ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది విద్యార్థులు తగ్గారు. 2024-2025 విద్యా సంవత్సరంలో జీరో నమోదున్న పాఠశాలలు 2,245 ఉండగా, వాటిలో 1,441 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు లేరు. ప్రస్తుతానికి 1,441 బడులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 600 పాఠశాలలపై… అలాగే మిగతా శాఖల పరిధిలోని దాదాపు 200 జీరో బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
పాఠశాలల సంఖ్య, పనిచేసే టీచర్లు, విద్యార్థుల సంఖ్య, జీరో పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచిక (పీజీఐ) స్కోర్ నిర్ణయమవుతుంది. జీరో పాఠశాలలు ఎక్కువగా ఉంటే స్కోర్ తగ్గుతుంది. దాదాపు అన్ని రాష్ర్టాలు జీరో స్కూళ్లను యూడైస్ గణాంకాల్లో చూపడం లేదు. 2024-25 యూడైస్ ప్రకారం పశ్చిమబెంగాల్లో 3,812 జీరో బడులుండగా… తాజాగా కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటి సంఖ్య 1,571గా చూపింది. తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల విధానాన్ని ఇక్కడా పాటించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు.. తర్వాత కాలంలో గురుకులాలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతున్నారని, తగ్గుదలకు అదే కారణమని విద్యాశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 5,000 పాఠశాల్లో మాత్రమే ఖాన్ అకాడమీచే డిజిటల్ అక్షరాస్యత పాఠాలు, ఏక్ స్టెప్ ఫౌండేషన్‌తో ఏఐ ఆధారిత పాఠాల బోధన జరుగుతున్నది. పర్యవేక్షణకు అధికారులు లేకపోవడంతో ఫేస్ రికగ్నిషన్ యాప్ పేరుతో హాజరు అమలుతో సమస్యల పరిష్కారమవుతుందా? 157 కొత్త ప్రాథమిక పాఠశాలలు, 1000 పాఠశాలలో యూకేజీ తరగతులను తగిన శిక్షణ లేని ఉపాధ్యాయులతో ప్రారంభిస్తే సమస్య పరిష్కారం కాదు. పూర్వ ప్రాథమిక విద్యను సక్రమంగా బోధించడానికి డైట్ కళాశాలలో ప్రత్యేకంగా పూర్వ ప్రాథమిక శిక్షణ ఇచ్చే తరగతులు ప్రారంభం కావాలి. అందుకు విద్యాశాఖ ఏర్పాటు చేయాలి. అదేదీ లేకుండా, ఉపాధ్యాయుల నియామకాలు జరగకుండా పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాం, చేరాలి! అనగానే విద్యార్థులు చేరుతారా? ఇన్నిరకాల చర్యలు తీసుకుంటే విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు? చేరిన వారు ప్రైవేట్, గురుకుల పాఠశాలలకు ఎందుకు తరలిపోతున్నారు? నామ్‌కే వాస్తే చర్యలు తీసుకొని విద్యార్థులు రావడం లేదని, చేరడం లేదని, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను మూసేస్తే సరిపోతుందా? ఆదర్శ యజమానిగా ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల అభివృద్ధికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలి. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో సమస్యలను శాస్త్రీయంగా విశ్లేషించి, గ్రామీణ తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం పూచిపడి, ప్రభుత్వ పాఠశాలలను బాగుచేసి, ఆదర్శంగా తీర్చిదిద్ది, ప్రతి ఊరికి గ్యారెంటీగా చదువు నేర్పే కేంద్రంగా పాఠశాలను తయారుచేసే చిత్తశుద్ధి ఉన్నదా? తెలంగాణ విద్యా కమిషన్‌ను నియమించింది. అది తన పనిచేసి సిఫారసులు, సూచనలు ఇచ్చిందా? వాటిని విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో చర్చలు చేసి చర్యలు తీసుకున్నదా? అది కాకుండానే మరో కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఆ కమిటీ చేసిన సూచనలు ఏమిటి? వాటిని విద్యావేత్తలు చర్చించారా? ఇవేవీ చేయకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను బిచ్చమెత్తుతూ, అప్పులు చేస్తూ పాఠశాలను బాగుచేశాం, మీ పిల్లలను చేర్పించండని అనగానే తల్లిదండ్రులు చేర్పిస్తారా? ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తానని వాగ్దానం చేసింది. రెండు బడ్జెట్లలో మొదటి సంవత్సరం 7.31 శాతం, రెండో సంవత్సరం 7.57 శాతం నిధులను మాత్రం కేటాయించింది. పాఠశాలలను బాగు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలతో విద్యారంగం బాగుపడుతుందా? నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను శంకుస్థాపన చేయగానే, 26 వేల పాఠశాలలు బాగుంటాయనుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పిస్తారని ప్రభుత్వం అనుకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలలను బాగుచేసే చిత్తశుద్ధితో ఈ చర్యలు తీసుకుంటుందా అని అనుమానం కలుగుతున్నది.
