మొన్న గ్లోబల్ సమ్మిట్ హంగామా, నేడు మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్ హడావుడి చూసిన తర్వాత ‘బీడీ బిచ్చం.. కల్లు ఉద్దెర’ అనే తెలంగాణ సామెత రేవంత్‌రెడ్డి సర్కార్‌కు సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులకెవరికైనా అనిపించక మానదు. పెండింగ్ హామీల అమలును ప్రశ్నిస్తే తనను కోసుకొని తినమంటున్న సీఎం.. సంపద సృష్టిస్తానని డంబాచారాలకు దిగుతుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. అలాగే రెండేండ్లుగా తెలంగాణ మైదానాల్లో పెరిగిన కలుపు మొక్కలను కూడా పీకెయ్యచేతగాని హస్తం సర్కార్ ఏకంగా ఒలింపిక్స్ కథలు వల్లె వేస్తుండటం వెగటు పుట్టిస్తున్నది.
తాజాగా రాష్ట్ర సర్కార్ ఊదరగొడుతున్న స్పోర్ట్స్ పాలసీ కూడా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తయారుచేసిందే. చెప్పుకొంటూ పోతే ఇలా ఎన్నో విధాలుగా క్రీడాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసింది. దురదృష్టవశాత్తు చేసింది చెప్పుకోవడంలో ఓడిపోయింది. అయితే రెండేండ్లుగా రేవంత్ సర్కార్ మాత్రం అబద్ధాల్లో ఆరితేరిన నైజంతో నోటివాటాన్ని నమ్ముకొని నెట్టుకొచ్చే ఎత్తులు వేస్తున్నది. పాలకుల చర్యల వెనుక ప్రగతి దృష్టికోణం ఉంటేనే సమాజం గౌరవించి గుర్తుపెట్టుకుంటుంది. సంకుచిత గుణంతో ఏ ఘణకార్యం చేసినా ప్రజలు అసహ్యించుకుంటారు గానీ గౌరవించరనే సత్యాన్ని చరిత్ర చదివైనా రేవంత్ రెడ్డి లాంటి పాలకులు అర్థం చేసుకోవాలి.
పైగా గోట్ ఇండియా టూర్-2025 ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కమర్షియల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ చుట్టూ కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకుంటున్న ప్రచారం, ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్న తీరు జగుప్సాకరంగా ఉన్నది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో అరుపుల్లా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ మెస్సీ ముందు కేవలం ఐదు నిమిషాలు చెమటలు కక్కడం ద్వారా రాష్ట్రంలో క్రీడా విప్లవం పరుగులు పెట్టబోతున్నట్టు వింత ప్రచారంలో మునిగితేలుతున్నారు.
ఇలా ఆటలతో కూడా రాజకీయ పరాచికాలాట ఆడిన ముఖ్యమంత్రిని ఇటీవల కాలంలో మనం చూసిందే లేదు. నిజానికి రాజకీయాల్లో, పాలనలో ఆట నియమాలను ఇష్టారీతిన సంస్కారహీనంగా రేవంత్ సర్కార్ దిగజారుస్తూనే ఉన్నది. రాష్ట్ర స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల మధ్య సమన్వయంతో కూడిన పనితీరుపై కనీస అవగాహన కూడా లేకపోగా ప్రచార ఆర్భాటం ఊబిలో నిలబడి కీలకమైన రంగాలతో బంతాట ఆడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న గ్లోబల్ సమ్మిట్ పేరిట ట్రిలియన్ కలల ఊయలలో ఊపి ఎత్తులేసిన రేవంత్ రెడ్డి సర్కార్, తాజాగా మెస్సీ మెరుపును చూపి ఒలింపిక్స్ ఊహల్లో తేలిపొమ్మంటున్నది. అయితే ఇలాంటి కలల విధాన నమూనాను తెలంగాణ ప్రజలు ఏమైనా కొత్తగా వింటున్నారా? ఈ విధమైన సర్కార్ భ్రమాన్విత వృద్ధి ఊహకు వేషమేసి, పెట్టుబడిదారీ మీడియా నిత్యం ప్రదర్శించే అడుగు దూరంలోనే స్వర్గం అనే నాటకాలను ఇక్కడి ఆలోచనాపరులేమైనా ఇప్పుడే వీక్షిస్తున్నారా? అని పరిశీలిస్తే…
రేవంత్‌రెడ్డి సర్కార్ ఆడుతున్న ఆట ఏనాడో ఓడిపోయిందేనని తేలిపోతుంది. పాత చింతకాయ పచ్చడి పాలననే మళ్లీ హస్తం పాలకులు రాష్ట్ర ప్రజలకు రోజూ వండి వారుస్తున్నారని తేటతెల్లమైపోతున్నది.
