‘ప్రశ్నించడం ఏడో గ్యారెంటీ’ అని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ, ఆరు గ్యారెంటీల అమలును మర్చిపోయినట్టుగానే ప్రస్తుతం ఏడో గ్యారెంటీని కూడా గ్యారేజీలోకి నెట్టేసింది. అందుకే తమ పాలన గురించి ఎవ్వరు ప్రశ్నించినా సహించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు తావులేనప్పుడు పాలన ఎట్లా సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులపై ప్రజల నుంచి తీవ్ర ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతున్నదనే విషయం సులభంగానే అర్థమవుతున్నది. అధికారంలోకి వచ్చీరాగానే తామేదో చేస్తున్నామని చూపించుకునే ప్రయత్నం చేశారు. తొలి మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి, దానికి పరిష్కార మార్గాలు ఎట్లా చూపించాలో వారికి అస్సలు తెలియడం లేదు. అందుకే ప్రజలపైనా, ప్రశ్నించే వారిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతున్నది.
ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నది. మీడియా ప్రతినిధుల చెంపలు చెళ్లుమనిపిస్తానని గతంలోనే సీఎం అన్నారు. అంతేకాదు, జర్నలిస్టుల అర్హతల గురించీ మాట్లాడారు. ప్రశ్నించే మీడియా పట్ల వారి వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పుకున్నారు. సీఎం మాటలపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయం అనుభవంలో ఉన్నదే. అయినా ఈ విషయాన్ని తమ టీవీ ద్వారా ప్రజలకు చూపిస్తున్న విలేకరులపై ప్రభుత్వం కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నది. ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అదికూడా ఏకంగా రాజద్రోహం కేసు.
ప్రశ్నిస్తే జైలుకు వెళ్లకతప్పదని ప్రత్యక్షంగానే మీడియాకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తమ ఆచరణ ద్వారా ప్రభుత్వం చూపిస్తున్నది. ఈ ఘటనపైనా విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ ఘటన మాత్రమే కాదు, గతంలో తమను ప్రశ్నించిన వారిని పలు రకాలుగా వేధించింది ప్రభుత్వం. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు రుణమాఫీపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో పాటు, తిరిగి ఇదే మహిళా జర్నలిస్టులపై కేసులు నమోదు చేసిన ఉదంతాలు సైతం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడని ఒక విలేకరి అక్రిడిటేషన్ కార్డును ఆ జిల్లా కలెక్టర్ రద్దు చేశాడంటే వీరు జర్నలిస్టులపై ఏ రకమైనటువంటి పంథాను అవలంబిస్తున్నారో ఇట్టే అవగతమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఒక జర్నలిస్టుపై అధికార పార్టీ నాయకులు భౌతిక దాడికి దిగిన ఘటనలు కండ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలా ఎన్నో, ఎన్నెన్నో దాడులతో జర్నలిస్టులకు భద్రత కరువై ఆందోళన చెందుతున్న వైనం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది.
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, కేసుల ఘటనలపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీని కలిసింది మా బృందం. విలేకరులపై తప్పుడు కేసులు పెట్టొద్దని డీజీపీని కోరింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం ఆటంకం కలిపిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని కూడా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. వారి రాజకీయ ప్రయోజనాలు వారికుంటాయి. కానీ, అధికార యంత్రాంగం ముమ్మాటికీ ప్రజలకు జవాబుదారిగా ఉండాలి.
మీడియా కూడా తమ సామాజిక బాధ్యతనే నిర్వహిస్తున్నది. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గమనంలో ఉంచుకోవాలని అల్లం నారాయణతో సహా మా బృందం ప్రభుత్వాధికారులకు విజ్జప్తి చేసింది. గత అనుభవాలను తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేయొద్దనే విషయాన్నీ గుర్తుచేశాం. తెలంగాణ జర్నలిస్టులు తీవ్ర నిర్భంధాల మధ్య తమ విధులు నిర్విర్తించారు. అప్పుడు ఒకరకమైన సమస్యలుంటే ఇప్పుడు మరో రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయినా తమ విధులు నిర్విరిస్తున్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వమే నిర్బంధానికి పూనుకోవడం అప్రజాస్వామికమే. ఈ వాస్తవ పరిస్థితులను సంబంధిత శాఖ మంత్రి దృష్టికి కూడా యూనియన్ పక్షాన తీసుకెళ్లాం.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీడియాపై నిర్బంధమే ఉన్నది. చంద్రబాబు హయాంలో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారింది. మీడియా గురించి,జర్నలిస్టుల అర్హతల గురించి పదేపదే మాట్లాడుతున్న సీఎం తాము మాట్లాడుతున్న మాటల గురించి, వాటి ప్రభావం సమాజంపై ఎట్లా ఉంటుందనే విషయాల గురించి బొత్తిగా ఆలోచిస్తున్నట్లు లేదనిపిస్తున్నది.
బాధ్యతాయుతంగా ఉండాల్సినవారే, ప్రశ్నించడం తమ హక్కుగా భావించాలని ఎన్నికల ముందు హామీలిచ్చిన వారు ఇప్పుడు వాటిని తుంగలో తొక్కడాన్ని ఏమనాలో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ప్రభుత్వానికి ముందు చూపు లేదనే విషయం చాలా సందర్భాల్లో వ్యక్తం అయింది. అది మూసీ విషయంలో అయినా, హైడ్రా విషయం అయినా, ఫార్మాసిటీ విషయం అయినా, చివరికి యూరియా విషయంలోనూ స్పష్టమైన ప్రణాళిక లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రణాళికల సాధ్యాసాధ్యాలపై పట్టు లేదనీ ఇన్ని లోపాలున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పెలా అవుతుందో పెద్దలే చెప్పాలి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా అయితే ఆపలేరో కళ్లెదురుగా కనిపించే వాస్తవాలను మీడియా కంటితో చూపించే జర్నలిస్టులపై పోలీసు కేసులు పెట్టడం ద్వారా, దాడులు చేయడం ద్వారా పాలకులు ఆపలేరు అనే విషయాన్ని గుర్తెరగాలని కోరుతున్నాం.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, టీయూడబ్ల్యూజే)
-అస్కాని మారుతీసాగర్
90107 56666