రాష్ట్రంలో 630 మండలాలకు గాను కేవలం 14 మండలాలకు మాత్రమే మండల విద్యాధికారులు (ఎంఈవోలు) ఉన్నారు. 20 ఏండ్లుగా ఈ పోస్టులకు పదోన్నతుల్లేవు. జోనల్ స్థాయిలో ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే 66 డిప్యూటీ విద్యాధికారుల పోస్టులకు 60 ఖాళీలు ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. అంతెందుకు 33 జిల్లాలకు గాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవోలు) ఉన్నారు. మిగిలిన 30 జిల్లాలకు డీఈవోలు లేకుండా గత రెండేండ్ల నుంచి పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సర్వీస్ రూల్స్ సమస్య అడ్డుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఏ సమస్యా లేకున్నా పరిష్కారానికి గత రెండేండ్లలో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. డీఈవో పోస్టుల్లో ఇంచార్జిలుగా నియమించడానికి అభ్యర్థుల్లేక ఐఏఎస్ అధికారులను నియమించారు. అందులో ఒక అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇదీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న విద్యాశాఖ నిర్వాకం!
రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ విద్యాశాఖకు మార్గదర్శకం వహించే శాఖ. దానికి డైరెక్టర్ తప్ప 44 పోస్టులలో ప్రొఫెసర్లు అధ్యాపకుల పో స్టులన్నీ ఖాళీయే! ఇక బోధనను పర్యవేక్షిస్తూ, అభ్యసనను మూల్యంకనం చేస్తూ, ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించడం, విద్యా లక్ష్యాలు, బోధనా విధానాలు, విద్యా ప్రణాళిక రూపకల్పన చేయడం, పాఠ్య పుస్తకాలు రచించడం, నూతన మూల్యంకనపై పరిశోధనలు చేయడం వంటి బాధ్యతలను నిర్వహించే అధ్యాపక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ సంస్థ విద్యార్థుల సామర్థ్యాలకు, నైపుణ్యాలకు మెరుగులు పెట్టే వ్యవస్థ. విద్యాశాఖకు గుండెకాయ వంటిది. విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్రంలో అకడమిక్ అథారిటీగా ఉంటుంది. ఖాళీ పోస్టులతో బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేని దీనస్థితిలో ఉన్నది. విద్యార్థుల సామర్థ్యాలను సక్రమంగా సానబెట్టగలగడానికి ఎస్సీఈఆర్టీని పటి ష్ఠం చేయాలి. అదే విధంగా ఉపాధ్యాయ విద్యను బోధించే విద్యా శిక్షణ సంస్థలన్నీ ఖాళీ అధ్యాపక పోస్టులతో చాత్రోపాధ్యాయులకు పూర్తి నైపుణ్యాలతో భావి ఉపాధ్యాయులుగా రూపొందలేకపోతున్నాయి. అందుకే ఉపాధ్యాయులకు శిక్షణ, మూ ల్యంకన, పాఠ్య ప్రణాళికల తయారీ వంటి బాధ్యతలన్నీ తూతూ మంత్రంగా సాగుతున్నాయి.
వెయ్యికి పైగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 650 పాఠశాలలకు శాశ్వత భవనాల్లేవు. ఆ భవనాల నిర్మాణానికి ఈ రెండేండ్లలో తీసుకున్న చర్యలేమీ లేవు. వసతుల లేమితో గత సంవత్సరం లక్ష మంది విద్యార్థులు గురుకులాలను వీడారు. ఈ విద్యా సంవత్సరంలో మరెన్ని ఖాళీలు ఏర్పడుతాయో ఇంకా తెలియదు. విద్యార్థులు గురుకులాల్లో చేరకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం అన్వేషించలేదు. బాలికల కోసం ప్రత్యేకంగా కస్తూర్బా విద్యాలయాల సమస్యలను పరిష్కరించాలి. ఆ పాఠశాలల్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అంతా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, అవర్ లీ బేస్డ్ ఉపాధ్యాయుల స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలి. అందుకు విద్యాశాఖ వద్ద ఇతోధికంగా నిధులు ఉండాలి. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించినప్పుడు ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదులు, అదనపు భవనాలు, మౌలిక వసతులు కల్పన సాధ్యమవుతుంది. అదేమీ లేకుండా ఆర్భాటపు ప్రకటనలు చేస్తే, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారా? ఈ విషయాన్ని విద్యాశాఖ ఆలోచించాలి.
రాష్ట్రంలో విద్యార్థుల సంక్షోభంలో ఉన్న పాఠశాల విద్యావ్యవస్థకు తక్షణ మార్పులను చేపట్టడం అత్యవసరం. అంతేకాదు, మొత్తం పాఠశాల వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు చేయడానికి దీర్ఘకాలికంగా ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలి. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ధనిక, పేద తేడా లేకుండా పిల్లలందరూ తమ నివాస ప్రాంతాల్లోనే ఒకే రకమైన బడులలో విద్యను అభ్యసించే విధంగా విధాన నిర్ణయాలు చేయాలి. సమాన విద్య, నాణ్యమైన విద్యను అందించే పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలి.
వెయ్యికి పైగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 650 పాఠశాలలకు శాశ్వత భవనాల్లేవు. ఆ భవనాల నిర్మాణానికి ఈ రెండేండ్లలో తీసుకున్న చర్యలేమీ లేవు. వసతుల లేమితో గత సంవత్సరం లక్ష మంది విద్యార్థులు గురుకులాలను వీడారు. ఈ విద్యా సంవత్సరంలో మరెన్ని ఖాళీలు ఏర్పడుతాయో ఇంకా తెలియదు.