మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు ‘రైతులారా! రాజకీయ వర్షం పడుతుంది.. మోసపోయి మీ విత్తనాలు చల్లకండి’ అంటూ చేసిన హెచ్చరికను గుర్తుచేసుకొని అప్రమత్తం కావలసిన సమయమిది.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఇప్పటివరకు వ్యవసాయానికి ఎంత వీలైతే అంత ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నది కానీ, అనుకున్న రీతిలో, జనాభాకు తగ్గట్టు ఆహారాన్ని అందించడంలో పాలకులకు దూరదృష్టి కరువైంది. అందుకే ఆకలి సూచిలో ఏటా వెనక్కిపోతున్నాం. సరైన సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు అందించడంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణమే నేటి దేశ రైతుల పరిస్థితికి కారణం.
అయితే, ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చి దేశానికే బువ్వ పెట్టే స్థాయికి మన తెలంగాణ రైతన్న ఎదిగాడు. ఇందుకుగాను కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రైతుబంధు అగ్ర భాగాన నిలిచింది. గతంలో ఐదెకరాలున్న సన్నకారు రైతు ఇరవై గుంటల్లో వరి పండించాలంటే నానా యాతన పడాల్సి వచ్చేది. నాణ్యమైన కరెంటు రాక, గంట గంటకు ఫీజులు ఎగిరిపోయి, మోటర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అరిగోస పడేది. నా చిన్నతనంల మా శెల్కలల్ల నలుగురు రైతులు మీటింగ్ పెడితే ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టించాలి, ఓవర్ లోడైంది.
మనం నలుగురం గూడి ఎట్లనన్న ఒక బుడ్డి పెట్టించుకుందాం, సెపరేటు లైన్ ఏపించుకుందాం, ఎట్లా పైరవీ చేద్దాం, తింటాందుకు ఇంట్ల గింజల్లేవు అని నెత్తికి చెయ్యి పెట్టుకొని ఆలోచనలు చేస్తుండిరి. మోటర్లు రిపేర్ చేస్తూ కరెంటు షాక్ కొట్టి చనిపోయిన రైతుల ఆర్తనాదాలు, అప్పుల బాధలు తాళలేక పురుగుల మందులు తాగి సచ్చినోళ్లు కొందరైతే, ఎద్దు ఎవుసాయం వదిలి పట్నంలో అడ్డా కూలీలుగా మారినోళ్లు ఎందరో. ఇప్పుడు అసొంటి ముచ్చట్లు ఏ రైతు పెట్టంగా నేనైతే చూస్తలేను. తెలంగాణ నిండా పుష్కలంగా నీళ్లు, పారే నదులు, పొంగే వాగులు, 24 గంటలు నాణ్యమైన కరెంటు వొస్తున్నది. పెట్టుబడికి రంది లేదు, ఎరువులకు యాతన లేదు. ఇప్పుడున్నదల్లా తెలంగాణలో కూలీల కొరతనే! పక్క రాష్ర్టాల్లోంచి వడ్లు కావాలని ఆర్డర్ పెట్టుకోవడం చూస్తే చాలా సంబురమనిపిస్తున్నది. మొన్న RSలో పెట్టినటువంటి రేషన్కార్డున్న ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి ఇక సన్న బియ్యం ఇస్తామంటున్నది బీఆర్ఎస్. ఎందుకంటే ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు దండుకునే హామీ అసలే కాదు కాబట్టి.
ఇగ తెలంగాణ అంత పచ్చగైనంక రైతులను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవసాయంపై కారుకూతలు కూస్తున్నారు. ఒకాయనేమో 24 గంటల కరెంటు అక్కరే లేదు, ఏదో 3, 4 గంటలు ఇచ్చి మమః అనిపిస్తే వాళ్ల సావు ఏదో వాళ్లు సస్తరు అనబట్టే. కాంగ్రెస్ పెద్దలు ‘రైతుబంధు’ ఆపాలంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారంటే అది వారిని ఎంతగా భయపెడుతున్నదో అర్థమవుతున్నది. కానీ కోడ్ అమల్లో ఉంటే కొత్త పథకాలు ప్రకటించరాదు, పాత వాటిని ఆపాలని లేదు. అయినప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరి రాజకీయం వాళ్లు చేసుకుంటే ఇబ్బంది లేదిక్కడ. కానీ, వీళ్ల స్వార్థానికి రైతులను బలి చేయజూస్తున్నారు. దీన్ని పార్టీలకతీతంగా ఖండించాల్సిందే.
రైతులను కాంగ్రెస్ వాళ్లు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప కనీసం మనుషులుగా చూడటం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికే వెన్నెముక అన్న సంగతి మరిచి వారి అధికార దాహం కోసం నోటికాడి బుక్కను లాగేసే ప్రయత్నానికి పూనుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులకు మేలుచేసే పథకాలు లేకపోగా, కాంగ్రెస్ పార్టీ పెద్దల పరిస్థితి చూస్తుంటే ‘అమ్మ పెట్టదు, అడుక్క తిననివ్వదు’ అన్న చందంగా ఉంది. ఇటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ను ఖతం చేసే బాధ్యత ప్రతి ఒక్క రైతు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది.
-ముఖేష్ సామల
97039 73946