‘మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత’ అనే వార్తలు ఇటీవల తరచుగా చదువుతున్నాం. మొన్నటికి మొన్న (మాగనూరు)
నారాయణపేట పాఠశాలలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడో చోట మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం సర్వసాధారణమైపోయింది. విద్యార్థులు ఇలా దవాఖానల పాలవడం ఎంతవరకు సబబు? ఈ కలుషిత ఆహారం విషయంలో కింది స్థాయి అధికారులే బాధ్యత వహించాలా? ప్రభుత్వానికేం సంబంధం లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు ఎందుకు తరచుగా జరుగుతున్నాయో పరిశీలిద్దాం.
‘విద్యార్థులకు పోషకాహారం అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఆయనే కాదు,రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులూ ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి బాధ్యులపైకఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం నిత్యకృత్యమైంది. ఆ తర్వాత షరామామూలే.
Mid Day Meal | పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొత్త పథకమేం కాదు. అమెరికాలోని నేషనల్ స్కూల్ ఆఫ్ లంచ్ యాక్ట్ ప్రకారం ఆ దేశంలోని అన్ని స్కూళ్లలో ఇలాంటి పథకం అమలులో ఉన్నది. 1960లోనే తమిళనాడులో కామరాజు ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. 1995లో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఒక రూపం తీసుకువచ్చింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) ‘రైట్ టు ఫుడ్’ కోసం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. సుదీర్ఘ కృషి తర్వాత ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు (రైట్ టు లైఫ్)లో భాగంగా ఆహారపు హక్కు (రైట్ టు ఫుడ్) కూడా ఉన్నదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు, అన్ని రాష్ర్టాల్లో, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని ఆదేశించింది. ఆ రకంగా మధ్యాహ్న భోజన పథకం ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దేశంలో అమలవుతున్నది. అలా ఈ పథకానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద చట్టబద్ధత కూడా ఉన్నది. మధ్యాహ్న భోజన పథకం వల్ల స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, వారికి పౌష్టికాహారం కూడా లభిస్తున్నది. ఈ పథకం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచడానికి తోడ్పడుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కులవివక్ష బలంగా ఉన్న మన సమాజంలో సహపంక్తి భోజనానికి గొప్ప ప్రాముఖ్యం ఉన్నది. బడి భోజనం పిల్లలను సోషలైజ్ చేయడానికి, ఒకరికొకరు సమానంగా చూసుకోవడానికి, కలసిమెలసి జీవించడానికి ఉపయోగపడుతున్నది.
మన రాష్ట్రంలో 27 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో 80 శాతం వరకు విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంతో లబ్ధి పొందుతున్నారు. ఇంతమంది విద్యార్థుల ఆకలి తీర్చడానికి 52 వేల మందికి పైగా వంట కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులైన వంటగదులు, వంట పాత్రలు, తాగునీరు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ స్కూళ్లలో వంట చేసే కార్మికులకు ప్రభుత్వం రూ.3 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నది. వంట కు కావలసిన బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తే.. పప్పు, నూనె, కూరగాయలు, గుడ్లు వంటి వాటిని ఏజెన్సీవారు కొనుక్కొంటున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1 నుంచి 5వ తరగతి చదివే ఒక్కో విద్యార్థికి రూ.5-70.. 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు రూ.8-40.. 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రూ.10-40 కేటాయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మొత్తం చెల్లిస్తున్నది. 6 నుంచి 8వ తరగతులు చదివే విద్యార్థులకు కేంద్రం 60 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తున్నది.
9, 10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చెల్లిస్తున్నది. విద్యార్థులకు వారానికి 3 గుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డు ధర మార్కెట్లో రూ.7-8 వరకు ఉన్నది. అయితే, ఇందుకుగాను ప్రభుత్వం నెల నెలా బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో వంటకార్మికులే వడ్డీకి అప్పులు తెచ్చి ఆ ఖర్చులను భరిస్తున్నారు. వడ్డీ భారంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బిల్లులను ప్రభుత్వం నెలల తర్వాత చెల్లించినప్పుడు వారు తీసుకుంటున్నారు. వీటి కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనేకరకాల బిల్లులను తయారుచేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు అదనపు భారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పనిచేస్తున్న 52 వేల మంది వంటకార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తామని వాగ్దానం చేసింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వారికి వేతనాలు పెంచడంతో పాటు, మార్కెట్ ధరలకనుగుణంగా ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని ప్రతి నెలా కొంచెం పెంచుతూ చెల్లిస్తే వంటకార్మికులు మరింత శ్రద్ధగా, పరిశుభ్రంగా వంట చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడే విద్యార్థులకు మంచి భోజ నం పెట్టినవారమవుతాం.