2004కు ముందు ఆర్థికం నుంచి ఆటల వరకు అన్ని రంగాల్లోనూ అందరినీ ఆకాశానికి ఎగిరించే అల్లావుద్దీన్ అద్భుత దీపం అప్పటి ప్రభుత్వ పెద్దల చేతిలో ఉన్నదనే ప్రచారోద్యమాన్ని ఆనాటి సర్కార్ శ్రేయోభిలాషి మీడియా మూకుమ్మడిగా ఊరూవాడా ఊదరగొట్టేది. కానీ, పేకమేడల కథలు చెప్తూ ఉన్న గుడిసెలు తగలబెట్టే ఆనాటి విధానాన్ని తెలంగాణ ప్రజలు వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. అలాంటి విఫల నమూనానే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ తలకెత్తుకొని పరుగులు పెడుతున్నది. పారదని తెలుసుకొని ప్రపంచబ్యాంకు కూడా దూకుడుగా దేశాలపై రుద్దడాన్ని తగ్గించిన పాలసీనే తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ నమ్ముకొని అందరినీ ఏమార్చే ఎత్తులేస్తున్నది. ఆ విధానంలో భాగంగానే క్రీడల్లో కూడా ప్రదర్శిస్తున్న కపటత్వాన్ని మెస్సీ పర్యటన సందర్భంగా బయటేసుకుంటున్నది.
ఉప్పల్ స్టేడియంలో ప్రభుత్వేతర వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగే ఫుట్‌బాల్ ఈవెంట్లో మెస్సీతో కేవలం ఐదే నిమిషాలు, అదీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి ముఖ్యమంత్రి పడుతున్న పాట్లు, ప్రభుత్వం చేస్తున్న ప్రచారం సర్కార్ వారి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే గుణాన్ని బట్టబయలు చేస్తున్నది. ఏడాదిన్నరకు పైగా క్రీడా శాఖను తనవద్దే అట్టిపెట్టుకొని వివిధ సందర్భాల్లో ఒలింపిక్స్ పథకాల లెక్కలు వల్లె వేస్తూ, రాష్ట్రంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులకు మైదానాల్లో చందమామను దింపబోతున్నట్టుగా నమ్మబలికాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లలో క్రీడాశాఖకు కేటాయింపుల్లో విన్యాసాలు చూపించి, నిధుల విడుదలలో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోలానే క్రీడా రంగానికి కూడా ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావులా కోడిని వేలాడదీసి, దాన్ని చూస్తూ దమ్ బిర్యానీ తిన్నామని తృప్తిపడాలని ఉత్సాహవంతులైన నవతరాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెక్కిరిస్తున్నది. పైగా ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలను కమర్షియల్ ఈవెంట్లకు బలిపెడుతూ మైదానాల్లో కష్టపడే క్రీడాకారులకు మోకాలడ్డం పెడుతున్నది. అంతేకాదు, ఆ మధ్య ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి తదితర చారిత్రక స్టేడియాలను అదానీ గ్రూప్‌కు అప్పగించాలనే ప్రయత్నం కూడా రేవంత్ సర్కార్ చేసిన విషయం క్రీడాలోకానికి తెలిసిపోయింది.
దీనికితోడు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలు, అకాడమీలు, స్టేడియాలు రెండేండ్లుగా ఎలాంటి ఆలనాపాలనకు నోచుకోక ఉసూరుమంటున్నాయి. కేవలం క్రీడారంగంపై ఉన్న ప్రేమతో తమ వ్యక్తిగత ఎదుగుదలను పణంగా పెట్టి క్రీడాప్రాధికార సంస్థలో శ్రమిస్తున్న కాంట్రాక్ట్ కోచ్‌లు, రెగ్యులర్ కోచ్‌ల సమస్యలను రెండేండ్లుగా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. పైగా హక్కుల కోసం ప్రశ్నించిన కోచ్‌లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. 2024 వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, భర్తీ ప్రక్రియలో స్పోర్ట్స్ అథారిటీ చేసిన అవకతవకలను రాష్ట్ర హైకోర్ట్ తీవ్రంగా తప్పుపట్టినా సరిదిద్దే నాథుడే లేకుండాపోయాడు. అలాగే ఖేలో ఇండియా నిధుల్లో భాగంగా కేంద్రం దేశంలోనే అత్యల్పంగా తెలంగాణకు రూ.17.77 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొంటున్నా నరేంద్ర మోదీ సర్కార్‌ను నిలదీసే ధైర్యం మాత్రం రేవంత్ సర్కార్‌లో కరువైపోయింది. పైగా ఇటీవల ఇండియా, మలేషియాతో పాటు మరో దేశపు జట్టు మాత్రమే పాల్గొన్న ఫుట్‌బాల్ మ్యాచ్‌కు కాంటినెంటల్ కప్‌కు ఉన్న అర్థం కూడా తెలియకుండా, ఆ పేరుతో భారీగా నిధులు వృథా చేశారు.
