ఎన్నికలలో ఎదురుదెబ్బల దరిమిలా ముందు అనుకున్న విధంగానే ప్రధాని మోదీపై ఆరెస్సెస్ విమర్శలు మొదలయ్యాయి. ఆ సంస్థ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, ఫలితాలు వెలువడిన ఆరు రోజుల తర్వాత 10వ తేదీన నాగ్‌పూర్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో సంస్థ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మోదీని ఉద్దేశించి ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు అనేకం చేశారు. మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ 23 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఆయనపై ఆరెస్సెస్‌కు విమర్శలు లేకపోలేదు. కాని అవి అంతర్గతంగా సాగాయి. అందుకు భిన్నంగా బహిరంగ విమర్శలు చేయటం ఇది మొదటిసారి కావటం గమనించదగ్గది. అంతేకాదు, అట్లా విమర్శించిన ప్రసంగాన్ని వీడియో రికార్డు చేసి బయట ప్రచారం కానివ్వటం మరొక విశేషం. అదే సమయంలో, మోదీని భాగవత్ విమర్శిస్తూ ప్రస్తావించిన అంశాలలో కనీసం కొన్నింటికి స్వయంగా ఆరెస్సెస్ బాధ్యత కూడా ఉందన్నది గుర్తించాలి.
భాగవత్ ఏమని వ్యాఖ్యానించారనే దానితో పాటు, ఆరెస్సెస్ అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌లో వెలువడిన వ్యాసంలో ఏముందనే విషయం ముందుగా చెప్పుకొని, ఆ తర్వాత చర్చలోకి వెళదాము. భాగవత్ మాటలు ఈ విధంగా ఉన్నాయి: 1.పనులు అందరూ చేస్తారు. కాని అందులో పద్ధతి, మర్యాద ఉండాలి. ఎన్నికలలో పోటీపడేవారు ఒకరినొకరు మించిపోవాలని చూడటం సహజం. కాని అందులోనూ మర్యాదలుండాలి. స్పర్థలుంటాయి గాని అది శత్రుత్వం కాదు. పార్లమెంటులో అంతా కలిసి పనిచేయవలసి ఉంటుంది. కాని ప్రచారంలో శత్రుత్వం వచ్చింది. చివరికి సంఘ్ పరివార్ పేరు కూడా అందులోకి లాగారు. 2.ప్రచారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దురుపయోగం చేశారు.
అసత్యాల ప్రచారం కోసం ఉపయోగించారు. ఇట్లాగైతే దేశం ఎట్లా నడుస్తుంది? 3.ఎన్డీయే ప్రభుత్వం మూడవసారి ఏర్పడింది. మనం అనేక విధాలుగా ముందుకుపోతున్నాం. అయినా సమస్యలున్నాయి. అభివృద్ధి పట్ల దృష్టి సరిగా ఉండాలి. దృష్టి మారాలి. 4.మణిపూర్ ఏడాదిగా శాంతికోసం చూస్తున్నది. ఆ సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఆ సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. 5.మనది వైవిధ్య సమాజం. అయినా అది భిన్నత్వంలో ఏకత్వం. ఆ స్థితిని ఆమోదించాలి. లోగడ ఎప్పుడో, ఎవరో బయటినుంచి రావటం, ఇక్కడ మన ప్రజల మతాంతరీకరణ జరగటం వంటివన్నీ గడిచిపోయిన దశ. ఈ స్థితిని మనం ఆమోదించాలి. ఇతరుల మార్గాలను గౌరవించాలి. అదే ధర్మం. కూర్మ పురాణంలోనూ ఇదే చెప్పారు. కాని మనం దాన్ని విస్మరించాము. అన్ని మతాలు సమానం. ఈ దేశ సంతానమంతా మన సోదరులే. వారితో కలసిమెలసి ఉండాలి. విభేదాలను పూర్తిగా వదిలివేయాలి. They should go out lock stock and barrel. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. 6.మాటల చాతుర్యంతో ఎన్నికలు గెలవటం కాదు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టాలి.
37 నిమిషాల పాటు సాగిన భాగవత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవి. ఇదిగాక, ఆర్గనైజర్ పత్రిక వ్యాసాన్ని గమనించినప్పుడు, అందులోని వ్యాఖ్యలు మరింత సూటిగా, పదునుగా కన్పిస్తాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. 1.మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికల ఫలితాలు వాస్తవ పరిస్థితులను తెలియజేశాయి. 2. పార్టీ నాయకులు చాలామంది మోదీ ప్రభలో వెలిగిపోతున్నామనే భ్రమలో ఉన్నారు తప్ప వీధులలోని సామాన్యులు చెప్పేది వినటం లేదు. గాలి బుడగను నమ్మి మోదీపై ఆధారపడ్డారు. 3.అంకితభావంతో పనిచేసే సంఘ్ పరివార్ స్వయం సేవకులను, కార్యకర్తలను విస్మరించి సోషల్ మీడియా వారికి ప్రాధాన్యం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పని వల్ల లక్ష్యాలను చేరవచ్చు తప్ప సోషల్ మీడియాలో సెల్ఫీల వల్ల కాదు. 4.మొత్తం 543 నియోజకవర్గాల్లోనూ మోదీయే పోటీ చేస్తున్నట్టు భావించి ఓటు వేయాలనే ప్రచారం సరికాదు. 5.స్థానిక నేతలను తక్కువ చేసి ఫిరాయింపుదారులకు టికెట్లివ్వటం పొరపాటు. 6.మహారాష్ట్రలో అధికారం కోసం అక్కడి పార్టీలను చీల్చటం వంటివి తప్పు నిర్ణయాలు.
