మానవుని జీవన విధానం వ్యవసాయంతో ముడిపడి ఉన్నది. మానవుడి నాగరిక జీవితానికి వ్యవసాయమే మూలాధారం. సింధు లోయ నాగరికత నుంచే మన దేశంలో వ్యవసాయం ప్రధాన జీవన ఆధారంగా ఉండేది. ఆ కాలంలో అన్నదాతలు సిరిసంపదలతో వర్ధిల్లేవారు. ఆధునిక భారతదేశంలో వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి వల్ల పెనుమార్పులు సంభవించాయి. వ్యవసాయ రంగం దేశ ప్రగతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్నది. అందువల్లే వ్యవసాయ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారు.
దేశాన్ని కాపాడుకోవడంలో రైతు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అది స్వతంత్ర పోరాటమైనా, కరువుకాటకాలైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్ని తానై ముందుండి దేశ ప్రజలను రక్షించడంలో రైతుల పాత్ర వెలకట్టలేనిది. నిత్యం శ్రమిస్తూ దేశ ప్రజలకు అన్నం పెట్టడంలో రైతుకు సాటి ఎవ్వరూ లేరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇంచుమించు 50.82 మిలియన్ టన్నులు ఉండగా.. రైతుల నిరంతర శ్రమ వల్ల 2023-24 నాటికి 332.32 మిలియన్ టన్నులకు చేరుకున్నది.
మన దేశంలో సుమారుగా 80.54 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలను పొందుతున్నారంటే వారి కృషి ఫలితమే. సంవత్సర తలసరి నికర ఆహార ధాన్యాల లభ్యత 1950లో 144.1 కిలోగ్రాములు కాగా.. 2023 నాటికి అది 207.6 కిలోగ్రాములకు చేరింది. అంటే దినసరి తలసరి నికర ఆహార ధాన్యాల లభ్యత 568.8 గ్రాములు. ఈ విధంగా కర్షకులు దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, వారు మాత్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పంట విత్తిన సమయం నుంచి కోతకోసి అమ్మే వరకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒక హెక్టార్ విస్తీర్ణంలో వరి సాగుకు కౌలు, కుటుంబ శ్రమ కలుపుకొని సుమారు రూ.లక్ష పెట్టుబడి అవుతున్నది. అందులో అధికంగా కూలీలకు (22.1%), ఎరువులకు (20.8%), విత్తనాలకు (11.5%), మందులకు (8.3%) ఖర్చవుతుంది. దేశ వ్యవసాయ కూలీ సగటు రోజువారీ వేతనం రూ.361.52 (2022-23 గణాంకాలు). నమ్మలేని నిజం ఏమిటంటే మన దేశంలో వ్యవసాయ కూలీ ఆదాయం కంటే రైతు ఆదాయం తక్కువ.
వ్యవసాయ ఖర్చులు పెరగడం అన్నదాతలకు ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు ఒక హెక్టార్ విస్తీర్ణంలో వరి సాగుకు కౌలు, కుటుంబ శ్రమ కలుపుకొని సుమారు రూ.లక్ష ఖర్చు అవుతున్నది. అందులో అధికంగా కూలీలకు (22.1%), ఎరువులకు (20.8%), విత్తనాలకు (11.5%), మందులకు (8.3%) ఖర్చవుతుంది. వ్యవసాయ కూలీ సగటు రోజువారీ వేతనం రూ.361.52 (2022-23 గణాంకాలు). నమ్మలేని నిజం ఏమిటంటే మన దేశంలో వ్యవసాయ కూలీ ఆదాయం కంటే రైతు ఆదాయం తక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 2019లో వ్యవసాయ కుటుంబ సగటు నెలసరి ఆదాయం రూ.10,218 మాత్రమే.
మన దేశంలోని 50.2 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో చిక్కుకున్నాయి. అందులోనూ 82.9 శాతం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలే కావడం గమనార్హం. దేశంలో రైతుల సగటు అప్పు రూ.7,412. అదేవిధంగా రెండు తెలుగు రాష్ర్టాల వ్యవసాయ కుటుంబాలు దేశంలోనే అత్యధిక శాతం అప్పుల బారినపడ్డాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
రైతుల అప్పుల్లో 69.9 శాతం సంస్థాగత రుణాలు కాగా.. మిగతా 30 శాతం రుణాలు వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, భూస్వాములు, చిట్ ఫండ్ కంపెనీలు ఇచ్చినవే. పెట్టుబడికి డబ్బులు లేక, సంస్థాగత రుణాలు సమయానికి అందకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. అప్పుల భారం తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2022లో సుమారు 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
దేశ రైతాంగాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్న తరుణంలో వాటిని అధిగమించి అన్నదాతల ఆదాయం పెంచాలంటే వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు, సాకేతికత వినియోగం తక్షణావసరం. సాగు ఖర్చులు, పంట కోనుగోలు, గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థ లాంటి అనేక అంశాల మీద సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి. ప్రత్యేకించి, స్థానిక సమస్యలకు అనుగుణంగా వ్యవసాయ సంస్కరణలు ఉండాలి.
