ప్రజా పాలనలో ఇటు వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామిక పద్ధతుల్లో నిషేధ ఆంక్షలు కొనసాగుతుండగానే, అటు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములు అమ్మచూడటం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. పాలకుల నియంతృత్వ వైఖరులను నిరసిస్తూ ఈ రెండు వర్సిటీల్లో కొన్నిరోజులు విద్యార్థులు పలు రూపాల్లో నిరసనలు తెలిపారు. ఫలితంగా వారు పోలీసు దాడులు, అరెస్టులు, కేసులనూ ఎదుర్కొన్నారు.
‘ప్రజా పాలన’లో వర్సిటీలకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థి లోకం ఇంతలా గొంతెత్తినా, కొన్ని ప్రధాన మీడియా సంస్థలు, కొంతమంది మేధావులకు చీమకుట్టినట్టు కూడా లేదు. పాలకులు యథేచ్ఛగా ‘ఏడో గ్యారంటీ’కి సమాధి కడుతుంటే.. బుల్డోజర్ల సంస్కృతిని బాహాటంగా ప్రవేశపెడుతుంటే.. ఈ విధానం తప్పు అంటూ నిలదీయాల్సిన సదరు సంస్థలు, మేధావులు మౌనం వహించడం అత్యంత బాధాకరం. ఓయూలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. తక్షణమే ప్రక్షాళన చేయాలని సూచిస్తూ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సైతం ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. ఆ సమస్యలు పరిష్కరించండంటూ గత కొంతకాలంగా విద్యార్థులు శాంతియుత పద్ధతుల్లో ఆందోళనలు చేపట్టారు. అయితే, పరిష్కారం చూపని అధికారులు 5 రకాల చర్యలను నిషేధిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఇది అప్రజాస్వామికం కాదా? వందేండ్ల ఓయూ చరిత్రలో ఈ తరహా సర్క్యులర్ జారీ కావడం ఇదే మొదటిసారి. గత పదేండ్ల పాటు ‘ఊ’ అంటే ఉస్మానియాకు ఉర్కొచ్చి తాము ‘ప్రశ్నించే గొంతుకలం’, ‘పాటగాళ్లం’, ‘మేధావు లం’, ‘నికార్సయిన జర్నలిస్టులం’ అంటూ చెప్పుకున్నవారు ఇప్పుడు ఓయూ పరిసరాల్లోకి కూడా రావడం లేదు. బహుశా పదవులు రాగానే కొంతమంది పెదాలు మూసుకుపోయి ఉంటాయి. ప్రత్యేక కథనాలు, ప్రాధాన్యం లేకున్నా ప్రత్యక్ష ప్రసారాలు చేసిన పలు బడా మీడియా సంస్థలు (నమస్తే తెలంగాణ కాదు) ఇప్పుడు కొనసాగుతున్న అప్రజాస్వామిక చర్యలను సమాజానికి చూపేందుకు ఉద్యమాల గడ్డ వైపునకు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అంటే, వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా ‘ప్రశ్న’ కూడా సందర్భాన్ని బట్టి మారుతుందా? సమాధానం చెప్పాలి.
పోరాటాల మూలంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పురుడు పోసుకున్నది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వహించారు. సిక్స్ పాయింట్ ఫార్ములాలో భాగంగా వర్సిటీని నెలకొల్పారు. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించారు. అయితే, భూమిని మాత్రం యూనివర్సిటీ పేరున రిజిస్ట్రేషన్ కాని, లీజు డీడ్ కాని చేయించలేదు. బహుశా వర్సిటీ భూములు లాక్కునే నేతలు పుట్టుకొస్తారని నాడు ఊహించి ఉండరు. అకడమిక్ అవసరాల కోసమే భూమిని వినియోగించాలనే నిబంధనను మాత్రం పొందుపర్చారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా స్వయం ప్రతిపత్తికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. కానీ, యాభై ఏండ్ల తర్వాత ‘ఇందిరమ్మ రాజ్యం’ అని చెప్పుకొంటున్న పాలకులు ఒక సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అంటూ విక్రయ ప్రయత్నాలకు సిద్ధమవ్వడం దారుణం.