బీజేపీ మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్, దాని అధికార పత్రిక అయిన ‘ఆర్గనైజర్’ల నుంచి ఇటువంటి తీవ్రమైన విమర్శలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రావటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా చూస్తుండవచ్చు? అది మనకు ఇతర వర్గాల ద్వారా లీక్ అయి బయటకు రావటం తప్ప నేరుగా తెలిసే అవకాశం లేదు. లోగడ వాజపేయి ప్రధానిగా ఉండినప్పుడు ఆయనకు, ఆరెస్సెస్‌కు మధ్య కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అవి సామరస్యపూర్వకంగా సమసిపోయాయి తప్ప బహిరంగ విమర్శల స్థాయికి వెళ్లలేదు.
2004లో బీజేపీ ఓడినప్పుడు కూడా ఆ సంస్థ అందుకు కారణాలపై అంతర్గత చర్చలైతే చేసింది గాని వాజపేయి పద్ధతులను ఇట్లా విమర్శించలేదు. ఈసారి మోదీ నాయకత్వాన అసాధారణమైన రీతిలో మూడవ సారి అధికారానికి వచ్చినప్పటికీ సంఘ్ పరివార్ పలు కారణాల వల్ల ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉండటం గమనించదగిన విశేషం.
ఇందుకు కారణం ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉండటమేనా అన్నది ప్రశ్న. అట్లా తోచదు. ఎందుకంటే, మోదీకి 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండినప్పటి నుంచి కూడా వ్యక్తిగత ధోరణులు, అహంభావం, పార్టీ సీనియర్లను, జాతీయ పార్టీని చివరికి ఆరెస్సెస్‌ను కూడా కొన్ని సందర్భాలలో లెక్కచేయకపోవటం, తన అధికారమే పరమావధిగా వ్యవహరించటమనే లక్షణాలున్నట్లు విమర్శలున్నాయి. ఆ విధంగా ఏమేమి జరిగిందనే దానిపై పరిశోధనలు కూడా ఉన్నాయి. కాని, గుజరాత్లో వరుసగా మూడుసార్లు ఘన విజయం సాధించటంతో పాటు హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవటం, తర్వాత జాతీయస్థాయిలో రెండు మార్లు అపూర్వ విజయాలు, సంఘ్‌పరివార్ అజెండాలోని పలు అంశాల అమలు వంటి రికార్డుల దృష్ట్యా, పరివార్ నాయకత్వం మోదీ ఈ ధోరణులలో కొన్ని తమకు నచ్చకపోయినా ఇంచుమించు మౌనంగా భరించింది.
పార్టీ సీనియర్ల నుంచి కూడా అదే కన్పించింది. మరొకవైపు ముఖ్యంగా దేవరస్ (1973-94) తర్వాత కాలం నుంచి సర్ సంఘ్చాలక్ల స్థాయి, శక్తి క్రమంగా తగ్గుతున్నాయనే అభిప్రాయం ఉన్నది. అంతే ముఖ్యంగా సంస్థ శ్రేణులు బీజేపీ అధికారంలో ఉండటం వల్ల లభించే లాభాలకు అలవాటు పడటం మొదలైందనే మాట సైతం వినిపించసాగింది. ఈ విధంగా అన్నివైపుల నుంచి గల పరిస్థితులు పరిగణనలోకి రావటం, ఆ పరిస్థితుల ప్రభావం కారణంగానే ఇంతకాలం మోదీ ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోయిందని భావిస్తే బహుశా పొరపాటు ఉండదు. ఈ 23 సుదీర్ఘ సంవత్సరాల మోదీ విజయరథానికి ఇప్పుడు కుదుపులు వస్తున్నట్టు స్పష్టమవుతుండటం వల్లనే పరివార్ నుంచి ఈ విమర్శలు మొదలైనట్లు భావించటం కూడా పొరపాటు కాకపోవచ్చు.
భాగవత్, ఆర్గనైజర్ల వ్యాఖ్యల విషయానికి వస్తే, అవి ప్రత్యేక విశ్లేషణలు లేకుండానే అర్థమవుతున్న మాటలు. కొంతకాలంగా సాగుతున్న చర్చోపచర్చలు, అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల ఫలితాలు, మోదీ తీరు గురించిన అభిప్రాయాల నేపథ్యంలో ఎంతో విజ్ఞులుగా మారిన ప్రజలకు ఇందులో అర్థం చేసుకోలేనిదంటూ ఏమీ లేదు. అర్థం చేసుకోవలసింది మోదీ మాత్రమే.