ఇవన్నీ చేయాల్సిన ప్రభుత్వం నాంది ఫౌండేషన్, అక్షయపాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అందించాలనే యోచనలో ఉన్నది. 2020, డిసెంబర్లో ఆరోపణలు ఎదుర్కొన్న అక్షయపాత్ర సంస్థపై ఫ్రంట్‌లైన్ పత్రిక ఆధారాలతో కూడిన వార్తలను బయటపెట్టిందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. పైగా స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అడ్వాన్సుగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అవే డబ్బులు వంటకార్మికులకు ముందుగా చెల్లిస్తే బాగుంటుంది. కానీ, ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం వారికి డబ్బులు మం జూరు చేయడం లేదు. దీనివల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వంటకార్మికులు నిత్యం మానసిక ఒత్తిడితో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే పరిశుభ్రత, నాణ్యతతో కూడిన ఆహారాన్నే విద్యార్థులకు వండి, వడ్డించాలని పాఠశాల విద్యాశాఖ అనేక సూక్తులతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను గతంలో విడుదల చేసింది. చెట్ల కింద ఉన్న వంటశాలలు, తాగునీటి వసతి లేని, ముడి సరుకులు నిల్వ చేసే గదులు లేని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంట సిబ్బంది ఆ మార్గదర్శకాలను చూసి విస్తుపోతున్నారు. గుమ్మిల వడ్లు గుమ్మిలనే ఉండాలె, గూటమోలె పిల్లలు ఉండాలంటే ఎట్లా ఉంటారని ప్రభుత్వ తీరును వారు ఎండగడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పైకి చూడటానికి ఆదర్శంగా కనిపిస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవాలంటే ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక ఉద్యోగి ఉండాలి. బియ్యాన్ని పురుగులు పట్టకుండా చూడటం, నాణ్యమైన వంట దినుసులను సమకూర్చుకోవడం, ఎప్పటికప్పుడు ఎక్స్పైరీ తేదీలను పరిశీలించడం, పప్పు దినుసులను పొడి ప్రదేశాల్లో నిల్వ చేయడం వంటి పనులు ఆ ఉద్యోగి చేయాలి.
ఇలాంటి సదుపాయాలు రాష్ట్రంలోని ఒక్క ప్రభుత్వ బడిలో కూడా లేవు. అలా లేకపోవడం వల్ల మధ్యాహ్న భోజన తయారీకి సంబంధించిన పనులను చూడటానికి పాఠశాల్లోని ఉపాధ్యాయుడో, ప్రధానోపాధ్యాయుడో తప్పనిసరిగా తమ బోధనా సమయాన్ని వదులుకొని చూడాల్సి వస్తున్నది. రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం మొదలు పై విషయాలను పరిగణనలోకి తీసుకొని, లోపాలను సవరించాలి. జరిగిన తప్పిదాలకు కిందిస్థాయి సిబ్బందిని బద్నాం చేయకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే వసతులతో కూడిన వంటశాలలు, తాగునీటి సౌకర్యం, భోజనశాల, వంట కార్మికులకు నెల నెలా బిల్లుల మంజూరు, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించవలసింది ప్రభుత్వమే కాబట్టి.
మధ్యాహ్న భోజనం పథకం ఎవరి దయా దాక్షిణ్యాలతో అమలు చేస్తున్నది కాదు, అది విద్యార్థుల హక్కు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రకటించే పథకం అంతకన్నా కాదు. జీవించే హక్కులో భాగంగా వచ్చిన పథకం ఇది. దీన్ని పిల్లల హక్కుగా ప్రభుత్వం గుర్తించి, తదనుగుణంగా బాధ్యతలు తీసుకోవాలి. అంతేకానీ, సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. పైగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఉల్లి, వెల్లుల్లి, గుడ్డు, మాంసం వంటి ఆహార పదార్థాలను వంటలో అసలు వాడవు. తద్వారా పిల్లలకు సమీకృత ఆహారం అందించలేని వారమవుతాం. అందుకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా వంట కార్మికుల జీతాలు పెంచి, వారికి నెల నెలా సక్రమంగా బిల్లులు చెల్లించాలి. వంట గదిని, అందులోని నిత్యావసర సరుకులను పర్యవేక్షించడానికి ప్రతి పాఠశాలలో ఒక ఉద్యోగిని నియమించాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన, పురుగులు లేని భోజనాన్ని అందించినవారమవుతాం. అందుకోసం ప్రభు త్వం చిత్తశుద్ధిగా కృషిచేస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)
-కె.వేణుగోపాల్
98665 14577