రాష్ట్రంలోని వసతి గృహాల సమస్యలు రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం అవుతాయి. అద్దె భవనాలు, వసతుల లేమి, ఫుడ్ పాయిజన్లతో సహవాసం చేస్తున్న విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారి పరిస్థితిని తలచుకుంటేనే కండ్లల్లో నీళ్లు కదలాడుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న అద్దె భవనాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విద్యార్థులు బతుకీడుస్తుండటం బాధాకరం. కనీస వసతులు లేక దయనీయ పరిస్థితుల్లో ఉంటున్న వారిని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. కలుషితాహారం కారణంగా అనేకమంది మరణించగా, వందల మంది విద్యార్థులు దవాఖానల పాలయ్యారు. అయినా ప్రభుత్వ తీరు మారడం లేదు. డిసెంబర్ 14న ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలను సందర్శించి కామన్ డైట్ మెనూ పేరిట హడావుడి చేశారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేసి ఫొటోలకు పోజులిచ్చారు. సోషల్ మీడియాలో హంగామా చేశారు. కానీ, వారు హాస్టళ్లను విడిచిన వెంటనే ఆ మెనూను పక్కనపెట్టి పాత పద్ధతిని పాటిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిరుపేదలైన విద్యార్థులు ప్రశ్నించలేరనే కారణంగానే పాలకులు వారిని చిన్నచూపు చూస్తున్నారని అనిపిస్తున్నది. విద్యార్థుల మరణాలకు కారణమైన పాత మెనూను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడటం శోచనీయం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ స్పందించాలి. కామన్ డైట్ మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే విద్యార్థి ఉద్యమాలు పురుడుపోసుకోవడం ఖాయం.
– హరీష్ సాగర్, 63027 58830