‘స్త్రీల మనోభావాలకు అందమైన భాషలు ఎన్నెన్నో’ అని అడ్వర్టయిజింగ్ మేధావి అలెక్ పదమ్సీ రాసినట్టు, ఆధిపత్యానికి కూడా అహంకారాన్ని, చాతుర్యాన్ని కలబోసిన అందమైన భాషలు ఎన్నెన్నో ఉంటాయి. అవి, ‘తెలంగాణ వారికి వ్యవసాయం చేయడం, వరి బువ్వ తినడం మేమే నేర్పాం’ అనే బాహాటమైన దురహంకారం నుంచి, ‘సాంస్కృతిక దిగ్గజాల విగ్రహాలను కాదనడమేమిట’నే ఆశ్చర్యచకితమైన అమాయకపు నటనల చాతుర్యం వరకు ఎన్నెన్నో భాషలలో వ్యక్తమవుతుంటాయి. సాంస్కృతిక వలసవాదం మరొకమారు చాప కింద నీరులా వ్యాపిస్తుంటుంది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను పురస్కరించుకొని, దానిపై తెలంగాణవాదుల అభ్యంతరాలను, అందుకు కొందరు కోస్తా ప్రాంతీయుల విమర్శలను గమనించినప్పుడు కొన్ని ఆలోచనలు అనివార్యంగా కలుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సాగుతుండిన కాలంలో అందులో భాగంగా సంస్కృతిపరమైన వివాదాలు కూడా చాలా జరిగాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ధనిక వర్గాలు తెలంగాణను ఆర్థికంగా దోచి, రాజకీయంగా ఆధిపత్యం వహించడంతోపాటు ఇక్కడి భాషా సంస్కృతులను అణచివేశాయన్న అభిప్రాయం తెలంగాణలో విస్తృతంగా ఉండేది.
అటువంటి అభిప్రాయానికి ప్రతిగా ఆంధ్రప్రాంతం నుంచి ఆ కాలంలో ఎటువంటి వివరణలు రాలేదు, సవరణలూ జరగలేదు. ఇటునుంచి మాత్రం సాంస్కృతిక పునరుజ్జీవన ధోరణులు బలంగా ముందుకువచ్చి, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. అది సాధారణ సమాజం నుంచి సినిమారంగం వరకు పలు విధాలుగా కనిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణవారు తమ సంస్కృతి అణచివేత నుంచి విముక్తి చెంది తిరిగి పట్టాభిషిక్తమైనట్టు భావించి సంతృప్తిగా జీవిస్తున్నారు.
సాంస్కృతికమైన అణచివేతకు ప్రతిఘటన ఉద్యమకాలంలో ఒకసారి తీవ్రమైన రూపంలో కనిపించింది కూడా. అది 2011 నాటి మిలియన్ మార్చ్ సందర్భంగా. ఆ కార్యక్రమం ట్యాంక్‌బండ్‌పై జరిగినప్పుడు, అక్కడి సీమాంధ్ర ప్రాంత ప్రముఖుల విగ్రహాలు కొన్నింటిని ఆందోళనకారులు పడగొట్టారు. దానిపై తర్వాత చాలా చర్చ జరిగింది. ఆ విషయాల్లోకి వెళ్లడం లేదిక్కడ. కానీ, తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి, ఆత్మగౌరవ ఆకాంక్షలలో సంస్కృతికి కూడా ప్రముఖ స్థానం ఉంటూ వచ్చిందన్నది ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి సుదీర్ఘమైన నేపథ్యం ఉన్న స్థితిలో, అందుకిక కాలగమనంలో ప్రాముఖ్యం లేకుండా పోతుందని, తెలంగాణ ప్రజలు మరిచిపోతారని భావించడం పొరపాటు అవుతుంది.
చరిత్ర, సంస్కృతి, మనోభావనలతో ముడిపడి ఉండే అంశాల బలం, లోతు గురించి అవగాహన లేనివారు మాత్రమే అట్లా ఆలోచించగలరు. ఆర్థిక దోపిడీ, రాజకీయ ఆధిపత్యంతో పోల్చితే సాంస్కృతికమైన వివక్ష, అణచివేతలు మనోభావనలతో ముడిపడిన సున్నితమైన, లోతైన విషయాలు. ఆ మాట ధనిక వర్గాలు, రాజకీయవర్గాల కన్నా సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, మేధావులు, రచయితలకు స్పష్టంగా తెలియాలి. కానీ, విచారకరంగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఈ వర్గాలలో కొద్దిమంది తప్ప, తక్కినవారు ఈ విషయమై ఉద్యమ కాలమంతా నోరు విప్పలేదు. దోపిడీ ఫలాలు కొన్ని పెర్కొలేషన్ థియరీ ప్రకారం తమకు కూడా లభిస్తుండటం వల్ల కావచ్చు.
