తెలంగాణ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు అభివృద్ధి పండుగలుగా కనిపించాయా? లేదా అసంతృప్తులు, నిరసనలు, ఉద్యోగుల ధర్నాలు, రైతుల ఆవేదనలు, విద్యార్థుల ఫీజు బకాయిలు, నిరుద్యోగుల ఎదురుచూపులతో నిండిపోయాయా? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వెయ్యి రోజుల విజయోత్సవాలు నిర్వహిస్తూ, గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాత్రం వెయ్యి కారణాలు వెతుక్కుంటున్నది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు వెయ్యి ప్రశ్నలు ఎదురవుతున్నా, సమాధానాలు మాత్రం ఏ కోశానా కనిపించడం లేదు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచడం వల్ల కొత్త ఉద్యోగాల అవకాశాలు తగ్గలేదా? ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలను భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు కొంత ఉపశమనం కలిగేది కదా?
పార్టీలోని అసలైన కార్యకర్తలు, సీనియర్ నేతలను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేశారనే విమర్శలు మొదటి నుంచే ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపరుచాలన్న రాజకీయ వ్యూహం కనిపించింది. అధికార పార్టీలోనే అసంతృప్తులు పెరుగుతున్నాయనే చర్చ ఎప్పుడో మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన భరోసాలను లెక్కపెడితే 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అని చెప్పుకొన్నారు. ఇప్పుడు వెయ్యి రోజుల తర్వాత వాటిలో ఎన్ని పూర్తయ్యాయి? సగంలో ఎన్ని ఉన్నాయి? ఫైళ్లలో ఎన్ని నిద్రపోతున్నాయి? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చెప్పాలి. హామీలకు హామీ ఇవ్వడం సులభం; కానీ వాటిని అమలు చేయడం కష్టం. ఆ కష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు అధిగమించిందన్నదే అసలు పరీక్ష.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదేపదే ఆడిపోసుకునే కాంగ్రెస్ సర్కార్, తాను నిర్మించిన కొత్త మౌలిక వసతుల జాబితాను కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ వెయ్యి రోజుల్లో ప్రారంభించి, పూర్తిచేసిన ప్రధాన వంతెనలు, భవనాలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులెన్ని? గత ప్రభుత్వ హయాం లో ప్రారంభమైన పనులకు కొత్త రంగులు వేసి, కొత్త పేర్లు పెట్టి వాటినే తమ విజయాలుగా చెప్పుకుంటున్నారా? మూసీపై, మూసారాంబాగ్ వద్ద నిర్మించిన వంతెన పనులు గత ప్రభుత్వ కాలంలోనే ప్రారంభమైన విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. పాత పనికి కొత్త ఫీతా కత్తిరించడం అభివృద్ధి అయితే, ప్రతి ప్రభుత్వానికీ అభివృద్ధి కొరత ఉండదు!
హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం ఒక విషయం; పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపై బుల్డోజర్లు నడువడం మరో విషయం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటం అవసరమే.
