BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని సమగ్ర అధ్యయనం ద్వారా నిర్ణయించాలి. అందుకు దేశ సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా పాటించాలి. అందులో భాగంగా ట్రిపుల్ టెస్టులో మొదటిది అయిన ‘ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్’ను నియమించాలి. ఆ కమిషన్ నిర్ధారించిన రాజకీయ వెనుకబాటుతనమే అందుకు ప్రామాణికమైన ప్రాతిపదిక. అయితే, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బీసీలను మరోసారి వంచించేందుకు యత్నిస్తున్నది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2010లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కె.జి బాలకృష్ణన్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం డాక్టర్ కె.కృష్ణమూర్తి కేసులో ఇచ్చిన తుది తీర్పులో స్పష్టంగా సూచించింది. ప్రధానంగా 2021లో మహారాష్ట్రకు చెందిన వికాస్ కిషన్‌రావు గవళీ కేసులో జస్టిస్ ఖాన్విల్కర్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి అన్ని రాష్ర్టాలకు ప్రామాణికం.
కర్ణాటకకు చెందిన డాక్టర్ కె.కృష్ణమూర్తి కేసులో జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాలను నిర్దిష్టంగా ట్రిపుల్ టెస్టు రూపంలో జస్టిస్ ఖాన్విల్కర్ ధర్మాసనం సూచించింది. ‘ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్’ను నియమించడం వాటిలో ప్రధానమైనది. దాంతో పాటు ప్రస్తుత స్థితిగతులకు అనుగుణంగా సమాచారాన్ని సేకరించాలి. రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్దిష్టంగా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని యూనిట్‌గా తీసుకొని సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ మేరకు మార్గదర్శకాల్లోని అంశాలను అన్ని రాష్ర్టాలు తప్పకుండా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇందులో డెడికేటెడ్ కమిషన్‌ను ప్రత్యేకంగా రాజ్యాంగంలోని 340 అధికరణం కింద నియమించాలి. ఇందుకు భిన్నంగా అప్పటికే అందుబాటులో ఉన్న బీసీ కమిషన్లకు ఈ బాధ్యతలు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే, బీసీ కమిషన్లు ప్రత్యేక చట్టం ద్వారా, నిర్దేశిత పని నిమిత్తం నియమించినవి. విద్య, ఉద్యోగాలకు సంబంధించిన బీసీ కులాల జాబితాల రూపకల్పన, అమలులో ఉన్న రిజర్వేషన్ల సమీక్ష, లోపాలను సరిదిద్ది ప్రభుత్వాలకు సిఫారసులు, నివేదికలను సమర్పించడమే బీసీ కమిషన్ల ప్రధాన విధులు. వాటికి పరిమితులుంటాయి. అందువల్ల బీసీ కమిషన్లను ‘డెడికేటెడ్ కమిషన్లు’గా నియమించడం చెల్లుబాటు కాదు. ‘ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్’ ఏర్పాటుకు సంబంధించి సుప్రీం మార్గదర్శకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించి, రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించే దిశగా నిశితంగా అధ్యయనం చేయాలన్నది రాజ్యాంగ ధర్మాసనం ప్రధాన ఉద్దేశం. అలా కాకుండా ఆ లక్ష్యాన్ని నీరుగార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు.. ఉన్నత న్యాయస్థానాలు తమ విస్పష్టమైన జోక్యంతో ఈ తప్పును సరిదిద్దుతాయి.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌కు ‘డెడికేటెడ్ కమిషన్’ బాధ్యతలను అప్పగించగా ఉన్నత న్యాయస్థానం దాన్ని తప్పుబట్టింది. ఆ కమిషన్ నివేదికను కొట్టివేసింది. ఈ క్రమంలోనే జయంత్ కుమార్ భాటియా సారథ్యంలో డెడికేటెడ్ కమిషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి వచ్చింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యపడింది. ఇందుకు సంబంధించి వికాస్ కిషన్‌రావు గవళీ (2021), రాహుల్ రమేష్వాగ్ (2022) కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే.. ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై స్పష్టత వస్తుంది.