కొందరైతే తెలంగాణ ప్రజల భావనలను సాంస్కృతిక కోణంతో సహా అన్నివిధాలా అపహాస్యం చేశారు. తెలంగాణ కోరికను పాకిస్థాన్‌తో పోల్చి కించపరిచిన ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి వంటి మహానుభావునికి ఘనమైన వారసులుగా మిగిలారు తప్ప, ఆ కోరికలోని సామంజస్యాన్ని గుర్తించిన అగ్రశ్రేణి చరిత్ర పరిశోధకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వారసులు కాలేకపోయారు.
ఇదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతున్నదా అనే సందేహం కొత్తగా తలెత్తిన బాలసుబ్రమణ్యం విగ్రహ వివాదం సందర్భంగా కలుగుతున్నది. ఇటువంటి ఆధిపత్య భావనలు మెటీరియలిస్ట్ దోపిడీ సంస్కృతిలో భాగమైనందున, వారి సంస్కృతి ఈ ధోరణి సరైనదైనట్టు లోగడ చెప్పినట్టే ఇప్పటికీ చెప్తున్నదేమో. ఇది గమనించినప్పుడు, వందేండ్ల కన్నా క్రితపు విషయం ఒకటి గుర్తుకువస్తున్నది. బ్రిటిష్ వలస పాలనాకాలంలో ఇండియాలో పుట్టి, ‘ద జంగిల్ బుక్’ అనే రచనతో ఇక్కడ ప్రసిద్ధుడైన కవి, రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్‌కు తర్వాత సాహిత్యంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కానీ, ఆయనకు మరో కోణం కూడా ఉంది. అది సామ్రాజ్యవాద కోణం, తెల్ల జాతి దురహంకార కోణం.
ఈ విషయంలో ఆయనకు అప్పటి మరొక సామ్రాజ్యవాద దేశం అమెరికాతోనూ సంఘీభావం ఉండేది. దానితో, ఫిలిప్పీన్స్‌పై అమెరికా దండెత్తి యుద్ధం చేసినప్పుడు, ఫిలిప్పీన్స్‌ను ఆక్రమించి ఒక వలసగా మార్చుకోవాలని కోరాడు. అంతటితో ఆగక, తన సాంస్కృతిక ప్రతిభను సద్వినియోగపరుస్తూ, ‘ద వైట్ మ్యాన్స్ బర్డెన్’ అనే శీర్షికతో ఒక కవితను కూడా 1899లో రాశాడు. ఫిలిప్పీన్స్ వంటి వెనుకబడిన దేశాన్ని ఆక్రమించి వలసగా మార్చుకొని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, అక్కడి ప్రజలను నాగరికులుగా మార్చడం అమెరికా వంటి తెల్లజాతి వారి దేశం బాధ్యత అన్నది ఆయన ఉద్దేశం. తనను మార్క్‌ట్వేన్ వంటి విఖ్యాత రచయిత, విలియం ఈస్టర్న్ వంటి ప్రముఖ కవి తదితరులు తీవ్రంగా ఖండిస్తూ రచనలు చేశారు. ఇవే భావనలు ఆఫ్రికాకు వ్యాపించగా, అక్కడి నల్ల జాతి వారిపై పాశ్చాత్య దేశాల దోపిడీని ఎత్తిచూపుతూ ‘ద బ్లాక్ మ్యాన్స్ బర్డెన్’ పేరిట రచనలు వచ్చాయి.
ప్రస్తుత సందర్భాలకు అన్వయిస్తే, ఏది ‘ఆంధ్రా మ్యాన్స్ బర్డెన్’ అయి తెలంగాణ ప్రజలకు వ్యవసాయాన్ని, వరి బువ్వను నేర్పిందో, ఏది ‘తెలంగాణ మ్యాన్స్ బర్డెన్’ అయి బయటివారి విగ్రహాలను మోయిస్తున్నదో ఎవరి సమాధానాలు వారు చెప్పుకోవచ్చు. అదే విధంగా సీమాంధ్ర మేధావులు, రచయితలు, కళాకారులలో రుడ్యార్డ్ కిప్లింగ్లు ఎవరో, మార్క్ట్వేన్లు ఎవరో కూడా ఎవరికి వారు తేల్చుకోవచ్చు. గమనించదగినది మరొకటి ఉన్నది.