ఆయన మాతృసంస్థ చేసిన బహిరంగ విమర్శలు ఆయనకు నర్మగర్భమైన హెచ్చరిక కావటంతో పాటు, తన భవిష్య వ్యవహరణకు, పరిపాలన తీరుతెన్నులకు స్పష్టమైన సూచనలు కూడా. మోదీ గుర్తించవలసిన మొట్టమొదటి విషయమది. అందుకు అనుగుణమైన సవరణలను ఆయన చేసుకోవలసి ఉంటుంది. పరివార్ నాయకత్వం నుంచి ఇటువంటి బహిరంగ విమర్శలు వెలువడినందున, తన పట్ల పరివార్ సంస్థల వైఖరిపై, బీజేపీ శ్రేణుల వైఖరిపై దాని ప్రభావం ఉండగలదని కూడా ఆయన తెలుసుకోవాలి.
ఇక ఆరెస్సెస్ విషయానికి వస్తే, జరిగిన, జరుగుతున్న దాని పట్ల విమర్శలకు ఆ సంస్థ అతీతమేమీ కాదని పైన అనుకున్నాము. తిలా పాపం తలా పిడికెడు అనే సామెత వంటి స్థితి ఇది. తాము ఇపుడు ఆక్షేపిస్తున్న మోదీ ధోరణులను, సామాన్యులకు సరిపడని పరిపాలనా తీరుతెన్నులను మార్పించగల శక్తి సంఘ్ పరివార్‌కు ఇన్ని సంవత్సరాల పాటు నిజంగానే లేకపోయిందని నమ్మగలమా? వందేండ్ల నుంచి గల అంతటి మహా సంస్థ, అంతటి దీర్ఘకాలికమైన మహత్తర లక్ష్యాలు గల సంస్థ, రాజకీయాధికారం కన్న చరిత్రకు, సంస్కృతీ సంప్రదాయాలకు, నైతికతకు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థ, మోదీ వంటి ఒక ఆభాసను నియంత్రించకపోవటం, లేదా నియంత్రించ లేకపోవటం ఎందువల్ల జరిగినట్లు? ఇవి ఆ సంస్థ తనకు తాను సమాధానాలు చెప్పుకోవలసిన ప్రశ్నలు. తమ కార్యకర్తలకు, అనుయాయులకు ఇచ్చుకోవలసిన సంజాయిషీలు. భాగవత్ అన్నన్ని మౌలిక విషయాలను ప్రస్తావించటం వరకు బాగానే ఉన్నది గాని, మోదీ ఆధ్వర్యాన పెచ్చరిల్లిన పలు వైపరీత్యాలకు అవకాశమిచ్చిన సూత్రీకరణలు స్వయంగా తమ సిద్ధాంతాలలోనే లేవనగలరా? అటువంటి స్థితిలో అందుకు సవరణలెప్పుడు?
చివరగా, మణిపూర్ ప్రస్తావన వచ్చింది గనుక రెండు మాటలు చెప్పుకోవాలి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అక్కడ సుమారు వంద ఇళ్ల దహనం జరిగింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వాహనశ్రేణిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల దరిమిలా కావచ్చు అక్కడ ఏడాదిగా శాంతి లేదంటున్న భాగవత్, ఆ విషయంపై మోదీని ఏడాదికాలంగా ఏమైనా ఒత్తిడి చేశారా? కనీసం ఒక్కసారైనా అక్కడకు వెళ్లనందుకు విమర్శించారా? కనీసం తమ సంస్థ పక్షాన అయినా శాంతి ప్రయత్నాలు చేశారా? గుర్తుకు రావటం లేదు. ఇంతకన్న ముఖ్యమైన ప్రశ్న ఒక్కటున్నది. ఈశాన్య భారతంలో క్రైస్తవ ప్రాబల్యం ఎక్కువ కావటం పట్ల ఆందోళన చెందే ఆరెస్సెస్, కొన్ని దశాబ్దాలుగా అక్కడ దృష్టిని కేంద్రీకరించి తమ సిద్ధాంతాలను వ్యాపింపజేస్తున్నది. ఆ పని ప్రజాస్వామికంగా, శాంతియుతంగా జరపటం వరకు ఆక్షేపించవలసింది లేదు. కాని ఆ క్రమంలో అనుసరిస్తున్న పద్ధతుల వల్ల పరస్పర ఘర్షణల పరిస్థితులు తలెత్తుతున్నాయి. నిజానికి మణిపూర్ అశాంతికి, హింస కు మూలాలు ఈ నేపథ్య పరిస్థితులలో ఉన్నాయి. ఇందుకు సవరణలు కూడా అవసరం కాదా? అంతిమంగా తేలుతున్నదేమంటే, మోదీ-పరివార్-ఆర్గనైజర్ల మధ్య ప్రస్తావనకు వస్తున్న విమర్శనాంశాలకు ఏదో ఒక మేర వారి ఉమ్మడి బాధ్యత ఉంది. పరిష్కార బాధ్యత కూడా ఉమ్మడిదే.
టంకశాల అశోక్