మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాటిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలో రిజర్వేషన్లు అనేవి కేవలం పరిపాలన కోసం మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య వికాసానికి కీలక సాధనంగా మారాయి. అలాంటి రిజర్వేషన్ల ఖరారులో తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయ వర్గాలతో పాటు విజ్ఞులు, ప్రాజ్ఞులు, సామాజిక విశ్లేషకుల మధ్య కూడా లోతైన చర్చకు దారి తీశాయి.
తాజా రిజర్వేషన్ల ఖరారులో గమనించదగిన అంశం ఏమిటంటే, చాలాచోట్ల పురపాలికల తొలి సాధారణ ఎన్నికల్లో ఏయే స్థానాలు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో, అవే స్థానాలు మళ్లీ అదే కేటగిరీకి ఖరారవడం. ముఖ్యంగా మహిళలు, బీసీ రిజర్వేషన్లలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కేటగిరీకి స్థిరీకరించిన సీట్ల సంఖ్యను తీసుకుని, మొత్తం స్థానాలకు చిట్టీలు వేసి మహిళల స్థానాలను ఖరారు చేయడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సాంకేతికంగా ఇది చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉన్నప్పటికీ, గత ఎన్నికల అనుభవాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో కనీసం 50 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రశంసనీయం. గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన చైర్మన్, మేయర్ స్థానాలు ఈసారి కూడా మహిళలకే రావడం వల్ల, అదే ప్రాంతాల్లో వరుసగా మహిళా రిజర్వేషన్ కొనసాగుతోంది.
జనాభా గణాంకాలు, సామాజిక నిర్మాణం కాలక్రమేణా మారుతున్నప్పటికీ, డ్రా ప్రక్రియలో గత కేటాయింపులను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల అదే వర్గానికి మళ్లీ మళ్లీ రిజర్వేషన్ రావడం గమనార్హం. గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన సీట్లను స్పష్టంగా గుర్తించి, ఈసారి డ్రా ప్రక్రియలో వాటిని పక్కనపెట్టి, మిగిలిన సీట్ల నుంచే మహిళా రిజర్వేషన్ ఖరారు చేయాల్సింది. రిజర్వేషన్ల ఖరారు రాజకీయ పార్టీల వ్యూహాలపై కూడా ప్రభావం చూపుతోంది. కొన్ని పార్టీలు తమ బలమైన స్థానాలు తిరిగి అదే కేటగిరీకి రిజర్వ్ కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం మహిళా లేదా బీసీ అభ్యర్థులను సిద్ధం చేసుకుని దీన్ని అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. డ్రా ప్రక్రియ వల్ల కొన్ని స్థానాలు పదేపదే అవే కేటగిరీకి వెళ్లడం వల్ల ‘డ్రా ఉన్నా మార్పు లేదు’ అన్న భావన ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంది. రిజర్వేషన్ల ఖరారులో రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో, సామాజిక న్యాయ స్ఫూర్తిని విస్తృతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం అమలైన విధానం చట్టపరంగా సరైనదే అయినా, విధాన పరంగా మరింత సున్నితమైన ఆలోచన అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల విషయంలో ‘రొటేషన్’ సూత్రాన్ని మరింత కఠినంగా అమలు చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. గత ఎన్నికల్లో ఏయే స్థానాలు ఏ కేటగిరీకి కేటాయించారో స్పష్టంగా జాబితా రూపొందించి, వీలైనంత వరకు వాటిని తదుపరి డ్రాల్లో పక్కన పెట్టాలి. పూర్తిగా తప్పించలేని సందర్భాల్లో కనీసం పునరావృతం అయ్యే సీట్ల సంఖ్యను పరిమితం చేయాలి. జనాభా గణాంకాలు, సామాజిక మార్పులను తరచూ నవీకరించి, వాటి ఆధారంగా రిజర్వేషన్ నమూనాలను సవరించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి సాధనాలు కావాలి కాని పునరావృతానికి ప్రతీకలు కాకూడదు. తాజా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు అనుభవం ఈ సత్యాన్ని మరోసారి గుర్తు చేసింది. సమాన అవకాశాలు, విస్తృత ప్రతినిధిత్వం, కొత్త నాయకత్వ వికాసం అనే లక్ష్యాలు సాకారం కావాలంటే రిజర్వేషన్ల విధానంలో కాలానుగుణమైన మార్పులు తప్పనిసరి. అప్పుడే స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి నిజమైన పునాదులుగా నిలుస్తాయి.
-రామకిష్టయ్య సంగనభట్ల