కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని దేశంలోని పాలకులు గప్పాలు కొడుతుంటారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి వారి మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడున్నర దశాబ్దాలు దాటినా నేటికీ గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే అందుకు నిదర్శనం.
గ్రామ పంచాయతీల పటిష్ఠతే తమ ధ్యేయమని పాలకులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తుంటారు. స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులు, విధులు అప్పగిస్తామని ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఒక వ్యూహం ప్రకారం గ్రామ సర్పంచ్ల ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారు. అధికారం లేని ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్లను మార్చేందుకు తమ వంతు కృషిచేస్తూనే ఉన్నారు. అందుకే ఒకనాడు సర్పంచ్లకు ఉన్న ప్రాధాన్యం నేడు కానరావడం లేదు.
నిబంధనల మేరకు ఐదేండ్లకోసారి జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఏదో ఒక కారణం చెప్తూ పాలకులు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇంచార్జీలతో స్థానిక సంస్థలను నడిపేందుకే మొగ్గు చూపిస్తున్నారు. మరోపక్క గ్రామస్థాయిలో ఎన్నో కమిటీలు పెట్టి సర్పంచులను పక్కనపెడుతున్నారు. వారి ప్రమేయం లేకుండా, వారికి తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు గ్రామాల్లో జరిగే పరిస్థితులను తీసుకువచ్చారు. విద్యాకమిటీలు, ఆస్పత్రి కమిటీలు, నీటి సంఘాలు, వనరక్షణ సమితులు.. ఒక్కటేమిటి గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులకు సమాంతరంగా అనేక పదవులను సృష్టించారు.
నేతల వాగ్దానాలతో ఏదో సాధించాలని, సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపనతో ఎందరో యువకులు వ్యయప్రయాసలకోర్చి సర్పంచులయ్యారు. ఈ చట్టాల వలన, అధికారుల మాయాజాలంలో తాము ఏమీ చేయలేమనే విషయం అర్థంకావడానికి వారికి చాలా కాలం పట్టింది. అయినా తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చుకునేందుకు తల తాకట్టుపెట్టి అప్పోసొప్పో చేసి అభివృద్ధి పనులు చేశారు. కానీ, వాటి బిల్లులు ఎంతకూ రావడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి వారు అలసిపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి సమాజంలో తతెత్తుకొని తిరగలేక ఇప్పటికే డజన్ మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మిగిలిన వారూ పడుతున్న వేదన అంతాఇంతా కాదు.
గతేడాది జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆగమేఘాల మీద వారివద్ద నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నది. కానీ, బిల్లులు మాత్రం చెల్లించలేదు. వస్తాయో రావో తెలియదు. ఎప్పుడొస్తాయో చెప్పేవారు లేరు. మరొకపక్క ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు అందడం లేదు. దీంతో గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
ఒకనాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచులంటే ఎంతో గౌరవమర్యాదలు ఉండేవి. భారతదేశంలో స్థానిక సంస్థలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. చంద్రగుప్తుడి కంటే ముందు నుంచే గ్రామవ్యవస్థ అమలులో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రామసభల నిర్ణయాలకు నాటి రాజరికపు వ్యవస్థ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేది. 1882లో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. గాంధీ మహాత్ముడు ప్రవచించిన గ్రామ స్వరాజ్యం లక్ష్యంలో స్థానిక సంస్థల పటిష్ఠత ప్రధానమైనది. భారత రాజ్యాంగంలో కూడా స్థానిక సంస్థలకు అవసరమైన అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. 1952 నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో కమిటీలు, మరెన్నో అధ్యయనాలు, మార్పులు, చేర్పులు చేశారు. కానీ, సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఇవ్వడానికి మాత్రం పాలకులకు మనసొప్పడం లేదు.
ప్రజాస్వామ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థ పునాది వంటిది. అందులో సర్పంచులు చాలా కీలకం. రాష్ర్టానికి మరిన్ని అధికారాలు కావాలని కేంద్రం ముందు కేకలు పెడుతున్న నాయకులు స్థానిక సంస్థలకు మాత్రం అధికారాలు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి అంటూ పదేపదే నీతులు వల్లె వేసే పాలకులు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులతో కాలయాపన చేయడం ఏ మాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించి సర్పంచ్ కుర్చీలకు పట్టిన బూజు దులపాలి.
-(వ్యాసకర్త: న్యాయశాస్త్ర విద్యార్థి, ఢిల్లీ విశ్వవిద్యాలయం)
– సభావట్ కళ్యాణ్ 90143 22572