ముఖ్యంగా పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలి. ఒకవేళ పంటను ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కొన్నప్పుడు తప్పనిసరిగా ఆ ధరలు, కనీస మద్దతు ధర కంటే అధికంగా ఉండేటట్టు చట్టాలను తీసుకురావాలి. విత్తనాల కొనుగోలుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రైతులకు సమయానికి, సరిపడా విత్తనాలు లభించడం లేదు. 2023లో 464.14 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అవసరం ఉండగా, ప్రభుత్వ సంస్థల నుంచి 133.84 లక్షల క్వింటాళ్లు, ప్రైవేట్ వ్యాపారుల నుంచి 380.41 లక్షల క్వింటాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. రైతులకు సరిపడా విత్తనాలను అందించేందుకు ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మరిన్ని విత్తన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా, నేల సారవంతం చేసేందుకు, చీడపీడల నివారణకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ రకమైన ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా సమగ్ర సస్యరక్షణ, పోషక నిర్వహణ కిట్లను అందజేయడం ద్వారా ఖర్చులను కొంతమేరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా, వ్యవసాయ కూలీల ఖర్చును తగ్గించడానికి యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలి. తక్కువ ధరలకు యంత్రాలను అందుబాటులోకి తేవాలి.
సంప్రదాయ వ్యవసాయంలోని మెలకువలు, నైపుణ్యాలను కొనసాగిస్తూనే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పంటల సాగుకు ఉపయోగించడం వల్ల వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించవచ్చు. ఆధునిక డిజటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి సేద్యంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
వ్యవసాయ డిజిటలీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌తో రానున్న దశాబ్దాల్లో దేశ వ్యవసాయ రంగం నూతన రూపం సంతరించుకోబోతున్నది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లోని అగ్రిస్టాక్ దేశ వ్యవసాయానికి సంబంధించిన బృహత్తర సమాచార నిధిగా మారబోతున్నది. అగ్రిస్టాక్ ద్వారా సేకరించిన సమాచారం డిజిటల్ వ్యసాయానికి పునాది కాబోతున్నది.
కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ లాంటి అనేక సాంకేతిక విధానాలను సాగుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి, అవరోధాలను పసిగట్టి నివారించడానికి ఉపయోగించవచ్చు. స్మార్ట్ ఫార్మింగ్‌లో భాగంగా వివిధ అప్లికేషన్లను ఉపయోగించి ఉచితంగా విత్తన రకాలను ఎంచుకోవడం, నేలల రకాలకు అనుగుణంగా ఎరువుల వాడకం, తెగుళ్లను, పురుగులను గుర్తించడం, సరైన మందులను పిచికారీ చేయడం, వాతావరణంలోని మార్పులను తెలుసుకోవడం, దిగుబడులను అంచనా వేసి మార్కెట్లోని ధరల హెచ్చుతగ్గులను తెలుసుకోవచ్చు. అందుకు రైతులకు డిజిటల్ పరిజ్ఞానం చాలా అవసరం. కాబట్టి, దేశంలోని అన్నదాతలకు అందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి కనీస అవగాహన కల్పించాలి.
ఆధునిక భారతదేశం సాంకేతికత పరంగా అభివృద్ధి సాధించినప్పటికీ, రైతాంగం స్థితిగతులను మార్చే విషయంలో అది ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను కొంతవరకు ఉపయోగిస్తున్నప్ప టికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. రైతులు లాభపడాలంటే సాగుకు సాంకేతికత తోడవ్వాలి. అంతేకాదు, కర్షకుల చిరకాల స్వప్నమైన పండించిన పంటకు ధరలు తామే నిర్ణయించుకునే స్థితి వస్తేనే వ్యవసాయం సస్యశామలమై అన్నదాతల ఆదాయం పెరుగుతుంది. దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.
– (వ్యాసకర్త: సీనియర్ రిసెర్చ్ ఫెలో, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్)
డాక్టర్ రేపల్లె నాగన్న 79908 42149