ఇలా ఏడాదిన్నర పాటు క్రీడా శాఖను తనవద్దే పెట్టుకొని నిర్లక్ష్యం చేయడంతో పాటు తర్వాత కూడా నిధుల్లేని శాఖలు ఇచ్చారని స్వయంగా క్రీడా శాఖామంత్రి వాకిటి శ్రీహరే వాపోయేలా ముఖ్యమంత్రి ఉత్త చేతులు ఊపుతూనే ఉన్నారు.
కానీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సేవ చేసే అవకాశం కల్పించిన తర్వాత ఆటల్లో అందమైన జీవితముందనే వాస్తవాన్ని దగ్గరినుంచి గమనించాను. ఆ పదవిలో నేనున్నది కేవలం 11 నెలల స్వల్పకాలమే అయినా క్రీడాలోకంతో విడదీయలేని మమకారాన్ని సంపాదించుకునేలా పనిచేసే ప్రోత్సాహాన్ని, మార్గనిర్దేశాన్ని కేసీఆర్ అందించారు. అందుకే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 5 లక్షల మందికి పైగా యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచిన సీఎం కప్-2023ను అత్యద్భుతంగా నిర్వహించాం. రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీల్లో పది వేల మందికి పైగా గ్రామీణ దళిత, బడుగువర్గాల యువకులు దాదాపు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సహా ప్రముఖ స్టేడియాల్లో వివిధ క్రీడా ఈవెంట్లలో అత్యద్భుతంగా ఆడి పరవశించారు. ఆ సీఎం కప్ ప్రారంభ వేడుకలను కేసీఆర్ ప్రోత్సాహంతో, అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అప్పటి కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పర్యవేక్షణలో ఒలింపిక్స్, జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లా ఘనంగా నిర్వహించాం. అంబరాన్ని అంటే ఆ క్రీడా సంబురాల్లో వేలాది యువకిషోరాలు రాష్ట్ర భవిష్యత్ కోసం క్రీడా విప్లవానికి అంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ విజయవంతంగా నిర్వహించిన సీఎం కప్ కార్యక్రమాన్ని తమిళనాడు అధ్యయనం చేసి ఆ రాష్ట్రంలో కూడా ‘సీఎం కప్’ను, ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేసి ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇప్పటి ప్రభుత్వ పెద్దలకు తీరికుంటే వాటి వీడియోలు, ఫొటోలు చూసుకోవచ్చు. అంతేకాదు, మహిళా చెస్ చాంపియన్ ట్రోఫీ, చలో మైదాన్, ట్రై క్రీడా వేడుకలు ఇలా ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో రాష్ట్రంలోని లక్షలాది యువతను భాగస్వాములను చేశాం.
ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే స్పోర్ట్స్ కోడ్ అమలుచేసి, క్రీడా సంఘాల్లో నూతనోత్తేజం తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించాం. రాష్ట్రంలోని 12 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ స్పోర్ట్స్ అథారిటీలను పీఈటీ, పంచాయతీ కార్యదర్శి, క్రీడాకారుల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసే కార్యాచరణను సిద్ధం చేశాం. గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్వహణ, ప్రతి ఏటా యువత, రైతు, మహిళా క్రీడాపోటీల నిర్వహణను పంచాయతీ స్పోర్ట్స్ అథారిటీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి గ్రామంలో యువ క్రీడాకారులతో స్పోర్ట్స్ క్లబ్‌లను ఏర్పాటుచేసి, రాష్ట్ర, పంచాయతీ స్పోర్ట్స్ అథారిటీకి అనుసంధానం చేసి ఏటా స్పోర్ట్స్ క్యాలెండర్‌ను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం.