కానీ న్యాయం అందరికీ సమానంగా వర్తిస్తున్నదా? పెద్దల నిర్మాణాలపై కూడా అదే స్థాయిలో చర్యలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తితే ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలి. పేదవాడి ఇంటిపై బుల్డోజర్ వేగంగా పరుగెత్తి, పెద్దవాడి నిర్మాణం ముందు బ్రేక్ వేస్తే అది పరిపాలనా సంస్కరణ కాదు-ప్రశ్నార్థకం.మూసీ సుందరీకరణ పేరుతో భారీ వ్యయం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన మీదా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ పేరుతో పథకానికి పేరు పెట్టగానే ఎవరూ ప్రశ్నించరని భావించడం ప్రజాస్వామ్యం కాదు. గాంధీ పేరు పెట్టడం వల్ల ఖర్చుకు జవాబుదారీతనం మినహాయింపు రాదు. గాంధీ సాధారణ ప్రజల కోసం పోరాడారు. వారి ఇండ్లు కూల్చి, వారి జీవితాలను అస్తవ్యస్తం చేసి, గాంధీ విగ్రహాలు పెడితే ఆయన ఆలోచనలకు గౌరవం ఇచ్చినట్టవుతుందా? నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలోనూ ఇదే ప్రశ్న.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఎంపికైన వారికి నేటి పాలకులు నియామక పత్రాలు అందించారు. కానీ ఆ ఉద్యోగ నియామకాలను మొత్తం తమ ప్రభుత్వ సృష్టిగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ స్వయంగా ఎన్ని భారీ నియామక పరీక్షలు నిర్వహించింది? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఎన్ని పరీక్షలు పూర్తయ్యాయి? నిరుద్యోగ యువతకు ఈ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగులకు ప్రతీనెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని డప్పు కొట్టుకుంటున్న ప్రభుత్వం ..అదే సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఏమిటో కూడా చెప్పాలి. రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగం పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలను భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు కొంత ఉపశమనం కలిగే ఆలోచన చేయడానికి కూడా సర్కార్ ముందుకు రావడం లేదు.
ఒకపక్క విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆసుపత్రుల్లో వైద్యులుమందుల కొరత, పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు, గురుకులాల్లో ఆహార నాణ్యత వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క వేల కోట్ల రూపాయలతో కొత్త భవనాల నిర్మాణం ప్రకటించడం ఎంతవరకు ప్రాధాన్యతా క్రమానికి సరిపోతుంది? ముందుగా పాఠశాలల్లో పిల్లలకు ఉపాధ్యాయుడు, గురుకులంలో భోజనం, ఆసుపత్రిలో రోగికి వైద్యులను అందించాలి. తర్వాత భవనాలకు రంగులు వేయొచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూ మరోవైపు కొత్త అప్పులు చేయడం, ప్రభుత్వ భూముల విక్రయంపై ఆధారపడటం, భారీ ప్రాజెక్టులకు లక్షల కోట్ల అంచనాలు వేయడం-ఇవన్నీ ప్రజలకు సరైన ఆర్థిక సమాధానం కోరుతున్నాయి. కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడానికే కాంగ్రెస్ వెయ్యి రోజుల సభల్లో నేతలకు సమయం దొరుకుతున్నది.
కానీ తమ ప్రభుత్వంలోని లోపాలను సరిచేయడానికి అదే స్థాయిలో సమయం దొరుకుతున్నదా? బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో..ఎన్నివర్గాల వారికి మేలు చేకూరిందో ప్రజలు కండ్లారా చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తున్నదో కూడా నిశితంగా చూస్తున్నారు. ప్రజలు చరిత్రను మరచిపోలేదు; వర్తమానాన్ని కూడా గమనిస్తున్నారు.
అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన ఒక సామెత ఉన్నది ‘అందని ద్రాక్ష పుల్లన’ అని చెప్పుకొంటూపోతే ప్రజలు నమ్మరు. వెయ్యి రోజుల పాలనలో వెయ్యి విజయాలు ఉన్నాయని చెప్పుకోవడం కంటే, వెయ్యి ప్రశ్నలకు వెయ్యి సమాధానాలు ఇవ్వడం ముఖ్యం. ప్రభుత్వంలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేది రాజకీయ పరిణామాలు నిర్ణయిస్తాయి. కానీ ప్రజల తీర్పును మాత్రం ఎవరూ ముందుగానే రాసుకోలేరు. గత ప్రభుత్వాన్ని నిందించడం రాజకీయంగా సులభం. వర్తమానాన్ని మార్చడం పరిపాలనా సామర్థ్యం. భవిష్యత్తును నిర్మించడం నాయకత్వం. వెయ్యి రోజుల తర్వాత ప్రజలు అడుగుతున్నది ఒక్కటే-గతాన్ని ఎన్నిసార్లు తిడుతారు? ఇక మీ పాలనకు మీరే ఎప్పుడు లెక్క చెప్తారు?
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
సిహెచ్.వి. ప్రభాకర్‌రావు
9391533339