400 మంది రష్యా సైనికులను హతమార్చామంటూ కొత్త సంవత్సరం రోజున ఉక్రెయిన్ ప్రకటించింది. అంతమంది కాదు.. 89 మందినే కోల్పోయామని రష్యా పేర్కొంది. మృతుల సంఖ్య ఎంత అన్నది పక్కనపెడితే.. ఇరు దేశాల మధ్య సయోధ్యను కొత్త ఏడాది కూ డా తీసుకురాలేకపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 316 రోజులు గడిచాయి. రష్యా భీతావహదాడులతో ఉక్రెయిన్‌లో అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలు మట్టిదిబ్బలుగా మారాయి. కొన్ని వేల మంది ఆ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ, రష్యాకు తలవంచకుండా పోరు కొనసాగిస్తూనే ఉన్నది. కొన్ని వారాల్లోనే ఉక్రెయిన్ను పాదాక్రాంతం చేసుకుంటాననుకున్న పుతిన్‌కు గర్వభంగమైంది. అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధ సహకారంతో ఉక్రెయిన్ యుద్ధభూమిలో నిలబడింది. ఆయాదేశాలకు తమవైన వ్యూహాలు, ప్రయోజనాలు ఉండటం కాదనలేని వాస్తవం.
రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన అంతర్జాతీయ సమాజం మరోమారు అటువంటి మానవ హననం జరుగకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నది. ఏ సమస్యనైనా చర్చలు, న్యాయప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలన్న సూత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయత లభించింది. అయినప్పటికీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో తరచూ సంభవించే సంక్షోభాలు, దేశాల మధ్య చారిత్రకంగా నెలకొన్న వైరుధ్యాలు యుద్ధాలకు దారి తీశాయి. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ఉన్నప్పటికీ.. బలమైన ప్రభావం చూపించి, ప్రపంచాన్ని శాంతియుత పంథాలో నడిపించే సామర్థ్యాన్ని అవి సంతరించుకోలేదు. అమెరికాకు దీటుగా కమ్యూనిస్టు శిబిరం ఉన్నప్పుడు ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగినా కూడా అంతర్జాతీయంగా ఒక మేరకైనా శాంతియుత పరిస్థితులు నెలకొని ఉండేవి. కానీ, ఆ శిబిరం కుప్పకూలిన తర్వాత ఏక ధ్రువ ప్రపంచంలో ఆ మాత్రం శాంతి కూడా కరువైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.
రష్యా ఎంత బలహీనపడినా.. మార్కెట్ పోటీలో, ముఖ్యంగా ఆయు ధ మార్కెట్లో, అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో నేటికీ బలమైన శక్తిగానే ఉన్నది. దాన్ని సహించలేని అమెరికా, పశ్చిమదేశాలు ఆ దేశాన్ని మరింత బలహీనపరుచాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. మాజీ సోవియట్ రాజ్యాలైన ఉక్రెయిన్ వంటివాటికి నాటో పేరుతో సహాయ సహకారాలందిస్తున్నాయి. మాజీ సోవియట్ దేశాలపై రష్యా ప్రభావాన్ని తగ్గించటం, రష్యా చుట్టూ తమ అనుకూల దేశాలను ఏర్పా టుచేసుకోవటం వాటి లక్ష్యం. ఈ సవాల్‌ను దౌత్యపరంగా, రాజకీయం గా ఎదుర్కొని, సోవియట్ మాజీ రాజ్యాలను కలుపుకొనిపోతే పుతిన్ గొప్ప నేతగా మన్నన పొందేవారు. కానీ ఆయన ఆయుధాన్నే ఎంచుకున్నారు. ఒకరకంగా అమెరికా శిబిరం పన్నిన వలలో పడ్డారు. ఇప్పుడు దాన్నుంచి బయటకు రాలేక గింజుకుంటున్నారు. కరోనాతో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత దెబ్బతీసింది. ఇప్పటికైనా, ఇరు దేశాలూ యుద్ధ విరమణకు అంగీకరించి చర్చలకు దిగడం ప్రపంచానికి ఎంతో మంచిది.