రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన వ్యక్తి ఎంత బాధ్యతగా మెలగాలి? ఎంత పద్ధతిగా ఉండాలి? ఎంత సంయమనంతో వ్యవహరించాలి? కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవేం పట్టడం లేదు. ప్రజాస్వామ్యయుతంగా నడిపించాల్సిన అసెంబ్లీని పరాచికం చేస్తున్నారు. చట్టాలు రూపొందే అసెంబ్లీలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు, అధికార అహంకారంతో రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో అభద్రత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. మొత్తంగా చెప్పాలంటే రేవంత్‌రెడ్డిలో అప్పుడప్పుడు అపరిచితుడు ప్రత్యక్షమవుతున్నాడు. అపరిచితుడిగా ఆయన వినిపిస్తున్న బూతు పురాణం, వ్యక్తిగత దూషణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఆయనలో అపరిచితుడు పూనుకుంటే ఎలా ఉంటుందో అసెంబ్లీ దృశ్యాలను చూస్తే సరిపోతుంది. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ హుందాగా మాట్లాడుతుంటే సభను పక్కదారి పట్టించేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నించారు. ఇది గర్హనీయం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్తే బతుకమ్మ చీరలపై చౌకబారుగా మాట్లాడారు.
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చ మొదలుపెట్టడంతో రేవంత్‌రెడ్డి అంతర్మథనంలో పడిపోతున్నారు. ప్రతిదాడి చేసేందుకు ఆయనకు బూతుపురాణమే ఏకైక ఆయుధంగా కనపడుతున్నది. అందుకే ఆయన తిట్ల దండకాన్ని నమ్ముకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను టీవీల్లో చూస్తు న్న రాజకీయ విశ్లేషకులు ఆయనలో కనీస అవగాహన కరువైందని విమర్శిస్తుండటం శోచనీయం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం గౌరవం అనిపించుకోదని ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు ఆయన రేవంత్‌రెడ్డి కాదు, ముఖ్యమంత్రి.
ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అసెంబ్లీలోనే కాదు, బయట కూడా ఆయన మాట తీరు మారకపోవడం విడ్డూరం. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ మాటతీరులో మార్పు వస్తుందని చాలామంది ఆశపడ్డారు. కానీ, ఆయన ‘పేగులు మెడలో వేసుకుంటా’, ‘లాగుల తొండలు సొర్రగొడుతా’, ‘పండవెట్టి తొక్కుతా’, ‘వంగోవెట్టి గుద్దుతా’ లాంటి తిట్ల దండకంతో విడ్డూరంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి బూతుపురాణాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన మాటతీరును మార్చుకోవాలని హితవు పలికారు.
అయితే, మొన్నటికి మొన్న విద్యుత్ కమిషన్‌పై చర్చలో భాగంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా ఒకవైపు సబ్జెక్ట్‌పై మాట్లాడాలని పదే పదే చెప్తూనే మరోవైపు ప్రతిపక్ష నాయకులపై రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రతిపక్ష నేతలను తూలనాడారు. అధికారపక్షం వైపు నుంచి మంత్రులు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయగానే, గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగానికి పెట్టిన ఖర్చు, విద్యుత్ ప్లాంట్లపై మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆయన ఒకడుగు ముందుకువేసి కేసీఆర్ ప్రభుత్వ హయంలో విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధిని సభ దృష్టికి తీసుకువచ్చారు. మధ్యలో మంత్రి వెంకట్‌రెడ్డి, ఇతర మంత్రులు కలుగజేసుకొని అవినీతికి పాల్పడ్డారని వాగ్వాదానికి దిగారు. ఇందుకు జగదీశ్వర్‌రెడ్డి దీటైన సమాధానం ఇచ్చారు. ‘మా హయాంలో తప్పు జరిగినట్టు రుజువు చేయండి నేను రాజీనామా చేస్తా’నని ప్రతిసవాల్ విసిరారు. దీంతో ప్రభు త్వం ఆత్మరక్షణలో పడిపోయింది. ఇది గమనించిన రేవంత్‌రెడ్డి కలుగజేసుకొని సభ వాతావరణాన్నే మార్చేశారు. అప్పటివరకు విద్యుత్‌రంగంపై చర్చ సాగుతున్న సమయంలో రేవంత్ ఎంట్రీ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి?
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి దీటైన జవాబు రావడంతో సీఎం రేవంత్‌లో ఆందోళన మొదలైంది. అందుకే హౌజ్ బయట ఉన్న సీఎం హడావుడిగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రేవంత్ దాడిని కేటీఆర్, హరీష్, జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు తిప్పికొట్టారు. ఇదంతా తట్టుకొలేక సీఎం అసెంబ్లీనే తప్పుదోవ పట్టించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా పనిచేసేది ప్రజల కోసమే. అందులో ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అధికారపక్షం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, తన తప్పులను, ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నదనేది నూటికి నూరుపాళ్లు నిజం. నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విషయంలోనూ సీఎం ఇదే అస్ర్తాన్ని ఉపయోగించారు.
ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిగానే ఉండా లి. ఆయనలో అపరిచితుడు పూనుకుంటే ఎలా ఉంటుందో అసెంబ్లీ దృశ్యాలను చూస్తే సరిపోతుంది. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ హుందాగా మాట్లాడుతుంటే సభ ను పక్కదారి పట్టించేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నించారు. ఇది గర్హనీయం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్తే బతుకమ్మ చీరలపై చౌకబారుగా మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించారు. అక్క అంటూనే ఆమెను హేళన చేస్తూ మాట్లాడారు. ఒక మహిళను అసెంబ్లీ సాక్షిగా అవమానించిన ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని మహిళలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కితీసుకొని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ముఖ్యమంత్రిగా రేవంత్ తన భాష తీరును మార్చుకోవాలి. తాను వ్యవహరించే తీరు ఎంత హుందా గా ఉంటే అంతగా రాష్ర్టానికి మేలు జరుగుతుందనే విషయం ఆయన తెలుసుకోవాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724