ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అని చెప్పుకుతిరిగేవాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసినప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఈ పద్యం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్న విపక్ష పార్టీల నాయకులు, సో కాల్డ్ మేధావులు, రాష్ట్రంపై విషం చిమ్ముతున్న కొన్ని మీడియా సంస్థల తీరు కూడా ఇదే. ఇదే తెలంగాణలో బీడువడిన భూముల వల్ల రైతన్నలు ఉరి కొయ్యలకు వేలాడినప్పుడు, తాగేందుకూ గుక్కెడు నీళ్లు లేక అల్లాడినప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారు? పరాయి పాలనలో తెలంగాణ సంపద దోపిడీకి గురవుతోందని తెలిసి కూడా.. ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు ఒక్కరు కూడా అడుగు ముందుకు వేయలేదు. ఇప్పుడు తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే మీడియా సంస్థలు.. ఇదే ప్రశ్న పైసా పనిచేయని ఆనాటి పాలకులను ఎందుకు అడగలేదు? ఎందుకంటే వీరికి ఈ ప్రాంతం బాగుపడాలనే చిత్తశుద్ధి లేదు. అందుకే ఆనాడు ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నామనే సాకుతో అభివృద్ధికి అడ్డు పడుతున్నారు.
తెలంగాణకు చాలా దిగువన కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకోగలిగితే రైతుల, ప్రజల కష్టాలు తీరిపోతాయనేది కాసింత మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ 60 ఏండ్లు దేశాన్ని పాలించిన వాళ్లకు మాత్రం ఈ విషయం అర్థం కాలేదు. కానీ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే, అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలన్నీ తీర్చేశారు కేసీఆర్. ఇలా ఒక్కో సమస్య నుంచి తెలంగాణను బంధ విముక్తం చేస్తూ ముందుకు కదులుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా కొందరు కుహానా మేధావులు కట్టు కథలు, పిట్ట కథలతో యూట్యూబ్‌లో వీక్షకులని పెంచుకునే చిల్లర ప్రయత్నాలకు తెరలేపారు. ఆర్టీసీ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. ఆర్థిక భారం నుంచి బయటపడాలంటే ప్రైవేటీకరణ చేయొచ్చు. కానీ అలా చేస్తే 40 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఒక్కటే కాదు. అది ఏ ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణను అయినా కేసీఆర్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీహెచ్ఈఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్. బీహెచ్ఈఎల్కు పనులు ఇవ్వొద్దని చాలామంది చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్ల తయారీని అప్పగించారు.
ఇక మేధావుల తీరుని పరిశీలిస్తే.. మేధావినని చెప్పుకు తిరిగే మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వ ఉద్యోగులు సోమరులు అన్నట్టుగా మాట్లాడారు. అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తేనే బాగుంటుందని దిక్కుమాలిన సలహా ఇచ్చారు. నిజంగానే ఆయన మేధావి అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌గా పని చేసినపప్పుడు తెలంగాణ ప్రాంత సమస్యలపై ఎందుకు ఆలోచించలేదు? ఎందుకంటే ఆయనకూ తన ప్రాంతమంటేనే మక్కువ. కానీ ఈ గడ్డపై పుట్టి పెరిగిన అధికారులు, ఇక్కడే రాజకీయాలు చేస్తున్నవాళ్లు కూడా కండ్ల ముందు కళకళలాడుతున్న తెలంగాణను చూడలేక కబోదుల్లా వ్యవహరిస్తున్నారు.
నిప్పును గొంగట్లో దాచినట్టు.. అభివృద్ధిని తమ విమర్శల్లో, ఆరోపణల్లో దాచాలని చూస్తున్నారు. ఒకరు వచ్చి ప్రగతిభవన్‌ను బాంబులు పెట్టి పేల్చాలంటారు. కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేలుతారు. ఓటమి ఎరుగని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఓ ప్రజా నాయకుడిని పట్టుకుని కనీసం గౌరవం లేకుండా కొందరు సన్నాసులు, మీడియా పేరుతో రాజకీయం చేస్తున్న మరికొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే కొందరికి ఎందుకు మింగుడుపడటం లేదు?
గత పాలకులు హైదరాబాద్‌లోని రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ముంపు సమస్య వస్తున్నది. కానీ గత 9 ఏండ్ల లోనే వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపించగలిగింది. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించింది. ఔటర్ రింగ్ రోడ్డు ఇవతల, అవతల కూడా ఇప్పుడు సిటీలో కలిసిపోయినట్టుగానే ఉంది. అందుకే ఓ వందేండ్ల ముందుచూపుతో ఆలోచించి సీఎం కేసీఆర్ ఔటర్ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలే అయితే.. నేడు ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, ఉద్యోగాలు, పెట్టుబడులు ఎలా పెరిగాయి? కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకే ఎక్కువ అవార్డులు ఎందుకు ఇస్తున్నాయి? అభివృద్ధి అనేది సమగ్రంగా, సమ్మిళితంగా, సమతుల్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతుల పొలాల్లో పచ్చని పంటలై అలరారుతున్నాయి. ఇది సంపద సృష్టి కాదా? రూ.76 వేల కోట్లకుపైగా రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? దళిత బంధుతో వెలివాడల బిడ్డలు వ్యాపార వేత్తలైతున్నరు. ముదిరాజ్‌లకు చేపలు పంపిణీ చేసినా, యాదవులకు గొర్రెలు ఇచ్చినా ఇవన్నీ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలే. కేసీఆర్ మొదటి నుంచీ ప్రజాల పక్షాన ఉండే వ్యక్తి. ఇప్పుడు, ఎప్పుడూ ఆయన మనస్తత్వం అదే. అందుకే సంపదను సృష్టించి ప్రజలకు పంచాలి. ఇలా గ్రామాలు, పట్టణాల్లో కొన్ని తరాల జీవితాలు మారిపోతాయనేది ఆయన ఆలోచన. కానీ కొందరు కొత్త ఇంట్లో ఉడుము సొచ్చినట్టు.. తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు. అందుకే తెలంగాణను బాగు చేసే దాకా వెనుకడుగు వేసేది లేదని కంకణం కట్టుకున్న కేసీఆర్ మీద వీళ్లు కక్ష గట్టారు.
దాహమేసినప్పుడే బావి తవ్వాలనుకోవడం మూర్ఖత్వం, అవివేకం. అందుకే కేసీఆర్ భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాలకు రూపకల్పన చేశారు. మాటలు ఎవరైనా చెప్తారు. కానీ చేయగలిందే చెప్పి.. దాన్ని చేసి చూపించగల దమ్మున్న నాయకుడు కేసీఆర్. ప్రజలకు కూడా అలాంటి నాయకుడే కావాలి. రాజకీయం, మతాల మంటలు అంటని మానవత్వం నిండిన ఆ నాయకుడు తమకూ కావాలని ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తున్నది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)