వినియోగదారులకు తాము పొందే సేవల పట్ల కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని తెలుసుకొని చైతన్యవంతం కావడం పౌరుల విధి. ప్రభుత్వం అందించే విద్యుత్తు సేవలకు అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారంతా విద్యుత్తు సంస్థల విధులు, వాటి బాధ్యతలు, అవి ఇచ్చే పరిహారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్రంలోని ప్రతి వినియోగదారుడు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ‘విద్యుత్ పంపిణీదారుల పనితీరు ప్రమాణాలు’ అనే రెగ్యులేషన్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యం.
రెగ్యులేషన్లు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా, వాటి ప్రయోజనం వినియోగదారులకు వాస్తవంగా చేరాలనే ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని వినియోగదారులతో ప్రత్యక్ష, పరస్పర సంభాషణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కమిషన్ జారీ చేసిన రెగ్యులేషన్‌ను తెలుగు భాషలో ముద్రించి, విద్యుత్ వినియోగదారులకు విస్తృతంగా పంపిణీ చేస్తోంది. దీన్ని వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా కమిషన్ నిర్వర్తించిన సానుకూల రెగ్యులేటరీ బాధ్యతగా విశ్లేషించవచ్చు.
అమలు పర్యవేక్షణ రెగ్యులేటరీ మానిటరింగ్ వ్యవస్థ: విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నాయా? పరిహారం చెల్లింపును రెగ్యులేషన్ ప్రకారం అమలు చేస్తున్నాయా? అనే అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కమిషన్ తన కార్యాలయంలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా పంపిణీ సంస్థల పనితీరుపై రెగ్యులేటరీ పర్యవేక్షణ, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలకు దారి తీసే సమాచారం సేకరణ, వినియోగదారుల ప్రయోజనాల రక్షణ అమల్లోకి వస్తున్నాయా అనే అంశాలను ఈ వ్యవస్థ పరిశీలిస్తుంది.
న్యాయపరమైన ప్రాముఖ్యత: పంపిణీ సంస్థలు పనితీరు ప్రమాణాలను ఉల్లంఘించడంపై చర్యలు తీసుకోవడంతో పాటు పరిపాలనా వైఫల్యం కాకుండా చర్యలు తీసుకుంటుంది. దీన్ని విద్యుత్ చట్టం2003, కమిషన్ రెగ్యులేషన్ల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అందువల్ల జరిమానాలు విధించడం, పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు బాధ్యులపై శిక్షాపరమైన చర్యలు చట్టబద్ధంగా విధించవచ్చు.
విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పనితీరు, ప్రమాణాలు సక్రమంగా నిర్దేశించిన కాలపరిమితిలో పరిష్కరించలేనపుడు వినియోగదారులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు భరించాలి. లేదా బాధ్యులైన అధికారుల వేతనాల నుండి వసూలు చేసుకోవాలి తప్ప దానిని విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేసుకోవడానికి విద్యుత్ నియంత్రణ మండలి ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించదు. విద్యుత్ ప్రమాదాలు జరిగి పౌరులు మరణించినా లేదా పశువులు మరణించినా విద్యుత్ పంపిణీ సంస్థలు సంబంధిత బాధిత కుటుంబ సభ్యులకు విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలి. ఈ ఎక్స్ గ్రేషియా బాధిత కుటుంబాలు సివిల్ కేసు వేసుకుని ఇంకా అదనంగా నష్ట పరిహారం పొందడానికి అడ్డు కాదు.
ముగింపు: విద్యుత్ వినియోగదారుల సేవా ప్రమాణాల విషయంలో కమిషన్ వ్యవహరించిన విధానం మూడు సూత్రాలపై పనిచేస్తుంది. అవి నియంత్రణాత్మక, రక్షణాత్మక, బాధ్యతాయుత పని విధానాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. ఈ విధానాలు పాటించడం వల్ల విద్యుత్ నియంత్రణ మండలి పనితీరు సుపరిపాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా వినియోగదారులు కేవలం సేవలు పొందేవారు మాత్రమే కాకుండా, చట్టపరంగా రక్షణ పొందే హక్కుదారులుగా మారారు. చట్టం పట్ల పూర్తి అవగాహన కల్పించుకుని వినియోగదారులు తమ హక్కులను చట్టబద్ధంగా పొందేందుకు వీలవుతుంది. ఈ విషయంలో ఎవరినీ దేబిరించాల్సిన అవసరం లేదు.
(వ్యాసకర్త: మాజీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)
తన్నీరు శ్రీరంగారావు