ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లాలని పరితపించిన ‘షేక్ సాధిక్ అలీ’ పుస్తకాలను తోపుడు బండిపై కూడా అమ్మవచ్చునని నిరూపించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా తోపుడు బండిపై పుస్తకాలమ్మిన సాధిక్ 2024, నవంబర్ 7 తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారనే వార్త సాహితీవేత్తలను కలచివేసింది.
ఖమ్మంలోని శీలం సిద్ధారెడ్డి డిగ్రీ కాలేజీలో చదవటం వల్లనేమో సాధిక్ అలీ అభ్యుదయ భావాలకు దగ్గరయ్యారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో చురుకుగా పనిచేశారు. ఆ భావాలతోనే మతాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాధిక్ ఉదయం పత్రికలో సుమారు ఎనిమిదేండ్ల పాటు జర్నలిస్ట్‌గా పనిచేశారు. అంతేకాదు, యూనియన్ కార్యకలపాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రసేన్ వంటి వాళ్లతో కలిసి సాధిక్ పాత్రికేయ వృత్తిలో రాణించారు. వృత్తిలో భాగంగా కవిత్వం, వ్యాసాలు, కథల వంటి అనేక సాహితీ ప్రక్రియలను చూశారు. అందుకేనేమో సాధిక్‌కు సాహిత్యం అంటే విపరీతమైన ప్రేమ.
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి హైదరాబాద్ బుక్ఫెయిర్లో సాధిక్ నాకు పరిచయమయ్యారు. ఆయన పుస్తక ప్రియులను, సాహితీ వేత్తలను అనేక మందిని ఏకంజేసే కేంద్ర బిందువుగా ఉండేవారు. రచయిత షాడో మధుబాబు లాంటివాళ్లను ఎంతోమంది రచయితలను సాధిక్ కొత్త తరాలకు పరిచయం చేశారు. యువత పుస్తకానికి పట్టంగట్టాలనే తలంపుతో 2016లో, హైదరాబాద్ నగరంలో కూరగాయలు అమ్మినట్టుగా తోపుడు బండిపై కవిత్వం, సాహిత్య పుస్తకాలను అమ్ముతూ ప్రచారం చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణాల మీదుగా తను ఒక్కడే తోపుడు బండిని తోసుకుంటూ పుస్తకాలను అమ్మేవారు. ఈ విధంగా పుస్తకాలను ప్రచారం చేస్తూనే, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించేవారు. విద్యార్థులకు పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగించేవారు. సాధిక్‌ను చూసి సాహిత్య ప్రియులే కాదు, సాహిత్యకారులు కూడా ఆశ్చర్యపోయే విధంగా కృషిచేశారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముమ్మరంగా గ్రామ గ్రామానికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని మేం చేపట్టాం. అందులో భాగంగానే మా పుస్తక ప్రదర్శనలకు తోడై, మాకంటే ఒకడుగు ముందుకేసి సాధిక్ తోపుడు బండిపై పుస్తకాలను తీసుకొచ్చేవారు. పుస్తక కార్యకర్తగా మారి పుస్తక పఠనాన్ని పెంచేందుకు ఊరూరా కలియదిరిగారు. జ్ఞానాన్ని తాళాలు వేసి బీరువాల్లో ఉంచకూడదని, మారుమూల పల్లెటూర్లకు తీసుకుపోయారు. సమాజం మొత్తాన్ని జ్ఞానవంతం చేయడమే అసలు జ్ఞానం అని పుస్తకాలు పట్టుకొని తిరిగిన సంచార జీవి సాధిక్. హైదరాబాద్ బుక్ఫెయిర్లో కవులకు, రచయితలకు, తోపుడు బండి ఒక ప్రత్యేక ఆకర్షణీయ అడ్డాగా మారింది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులుగా ఉన్న తొలినాళ్లలో జిల్లాలలో కూడా పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలనే ఆలోచన వచ్చినప్పుడు మాకు మొదటగా గుర్తుకువచ్చింది షేక్ సాధిక్ అలీనే. అంతేకాదు, మేము వరంగల్‌లో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేసినప్పుడు అన్నీ తానై వ్యవహరించారు. ఖమ్మం పుస్తక ప్రదర్శనలో కూడా తోపుడు బండి స్టాల్ పెట్టి చదువరులను సాహిత్యం వైపు మళ్లించారు. తెలంగాణలో ఎక్కడ బుక్‌ఫెయిర్ నిర్వహించినా ఆ కార్యక్రమాన్ని సాధిక్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేవారు. కరోనా కాలంలో తన సొంత గ్రామమైన కల్లూరులో విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సాధిక్‌కు ఉన్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద ప్రజల బిడ్డలకు, గిరిజన విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు, బూట్లు వంటివి పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చూపేవారు. పిల్లల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు గాను ఉచితంగా పుస్తకాల పంపిణీ చేసేవారు.
తన జీవితంలో ఎత్తుపల్లాలను చవిచూసిన సాధిక్ కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో మూడుసార్లు కాషాయ వస్ర్తాలను ధరించి హిమాలయాలను సందర్శించారు. చిన్నా, పెద్ద తేడా లేదు, కులం, మతమనే తారతమ్యం లేకుండా అందరినీ దగ్గరికి తీసుకునేవారు. అందుకే సాధిక్ అలీ అంటే అందరికీ ఇష్టం. ఆయనను అమితంగా ప్రేమించే సాహితీవేత్తలు, సాహితీప్రియులు వందల మంది ఉన్నారు. తెలంగాణ నేలపైన తోపుడు బండి సాధిక్‌గా తనదైన ముద్రవేసి, అక్షరాలను ప్రేమించి, విద్యార్థులకు ప్రేమను పంచి మన నుంచి దూరంగా వెళ్లారు. సాధిక్ నీకు పుస్తకాలతో సెల్యూట్.
(వ్యాసకర్త: పూర్వ కార్యదర్శి, హైదరాబాద్ బుక్ ఫెయిర్)
కోయ చంద్రమోహన్
86399 72160