‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలూ తీసుకొచ్చాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వ బాధ్యత. ఉద్యోగుల సమస్యలకు క్యాబినెట్ సమావేశంలో పరిష్కార మార్గాన్ని కనుగొంటాం’ అని ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగులను నమ్మబలికారు. అంతకుముందు ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై, స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రుల కమిటీకి నివేదించింది. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు ఒరిగిందేమిటి?
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల తక్షణ చెల్లింపు, మొదటి తారీఖున వేతనాలు, సప్లిమెంటరీ బిల్లులను 15 పని దినాల్లో చెల్లించడం, సీపీఎస్ విధానం స్థానంలో ఓపీఎస్, సకాలంలో డీఏ ప్రకటన, జీవో 317ను సమీక్షించడం, ఏటా వేసవిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ఆరు నెలల్లోపు కొత్త వేతన సవరణ కమిషన్ సిఫారసుల అమలు, అన్ని దవాఖానల్లో, అన్ని రోగాలకు వైద్య సదుపాయం అందేలా హెల్త్‌కార్డులు లాంటి అనేక హామీలను అభయహస్తం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ, 16 నెలలైనా డిమాండ్లపై ఉలుకుపలుకు లేదు.
ఈ నేపథ్యంలో 205 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఉద్యోగుల జేఏసీ 2024 ఆగస్టు 29న ఏర్పాటైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సహా 57 డిమాండ్లను (అందులో 12 మాత్రమే ఆర్థికపరమైనవి) ప్రభుత్వం ముందుంచింది. కానీ, ఉద్యోగులకు దక్కింది ఒక డీఏ, మిగతా ఆర్థిక డిమాండ్లను మార్చి తర్వాత పరిష్కారిస్తామనే హామీ మాత్రమే. నిజానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఆర్థిక భారం లేని 45 డిమాండ్లకు పరిష్కారం దొరికేది.
వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 16 నెలల వరకు ఉద్యోగులు వేచిచూశారు. అయినప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ ఆందోళన తీవ్రతరం చేసింది. ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులతో చర్చించకుండా ముఖ్యమంత్రి తన హోదాను మరచి అసహనంతో ‘నన్ను కాల్చుకు తిన్నా.. కోసుకుతిన్నా, జీతాలివ్వడానికి డబ్బులు లేవు. జీతాలివ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని ఆపమంటారో చెప్పండి’ అని ప్రకటించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టే కుట్ర ఆ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్నదని జేఏసీ స్పందించింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని జేఏసీ బదులిచ్చింది. అయితే, తాజాగా క్యాబినెట్ ఆమోదించిన డిమాండ్లు ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో ప్రస్తుతం ఒక్క డీఏ మాత్రమే చెల్లిస్తామని, ఆరునెలల తర్వాత ఏప్రిల్‌లో మరో డీఏ ఇస్తామని క్యాబినెట్ ప్రకటించింది. ప్రతినెలా రూ.700 కోట్లను ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం విడుదల చేస్తామని చెప్పింది. ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలకు అనుమతిస్తూ ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, ఇందులో ఆర్థిక భారం లేని డిమాండ్లను వెంటనే ఆమోదిస్తున్నామనే ప్రకటన లేదు. మరి అభయహస్తం హామీల సంగతేమిటి? వెంటనే మూడు డీఏలు, ఆరు నెలల్లో పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి హామీలను క్యాబినెట్ బుట్టదాఖలు చేసిందా? అనే అనుమానాలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి.
2025 జూలై, 2026 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డీఏలతో కలిపి మళ్లీ 5 డీఏలు పెండింగులో ఉంటాయి. 5 డీఏలు ఏ రాష్ట్రంలోనూ పెండింగ్‌లో లేవు. డీఏ ఇవ్వడానికే బడ్జెట్ లేకపోతే ఇంకా పీఆర్సీ అటకెక్కినట్టేనా? క్యాబినెట్ చర్చలో పీఆర్సీ ప్రస్తావనే లేదు. 2023 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీకి ఇప్పటికే 24 నెలలు గడిచిపోయింది. ఈ పీఆర్సీ ప్రకటనతో ఇంకెన్ని నెలలు నష్టపోవాలో? నగదు రహిత చికిత్స కోసం ప్రతి ఉద్యోగి, పెన్షనర్ నుంచి నెలకు రూ.500 తీసుకునే ప్రతిపాదన వల్ల లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, గెజిటెడ్ ఉద్యోగులకు మధ్య తేడా ఉండదు. గుడ్డిలో మెల్లలాగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న గరిష్ఠ పరిమితి లేని నగదు రహిత వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరం. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా అధికారులతోపాటు ఉద్యోగులతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగినది. ఇక నెలకు రూ.700 కోట్ల చొప్పున బకాయిలు చెల్లిస్తే రూ.11 వేల కోట్లు చెల్లించడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో ఆలోచించాలి? ప్రతి నెల ఉద్యోగులు రిటైర్ అవుతుంటారు. ఏ నెలలో రిటైర్ అయినవారికి ఆ నెలలోనే బెనిఫిట్స్ చెల్లించడం కోసం ఇంకా ఎంత కాలం ఎదురుచూడాలో?
ఇచ్చేది ఆవ గింజంత, చేసుకునే ప్రచారం మాత్రం గుమ్మడి కాయంత! ప్రభుత్వం ఒక డీఏ ఇస్తూ, 2 డీఏలు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నది. ఈ మాత్రం దానికే ఘనత వహించిన జేఏసీ హర్షం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వానికి కృతజ్ఞతలూ చెప్పింది. ఆందోళన చేస్తారా, లేదా అన్నది స్పష్టత లేదు.
ఉద్యోగుల్లో పోరాట పటిమను పెంచి, ఆందోళనను తీవ్రతరం చేయాల్సిన నాయకత్వం చేష్టలుడిగి, ఇచ్చిందే మహాభాగ్యమని సంతోషపడటం శోచనీయం. ఇప్పటికైనా జేఏసీ నాయకత్వం మేల్కొని ఉద్యోగులను పోరాట పథంలో నడిపించాలి. ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్ల సాధనలో కీలకపాత్ర పోషించాలి. లేకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు అపరిష్కృతంగా ఉండి, తీవ్రంగా నష్టపోతారు.
– (వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్) కె.వేణుగోపాల్ 98665 14577