ఆర్టీసీలో సమ్మె
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. హామీల అమలు, సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, బకాయిల చెల్లింపు సహా మొత్తం 32 అంశాలపై కార్మిక సంఘాల జేఏసీ ఏడాది కాలంగా ప్రభుత్వ పెద్దలకు, ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చింది.. విజ్ఞాపనలు చేసింది. సమ్మెకు వేళయిన తరుణంలో మంగళవారం ఆగమేఘాలపై అధికారుల కమిటీ పేరుతో ప్రభుత్వం ఓ కంటి తుడుపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏడాదిగా పట్టింపులేనితనం ప్రదర్శించి, ఇప్పుడు నాలుగు వారాల గడువు కోరటం విడ్డూరం.
ఇలాంటి కాలయాపన కమిటీతో ఒరిగేదేమీ లేదని భావించిన కార్మికులు, సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పి, మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు చక్రాలు ఆగిపోయాయి. 6,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రతి రోజూ 60 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీలో సమ్మెతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేక ప్రయాణాలు ప్రయాసగా మారాయి. విద్యార్థులు, రోజువారీ, కూలీలు, ఉద్యోగులు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రజా రవాణాను ఆశ్రయించే ఇతర ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డిపోల వద్ద కార్మికుల ధర్నాలు, పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
అధికారంలోకి రావటానికి నోటికి ఎంతొస్తే అంత అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ నేతలను వారి హామీలే వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కోసం ప్రణాళికను ఆచరణలో పెట్టింది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గంలో ఆమోదించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో ఈ ప్రక్రియ ఆగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పీఆర్సీ పరిధిలోకి తీసుకొస్తామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీల మీద హామీలు గుప్పించింది. ఆర్టీసీకి మద్దతుగా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని నమ్మబలికింది. దీంతో ఆర్టీసీ కార్మికులు బోల్తాపడ్డారు. రెండున్నరేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ గురించి పట్టించుకోవట్లేదు. ఆరు గ్యారెంటీల్లోని ఒక గ్యారెంటీ అయిన మహాలక్ష్మి పథకంలో ఒక భాగమైన ‘మహిళలకు ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం’ తీసుకొచ్చింది. కానీ ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇవ్వటంలేదు. ఇప్పుడు కార్మిక సంఘాల జేఏసీ అడుగుతున్న డిమాండ్లలో ఫ్రీ బస్ పథకం నిధుల విడుదల అంశం కీలకమైనది కావడం గమనార్హం. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ లాభాల్లోకి దూసుకెళ్లిందని చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దలు.. కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించటంలేదో మరి!
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ప్రభుత్వ, రవాణా శాఖ.. సమ్మెకు విపక్షమే కారణమని వితండవాదన చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులను ఒప్పించలేక, మెప్పించలేక చతికిలపడి, విపక్షంపై బురదజల్లటనికి తెగబడుతున్నా యి. నిత్యం అరకోటి మందికి పైగా ప్రయాణించే ప్రజారవాణా వ్యవస్థలో సమస్యల పరిష్కారం చూపాలి. ప్రభుత్వం ఇంకా దాటవేత ధోరణి అనుసరించి సమస్యను జటిలం చేయకుండా, పేద ప్రజల రవాణాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి. ఆర్టీసీ కార్మికులే కాకుండా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సమ్మెకు సత్వరమే పరిష్కారం కనుగొనాలి. ఈ దిశగా సర్కార్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

