ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే చర్యలు తీసుకోవడం ముదావహం. ఇందులో భాగంగానే ‘యాదగిరి గుట్ట’, ‘కొండగట్టు’ వంటి దేవాలయాల అభివృద్ధికి వందలాది కోట్ల నిధులను ఖర్చు పెడుతున్నది. పర్యాటక భక్తులను ఆకర్షించటానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పలువురిని మెప్పిస్తున్నాయి. సాధారణ పుణ్యక్షేత్రంగా ఉన్న యాదగిరిగుట్ట నేడు రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.
తెలంగాణలో అగ్రభాగాన నిలిచిన ఈ మహిమాన్విత క్షేత్రం నేడు పలు రూపాలు సంతరించుకున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసింది కాబట్టే ఇది సాధ్యమైంది. ఈ క్షేత్రంలో ‘స్వయంభు’గా వెలసిన లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి నర్సన్నగా భక్తుల పూజలందుకుంటున్నారు.
ఈ ఆలయాన్ని పునర్నిర్మించటానికి 2014లోనే ప్రణాళిక రూపొందించారు. ఆలయ పునరుద్ధరణ పూర్తయిన తర్వాత 2022, మార్చి 8 తర్వాత ప్రధాన గర్భాలయంలో ఉన్న నృసింహ దర్శనం భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.సత్యనారాయణ స్వామి వ్రత మంటపాన్ని సైతం గుట్టకింద ప్రాంతంలో ఏక సమయంలో 12 వేల వ్రతాలను నిర్వహించుకునేలా నిర్మించారు. ఇదికాకుండా, కొండ పై భాగంలో అద్భుత పచ్చదనాన్ని సంతరింపజేసి, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. నిధుల మంజూరుకు ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా, అత్యద్భుత శిల్పకళలతో, అధునాతన దర్శన మార్గాలతో యాదాద్రి విరాజిల్లుతున్నదంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే ఇందుకు నిదర్శనం.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కొండగట్టు’ను పర్యటించి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వేలాది మంది అంజన్న మాలలు ధరించిన భక్తులు తమ నిష్టను ఈ క్షేత్రంలో ముగిస్తారు. ఇప్పుడున్న కొండగట్టు క్షేత్రం భవిష్యత్తులో మరో అద్భుత పర్యాటక కేంద్రంగా భక్తులను అలరింపజేయనున్నది. ‘భద్రాచలం’ రామాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ ఆలయం చుట్టుపక్కల శ్రీరాముని అడుగుజాడలున్నాయి. భద్రాచలం నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేస్తే, భక్తులు మరింతగా పెరుగుతారు. నిజామాబాద్‌కు సమీపంలో గల ‘డిచ్పల్లి’ రామాలయం ఖజురహో చిత్రకళను సంతరింపజేసుకొని అత్యద్భుతంగా ఉంటుంది. రాష్ట్రంలో విశేష ప్రాచుర్యం కలిగిన ఎములాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, ‘గూడెం గుట్ట’ సత్యనారాయణ స్వామి ఆలయాలు మహిమాన్వితమైనవే!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డునే ఉన్న మట్టపల్లి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంతో పాటు, వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఆ జిల్లాలోనే ఉన్న ‘కొరవి’ వీరభద్రస్వామి ఆలయాలను కూడా మరిచిపోవద్దు. అలాగే హైదరాబాద్‌లో పలు సుప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి వల్ల రాష్ట్రంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తారు. భక్తుల కానుకలు, విరాళాలతో ఆయా క్షేత్రాలను సుసంపన్నం చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న కాలంలో తెలంగాణకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో పురాతన, కాకతీయుల శిల్పకళతో విరాజిల్లే ఆలయాలకు కొదవలేదు. ఉమ్మడి పాలనలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని స్థానిక దేవాలయాలకు ఇప్పుడు నిధులు పుష్కలంగా అందుతున్నాయి. దీంతో అర్చకులకు జీవనం దొరకటమే కాకుం డా, పరోక్షంగా ఎంతోమంది కి ఉపాధి లభిస్తున్నది. ప్రభు త్వం ఆధ్యాత్మిక పర్యాటకా న్ని వృద్ధి చేయటమే కాకుం డా, వాటికి సరైన ప్రచారం కల్పించాలి. ప్రతి పుణ్యక్షేత్రా న్ని రూట్ మ్యాపు ద్వారా వివరిస్తే పర్యాటకుల భక్తి నీరాజనాలను అందుకుంటాయి.
-పంతంగి శ్రీనివాసరావు
91822 03351