యూరోపియన్ తెల్లవారు 500 ఏండ్ల క్రితం కరీబియన్ దీవులకు, ఆఫ్రికాకు అన్వేషకులుగా వెళ్లినప్పుడు మొదలైన శ్వేత జాతి ఆధిక్యతావాదం, అక్కడివారిని నాగరికులు చేయాలనే ‘ఉదాత్త’ భావనలు, ఈ రోజుకు కూడా ‘వైట్ సుప్రీమసీ’ ధోరణిగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వైట్ సుప్రిమసిస్టు కావడం తెలిసిందే. అదే ప్రకారం, ఉమ్మడి రాష్ట్రం అంతరించిన వెనుక కూడా తెలంగాణ నేల, సుప్రిమసిస్టుల విగ్రహాలను రకరకాలుగా అందమైన, తార్కికమైన పేర్లతో, వాదనలతో మోస్తుండాలన్న మాట. చేగువేరా నుంచి మతతత్వం వరకు చిత్రవిచిత్ర వేషధారణ చేస్తున్న ‘జోకర్ ఇన్ ద ప్యాక్’ కొబ్బరి చెట్ల వ్యాఖ్యలూ ఇటువంటి అహంకారమే.
తర్కాలు ఎంతో సమర్థవంతంగా, తార్కికంగా, చాకచక్యంగా వినవస్తున్నాయి కూడా. పలానా నాయకుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా అంటూ, తెలంగాణ విడిపోయిన తర్వాత సైతం ఆయన విగ్రహం కొత్తగా వచ్చి చేరుతుంది. ఆయన మొదటినుంచే గాక, చివరి దశలోనూ తెలంగాణను తెరవెనుక తీవ్రంగా వ్యతిరేకించి అనేక ఎత్తుగడలు వేశాడన్న మాట గాలిలో కలిసిపోతుంది.
బాలసుబ్రమణ్యం అద్భుతమైన గాయకుడన్న మాటను తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు గనుక అదే కోణాన్ని పదే పదే నొక్కి చెప్పడమైతే చేస్తారు గానీ, అదే తెలంగాణ ప్రజల మనోభావాలనే మరొక కోణానికి సంబంధించి, ఆయన అందెశ్రీ గీతంలోని తెలంగాణ అంశాన్ని ఉచ్ఛరించేందుకు నిరాకరించారనే విషయాన్ని విమర్శకులు పదే పదే ఎత్తిచూపినా అందుకు ఎంతమాత్రం స్పందించరు. ఒక విషయానికి పలు కోణాలుంటాయి. ఏ ఒక్క కోణమూ దానికదే సర్వస్వం కాదు. అటువంటప్పుడు విజ్ఞత గలవారు చేయవలసిన పని అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకొని సమన్వయాన్ని సాధించడం. కానీ, అది జరగకపోవడంతో వివాదం కొనసాగుతున్నది. కొనసాగుతూనే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆధిపత్య ధోరణులు చింత చచ్చినా పులుపు చావనట్టు వెల్లడవుతుండేది ఈ విధంగానే.
గమనించదగినది మరొకటి కూడా జరుగుతున్నది. హైదరాబాద్‌లో గాని, బయట తెలంగాణలో గాని సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ విషయమై ఉద్యమ కాలంలోనే ప్రశ్నలు తలెత్తగా, అందుకు సీమాంధ్ర ప్రాంతీయులు రొటీన్ సమర్థనలు ఇచ్చారు, బాగున్నది.
కానీ, తెలంగాణ ప్రముఖులు కూడా ఎందరో వేర్వేరు రంగాల్లో ఉన్నప్పుడు, వారిలో ఒక్కరి విగ్రహమైనా, మచ్చుకైనా సీమాంధ్రలో లేనిది ఎందువల్ల? ఉమ్మడి రాష్ట్ర కాలంలో లేదు, ఆ తర్వాత 11 ఏండ్ల కాలంలోనూ ఏర్పాటు కాలేదు. సరికదా, తెలంగాణలో మాత్రం అక్కడి వారి విగ్రహాలు విభజన తర్వాత కూడా వస్తున్నాయి. ఎందువల్ల? ప్రముఖులను, సంస్కృతిని గౌరవించవలసిన బాధ్యత, సంస్కారం తెలంగాణ వారికి మాత్రమే ఉండాలా?
ఇటువంటి ప్రశ్నలను అక్కడివారు తమ చాతుర్యాన్ని, గడుసుతనాన్ని ప్రదర్శిస్తూ, అదంతా తెలంగాణ వారి సంకుచిత ధోరణిగా కొట్టివేయచూడవచ్చు. అది వారు అన్నింటికి అన్ని విషయాలలో 1956 నుంచి చూపుతున్న ఆధిపత్యం, అహంకారం, చాతుర్యం, గడుసుతనమే. అటువంటి నిర్హేతుకమైన, నిజాయితీ లేని వైఖరుల మూలంగానే చివరికి 2014లో ఏమి జరిగిందీ వారికి తెలుసు. అయినప్పటికీ ఏదీ మరవని, ఏదీ నేర్చుకోని ఫ్రెంచ్ బౌర్బన్ల వలెనే ఇప్పటికీ వ్యవహరించడం, తెలంగాణ వారి మనసులను గాయపరుస్తూనే ఉండటం ఒక విచారకరమైన అంపశయ్య వ్యాధి.
– టంకశాల అశోక్