అంతేకాదు, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు సుప్రీం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీ కమిషన్‌కు ‘డెడికేటెడ్ కమిషన్’గా గుర్తింపునిచ్చింది. దేశంలో ఈ అంశంపై ప్రామాణికమైన తీర్పులు అందుబాటులో ఉన్నప్పటికీ, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా బోధపడుతున్నది.
ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను అత్యంత నిశితంగా అధ్యయనం చేయాల్సిన నేపథ్యంలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నియామకం సుప్రీం మార్గదర్శకాల్లో మొదటిది, అత్యంత కీలకమైనది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు ఏమిటన్నది మన కండ్లముందే కనిపిస్తూనే ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొన్న న్యాయపరమైన సమస్యలే అందుకు సజీవ సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న మన రాష్ట్రంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు విఘాతం కలిగే అవకాశముంది.
సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర బీసీ కమిషన్‌ను ‘డెడికేటెడ్ కమిషన్’గా ప్రభుత్వం గుర్తింపునివ్వడంపై ఇప్పటికే న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక చెల్లుబాటు అవుతుందో? లేదో? అనే చర్చలు బీసీ వర్గాలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. డెడికేటెడ్ కమిషన్‌గా వ్యవహరిస్తున్న బీసీ కమిషన్ ఈ నెల 28 నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నదో స్పష్టం చేయకుండానే జిల్లా పర్యటనలు చేపట్టడం విడ్డూరం. కమిషన్ చేసిన కసరత్తు వివరాలను ప్రజల ముందుంచి అభిప్రాయాలను సేకరించడం సముచితంగా ఉంటుంది.
రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై బీసీ కమిషన్ మొదట సాధికారికంగా, పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంది. అంశాలవారీగా సామాజికవేత్తలు, విషయ నిపుణులు, కులసంఘాలు, రాజకీయపక్షాలతో సంప్రదించాలి. రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి తమ కసరత్తు ఏమిటో స్పష్టంగా వివరించాలి. మెథడాలజీ, రాజకీయ వెనుకబాటుతనం నిర్ధారణ, అవలంబించాల్సిన పద్ధతులపై నిర్మాణాత్మకంగా ఇప్పటికే చర్చించి ఉంటే బాగుండేది. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం సబబు కాదు.
కమిషన్ కార్యాచరణ అత్యంత శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉండాలి. ఇలాంటి కార్యాచరణను పక్కనపెట్టి ప్రజాభిప్రాయ సేకరణకు పర్యటనలు నిర్వహించడం అవగాహనారాహిత్యమే. ఈ అభిప్రాయ సేకరణ వల్ల సమగ్ర సమాచారం అందుబాటులోకి రాదనేది నిర్వివాదం. ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా వికాస్ కిషన్‌రావు గవళీ తీర్పులోని పేరా-13కు అనుగుణంగా మూడు నెలల్లోపు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పేరా-13లో ఉన్న ట్రిపుల్ టెస్టును నిర్దిష్టంగా పాటించాలని సూచించింది. అంటే డెడికేటెడ్ కమిషన్‌ను నియమించి, అన్ని ప్రక్రియలను పూర్తిచేయాలని దానర్థం. ఆ సందర్భంగా హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభు త్వం తరఫున సమ్మతిని తెలియజేశారు. కానీ, అందు కు భిన్నంగా కార్యాచరణ కొనసాగుతున్నది. ఇది ఇప్పటికే తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిందని ఆవేదనలో ఉన్న బీసీలకు అన్యాయం చేయడమే. ఈ నేపథ్యంలో నిపుణులు, న్యాయకోవిదుల సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. బీసీలకు న్యాయం చేయాలనుకుంటే, ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి.
(వ్యాసకర్త: పూర్వ రాజ్యసభ సభ్యులు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు)
– ఆర్.కృష్ణయ్య