 కోట్లు, రుణమాఫీ అమలుకు రూ.30 వేల కోట్లు ఇలా ఖజానాను రైతాంగానికి వెన్నెముకగా నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. సాగు నీటికి ఊటబాయిలా రాష్ర్టాన్ని మార్చేందుకు రూ.1,76,000 కోట్లు ఖర్చుచేసింది. కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఎన్నో సాహసోపేత చర్యల వల్ల రైతుల కన్నీరు ఆగి, రాష్ట్రం పంటను కన్నది. పదేండ్లలో విభజన సమస్యలు, కరోనా, పెద్దనోట్ల రద్దు, కేంద్ర కొర్రీలు ఇలా ఎన్నో అవాంతరాలు సలుపుతున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం, తన భుజానికెత్తుకున్న నాగలిని కిందకి దించనేలేదు. ఇవన్నీ గతంలో రాసినా, చెప్పినా ఎందుకో చాలామంది చెవికెక్కకపోయేది. కానీ, ఏడాది గడిచాక, విశ్వాస ఘాతుకానికి అలవోకగా వొడిగతున్న రేవంత్‌రెడ్డి సర్కార్ తీరును రుచి చూసిన తర్వాత, నేడు అందరికీ మనసున పడుతున్నది.
కాంగ్రెస్ సర్కార్ నమ్మబలికిన రుణమాఫీ గ్రామాల్లో ముప్పై శాతం కూడా కాక, రైతు భరోసా అసలుకే రాక, సర్వేలు, డిక్లరేషన్ ఫారమ్‌ల డ్రామాలు చూడలేక రైతుల గుండెలు మండుతున్నాయి. రైతులు ఏ ఉపద్రవాన్నైనా ఎదుర్కొంటారు కానీ సర్కార్ వెన్నుపోటును అసలుకే జీర్ణించుకోలేరు. అందువల్లనే రాష్ట్ర రైతాంగం రగిలిపోయింది. ఏడాది ఎగ్గొట్టి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొర్రీలతో రైతులు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా అందిస్తామంటున్నారు. ఉపాధి హామీ ప్రకారం 29 లక్షల జాబ్ కార్డు దారులకు ఎలాంటి భూమి లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులోనూ 20 రోజుల పనిదినాల నిబంధన పేరిట 19 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసాను ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఇట్లా అన్ని హామీలకు కొర్రీలు పెడుతూ, కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎన్నికల కోసం కాకమ్మ కథలు వల్లిస్తూనే ఉన్నది.
ఒక మెతుకు చేతిలోకి తీసుకొని, బువ్వ ఉడికిందో లేదో చెప్పేసే వ్యవసాయదారులు, ఏడాది ఎగవేతల ఏలుబడిని అనుభవించిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇంకా విశ్వసిస్తారా? అసలు మాయముంతెరగని విన్యాసాల సర్కార్ అని అర్థమైపోయిన తర్వాత అన్నదాతలకు భరోసా ఎలా కలుగుతుంది? గ్యారెంటీలే కాదు నీటి కటకట, ఎరువుల కొరత ఇలా ఎన్నో ఇక్కట్లను ఈ ఏడాది అందరూ చవిచూశారు.
పైగా ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఫార్మాల పేరిట, రకరకాల కారణాలు చెప్పి, రైతుల భూములకే ఎసరు పెట్టే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. నిన్నటికి నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్ ముప్పును ఎదిరించినందుకు గ్రామస్థులందరినీ అరెస్ట్ చేశారు. వారికి అండగా నిలబడిన పౌర హక్కుల సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది నియంత సర్కార్ అని బీఆర్ఎస్ మాత్రమే కాదు హక్కుల సంఘాలు సైతం ఈసడించుకుంటున్నాయి.
వీటన్నింటికి పరాకాష్ఠగా గోదావరి, కృష్జా జలాలను తెలంగాణ రైతులకు దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. కాళేశ్వరంపై ఏడాది కాలంగా జరుగుతున్న దాడి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై నిర్లక్ష్యం వెనుక హస్తం సర్కార్‌ను పురిగొల్పుతున్న అదృశ్య హస్తం మరొకటి ఉన్నదని అర్థమైపోతున్నది.
ఎందుకిదంతా? ఎవరి కోసం ఈ పనులన్నీ? రైతులు రాలిపోతుంటే, సింగపూర్ రంగుల లోకం కథలు చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీరు దారుణం. తెలంగాణ ప్రాధాన్య రంగాలను పండబెడుతూ, ఊహల్లో ఊరేగమంటున్న కాంగ్రెస్ సర్కార్ విధానం విడ్డూరంగా ఉన్నది. రైతులు, విద్యార్థుల బలవన్మరణాలు, అక్రమ అరెస్టులు, ఎన్కౌంటర్లు ఇలా తెలంగాణను మళ్ళీ దారి తప్పిస్తున్నారు. సర్కారే సేతానం ఉరికి తలారి పాత్ర పోషిస్తుండటం ప్రజలలో వేదనాగ్నిని రాజేస్తున్నది. ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో రైతులకు, రాష్ర్టానికి మరింత ముప్పు పొంచి ఉన్నదనేది అర్థమైపోతున్నది. బహుశా మనల్నందరినీ మేల్కొనమని హెచ్చరించేందుకే కాబోలు, బ్యాంక్ సాక్షిగా రైతు దేవ్‌రావ్ కన్నుమూశాడేమో?
కాంగ్రెస్ సర్కార్ నమ్మబలికిన రుణమాఫీ గ్రామాల్లో ముప్పై శాతం కూడా కాక, రైతు భరోసా అసలుకే రాక, సర్వేలు, డిక్లరేషన్ ఫారమ్‌ల డ్రామాలు చూడలేక రైతుల గుండెలు మండుతున్నాయి. రైతులు ఏ ఉపద్రవాన్నైనా ఎదుర్కొంటారు కానీ సర్కార్ వెన్నుపోటును అసలుకే జీర్ణించుకోలేరు. అందువల్లనే రాష్ట్ర రైతాంగం రగిలిపోయింది. ఉపాధి హామీ ప్రకారం 29 లక్షల జాబ్ కార్డు దారులకు ఎలాంటి భూమి లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులోనూ 20 రోజుల పనిదినాల నిబంధన పేరిట 19 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసాను ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం కాకమ్మ కథలు వల్లిస్తూనే ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్