1974 నుంచి ఇప్పటివరకు దశాబ్దాల కాలం పాలించిన కాంగ్రెస్ ఈ వర్సిటీకి ఎలాంటి భూ యాజమాన్య హక్కు కల్పిస్తూ సాధికార పత్రాలు ఇవ్వలేదు. ఇప్పుడున్న మొత్తం భూములకూ పత్రాల్లేవు, చాలా వర్సిటీల పరిస్థితి కూడా ఇదే. అంటే, సాంకేతిక కారణాలను చూపుతూ తిరిగి భూములు లాగేసుకుంటారా? ఆధునిక మేధావులను అందించే వర్సిటీలను నిర్వీర్యం చేస్తారా? సెంట్రల్ వర్సిటీ పర్యావరణం.. రాజధాని హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లా పనిచేస్తుంది. ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు కాకపోయినప్పటికీ.. తిరుమల్ పాడ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. చెట్లు, పక్షులున్న ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగానే పరిగణించాల్సి ఉన్నది. అభివృద్ధి పనుల పేరుతో కేటాయింపులు జరుపుతున్నప్పుడు కమిటీ వేసి అధ్యయనం చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా టీజీఐఐటీ మాత్రం పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ఉపాధి, అభివృద్ధి కోసమే అయితే ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీల్లో గల విశాలమైన భూములను వినియోగించుకోవచ్చు. ఇక్కడే మనం పాలనాదక్షులకు, రియల్ వ్యాపార స్వభావం కలిగిన పాలకుడికి మధ్య ఉన్న తేడాను గమనించాలి. శాంతియుత పద్ధతుల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే పాలకులు మాత్రం రాజకీయాలకు ముడిపెట్టడం రేవంత్ సహజ స్వభావాన్ని గుర్తు చేస్తున్నది.
ఓయూలో ఇప్పుడు నిషేధ ఆంక్షలు విధింపజేశారు. మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇక్కడి భూములను సైతం బజారులో అమ్మకానికి పెడతారేమో! కాబట్టి, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు వర్సిటీల్లో ఏకకాలంలో కొనసాగుతున్న న్యాయబద్ధమైన పోరాటాలకు సమాజంతో పాటు అరణ్యంలో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కూడా మద్దతు తెలుపుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. జనారణ్యంలో ఉన్న కొంతమంది మేధావులు మాత్రం మౌనం వీడ టం లేదు. మేధావుల మౌనం సమాజానికి పెను ప్రమాదం. కావున, వారంతా బహి రంగంగా తమ వాణి వినిపించాలి. తెలంగాణ ఉద్యమ సమయం, స్వరాష్ట్ర సాధన అనంతరం విషం చిమ్మిన పలు మీడియా సంస్థలు ఇప్పుడు ప్రభుత్వం చేసేది కరెక్టు అనే రీతిలో ప్రచారం చేయడం మానుకోవాలి. ‘నిజం కూడా ప్రతి రోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే, అబద్ధమే నిజంగా మారి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను విద్యార్థులు గుర్తెరగాలి. వర్సిటీల్లో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలపై భారత రాజ్యాంగం చేబూని నిత్యం సంచరిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించాలి. ఉన్నత విద్య ఆవశ్యకతను వివరిస్తూ, వర్సిటీ భూముల వేలాన్ని ఆపేలా రేవంత్‌ను మందలించాలి. లేదంటే, తెలంగాణలో విద్యార్థి ఉద్యమాలకు మహోన్నత చరిత్ర ఉన్నది. కాబట్టి, పాలకుల మెడలు వంచి వర్సిటీలను కాపాడుకు నేందుకు సైతం వెనుకడుగు వేయం.
(వ్యాసకర్త: సోషియాలజీ విద్యార్థి, ఓయూ జాక్ నాయకుడు)
-నరేష్ పాపట్ల
95054 75431