Herbs For Diabetics | మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల శరీరంలో ఇతర అవయవాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక డయాబెటిస్ ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని రకాల మూలికలను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడడంతో పాటు తీపి తినాలన్న కోరిక కూడా తగ్గుతుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మూలికలను తీసుకోవడం వల్ల అడాప్టోజెన్ ఒత్తిడి తగ్గడంతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా అదుపులో ఉంచే మూలికలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో మెంతులు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. మెంతులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీతో పాటు ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు, శరీర జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా మెంతి నీటిని తీసుకోవడం, మెంతులను నానబెట్టి తీసుకోవడం, వంటల్లో మెంతులను వాడడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రోజూ అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సామర్థ్యం పెరుగుతుంది. భోజనం తరువాత వచ్చే గ్లూకోజ్ స్పైక్స్ తగ్గుతాయి. ఓట్ మీల్, స్మూతీ, మసాలా టీ వంటి వాటితో దాల్చినచెక్క పొడిని కలిపి తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే దాల్చిన చెక్క ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తుంది కనుక దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా అవసరం.
అలాగే మధునాశిని అని పిలువబడే మూలికను తీసుకోవడం వల్ల తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. దీనిని పొడపత్రి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకులను నమలడం లేదా టీ లో వేసి తీసుకోవడం వల్ల చక్కెర శోషణ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కాకరకాయ కూడా మనకు సహాయపడుతుంది. పరగడుపున కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. తులసి ఆకులను నేరుగా నమలడం లేదా కషాయం చేసి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్తాయిలు సమతుల్యంగా ఉంటాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. కార్టిసాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలోవెరా జ్యూస్ ను తాగడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్యూస్ మాత్రమే కాకుండా అలోవెరా సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
మనుపసుపు అనే మూలిక కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీనిని దారుహరిద్ర అని కూడా పిలుస్తారు. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. వేపను తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగా తగ్గుతాయి. వేపను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ గ్రాహక శక్తి పెరుగుతుంది. ఈ విధమైన మూలికలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూలికలను తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మూలికలను తీసుకోవడం నెమ్మదిగా ప్రారంభించాలి. మొదటగా ఒక్క మూలికను మాత్రమే తీసుకోవాలి. మన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా, పొడిగా లేదా టీ రూపంలో తీసుకోవాలి. వేప, కాకర వంటి వాటిని పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. డయాబెటిస్ కు ముందు నుండే మందులు వాడే వారు ఈ మూలికలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ ఈ మూలికలను తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను చూడవచ్చు.