అంతెందుకు గతంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికపై వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నవారితో ఓల్డ్ స్పోర్ట్స్ హాస్టలర్స్ అసోసియేషన్ మొదలుపెట్టించి వారందరినీ హైదరాబాద్‌లో సమీకరించి క్రీడా విప్లవంలో వారంతా కలిసివచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. అందులో భాగంగా దాదాపు రూ.వంద కోట్ల విలువైన క్రీడా సామగ్రిని కూడా ప్రతి గ్రామానికి కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో క్రీడాస్ఫూర్తిని నిత్యం ఉనికిలో ఉంచేందుకు మైదాన్ పేరుతో యూట్యూబ్ టీవీ, క్రీడా సంపుటికి కూడా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేశాం. ఒకవేళ 2023 ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా సమాజం ఏకతాటిపైకి వచ్చి దేశ క్రీడా విప్లవానికి శంఖారావం పూరించేది.
ఏది చేసినా రాష్ట్ర దీర్ఘకాలిక, సుస్థిర ప్రయోజనమే ఆశయంగా నడుచుకున్న నాటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ తక్షణ లక్ష్యాలపై దృష్టి నిలిపి వ్యవసాయ, సాగునీటి, విద్యుత్తు, విద్యా తదితర మౌలిక రంగాల్లో స్వల్పకాలంలోనే తలమానికంగా నిలిచే విజయాలు నమోదు చేసింది. అనంతరం క్రీడారంగంపై కూడా దృష్టిసారించి గ్రామ పునాదుల్లో నుంచి క్రీడాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది. దాదాపు 18 వేల క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కేటాయించి యువతకు అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ స్టేడియాల్లో కొత్త స్టేడియాల ఏర్పాటుతో పాటు పాత వాటిలో మౌలిక వసతులు కల్పించింది. మహబూబ్‌నగర్, ఖమ్మంతో సహా అనేక జిల్లా కేంద్రాల్లో ఇండోర్ స్టేడియాలను సైతం అభివృద్ధి చేసింది. అనేక నూతన క్రీడా అకాడమీలను ఏర్పాటుచేసింది. దీనికితోడు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన నిఖత్ జరీన్, అరుణ లాంటి క్రీడాకారులకు బంజారాహిల్స్ లాంటి ప్రాంతంలో 609 గజాల విలువైన స్థలాలు, కోట్ల రూపాయల నగదు అందించి అన్నివిధాల కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సహించింది.
తాజాగా రాష్ట్ర సర్కార్ ఊదరగొడుతున్న స్పోర్ట్స్ పాలసీ కూడా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తయారుచేసిందే. చెప్పుకొంటూ పోతే ఇలా ఎన్నో విధాలుగా క్రీడాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసింది. దురదృష్టవశాత్తు చేసింది చెప్పుకోవడంలో ఓడిపోయింది. అయితే రెండేండ్లుగా రేవంత్ సర్కార్ మాత్రం అబద్ధాల్లో ఆరితేరిన నైజంతో నోటివాటాన్ని నమ్ముకొని నెట్టుకొచ్చే ఎత్తులు వేస్తున్నది. పాలకుల చర్యల వెనుక ప్రగతి దృష్టికోణం ఉంటేనే సమాజం గౌరవించి గుర్తుపెట్టుకుంటుంది. సంకుచిత గుణంతో ఏ ఘనకార్యం చేసినా ప్రజలు అసహ్యించుకుంటారు గానీ గౌరవించరనే సత్యాన్ని చరిత్ర చదివైనా రేవంత్ రెడ్డి లాంటి పాలకులు అర్థం చేసుకోవాలి. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌ను అడాల్ఫ్ హిట్లర్ ఘనంగా నిర్వహించినప్పటికీ, దానివెనక నాజీ ఆధిపత్య ప్రచారానికి వాడుకునే దుర్బుద్ధి ఉండటం వల్ల ఆయన చరిత్రలో నియంతగానే మిగిలాడు. ఇప్పటికైనా క్రీడా రంగానికి మేలు చేసే ఉద్దేశం ఏ కొంచెం ఉన్నా, గత కేసీఆర్ ప్రభుత్వం క్రీడా విప్లవానికి మొదలుపెట్టిన విధానాలను వివేకంతో ముందుకుతీసుకుపోవాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్