సుమారు 50 ఏండ్ల కిందట ‘చావు నడిపే జీవితం’ అనే అద్భుతమైన కథ వచ్చింది. రచయిత పేరు గుర్తు లేదు. ఆ మాటతో పోల్చాలంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘డ్రామాలు నడిపే జీవితం’ వలె ఉన్నది. లేదా, ‘అబద్ధాలు నడిపే జీవితం’ అని కూడా అనవచ్చు. నిజానికి రెండూ అనాలి. అట్లా అయితేనే సరిగా ఉంటుంది. ఎందుకంటే, తన రాజకీయ జీవిత రథాన్ని డ్రామాలు, అబద్ధాలు రెండు చక్రాలై నడుపుతున్నాయి. ఈ మాట అనేందుకు ఉదాహరణలు చాలానే చెప్పవచ్చు గాని, ఒక్కొక్కదానికి ఒక ఉదాహరణ మాత్రం పేర్కొనాలంటే, బీసీ రిజర్వేషన్ల విషయమై ఆయన వరుస చర్యలు ‘డ్రామాలు నడిపే జీవితం’, తమ మేనిఫెస్టో అమలు గురించిన బుకాయింపులు ‘అబద్ధాలు నడిపే జీవితం’ కిందికి వస్తాయి.
డ్రామాల జీవితంలో ఇటీవలి అంకాన్ని రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా రూపంలో ప్రదర్శించారు. ఆయనకు తెలుసునో లేదో గానీ, అక్కడ ఆందోళనకారులు ధర్నాలతో పాటు వీధి నాటకాలు ప్రదర్శించే సంప్రదాయం చిరకాలంగా ఉన్నది. కాకపోతే, ఉద్యమాలు బలహీనపడుతున్నందున ఇటీవల కొంత తగ్గినట్టున్నది. అయినప్పటికీ తనకు ఈ విషయం తెలిసి ఉంటే, బీసీ రిజర్వేషన్లపై ధర్నా చేయటంతో పాటు ఒక వీధి నాటకం కూడా వేయించి ఉండేవారేమో. అందులో, రిజర్వేషన్ల సాధనకు తానొక్కడే అసహాయ పోరాటం సాగిస్తూ, రిజర్వేషన్లను ప్రతిపక్షాల వారందరూ వ్యతిరేకిస్తుండగా, ఏ దశలోనూ వెనుకడుగు వేయరు. ‘బీసీ ద్రోహు’లైన ఇతర పార్టీలు అన్నీ తనను ముందుపోట్లు, వెన్నుపోట్లు పొడుస్తుంటాయి. అయినా వెనుకంజ వేయరు. నాటకం ముగుస్తుండగా, నా నిబద్ధతను, పోరాట పటిమను, తమ కోసం చిందిస్తున్న రక్తాన్ని చూసి, వచ్చే పంచాయితీ ఎన్నికలలో బీసీలు నూటికి నూరు శాతం మాకే ఓటు వేయగలరన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటుతారు. ధర్నా స్థలంలో చేరిన కాంగ్రెస్ వాదులంతా జయజయకారాలతో హర్షధ్వానాలు చేస్తారు. ఢిల్లీ ప్రతిధ్వనిస్తుంది. అది విన్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రికి తాము ఆ వరాన్ని ప్రసాదించక తప్పేట్టు లేదని ఆలోచిస్తుంటుంది. వీధి నాటకాలకు తెర ఉండదు గనుక అప్పుడు తెర అయితే పడదు గాని, నాటకంలోని ఆ అంకం అప్పటికి అట్లా ముగుస్తుంది.
రేవంత్రెడ్డి రిజర్వేషన్ల నాటకంలోని వివిధ అంకాలను తెలంగాణ బీసీలతో పాటు ప్రజలంతా మొదటినుంచి గమనిస్తున్నదే. అంతేకాదు, పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ వారు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారిలో చాలామంది హైదరాబాద్లో పనులు చేసుకుంటున్న వారి ద్వారానూ, ఈ నాటక విశేషాలు అక్కడ కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. అదట్లా ఉంచితే, బీసీ కులగణనపై ఆర్భాటం ఎంతో చేసి, లెక్కింపు మాత్రం సవ్యంగా జరుపకపోవటమన్నది ఈ నాటకంలోని మొదటి అంకం. ఆ లెక్కలు కేంద్రం ద్వారా జరుగకపోతే చట్టబద్ధత ఉండదని తెలిసీ ఆ తంతును సాగించటం రెండవ అంకం.
సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిపై ఏమి చేయాలన్న స్పష్టత లేకపోవటం మూడవ అంకం. ఈ విధమైన తమ వైఫల్యాలను, ఇంకా సరిగా చెప్పాలంటే బీసీలను మోసగించే కపటనీతిని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై, విమర్శకులపై దాడి సాగించటం నాలుగవ అంకం. ఇదే తరహాలో కొన్ని ఇతర రాష్ర్టాలలో జరిగిన లెక్కింపులు ముందుకు సాగకుండా ఆగిపోయిన వాస్తవాన్ని కప్పిపుచ్చజూడటం ఐదవ అంకం. కథనంతా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ వచ్చి, ఇప్పుడు నిందను ప్రతిపక్షాలపై, కేంద్రంపై, పరోక్షంగా రాష్ట్రపతిపై వేయజూడటం ఆరవ అంకం. వీరంతా సహకరించటం లేదు గనుక, 45 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా లభించే అవకాశం ఉండనందున, అవేవో పార్టీ పరంగా ఇవ్వగలమంటున్న సూచనలు ఏడవ అంకం.
అయితే, మొత్తం నాటకానికి నాందీ ప్రస్తావన అంకం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో చూశాం. అక్కడి డిక్లరేషన్లో ప్రకటించిన ప్రకారం 45 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం గల నిబంధనల ప్రకారం వీలు పడదని కాంగ్రెస్ పార్టీ అనుభవజ్ఞులకు, న్యాయశాస్త్ర పండితులకు, తప్పకుండా ముందే తెలిసి ఉండాలి.
అయినప్పటికీ వరుసగా రెండుసార్లు అధికారానికి రాలేకపోయిన తాము ఏది ఏమైనా సరే ఈ సారి గెలిచితీరాలన్న పట్టుదలతో మేనిఫెస్టో రూపంలో నోటికి వచ్చిన అబద్ధపు హామీలు ఎన్నెన్నో ఇచ్చినట్టు, ఈ రిజర్వేషన్ల హామీని కూడా ఇచ్చి కూర్చున్నారు. ఒకవేళ అధికారానికి వచ్చి ఈ హామీల అమలుపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైతే ఏ విధంగా బుకాయించాలన్న దానితోపాటు, రిజర్వేషన్ల విషయమై సాగించవలసిన నాటకమేమిటో కూడా వారు ముందే అనుకొని ఉంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఇటువంటి కపటనీతి దురంధరులు గనుకనే, ఒకప్పుడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణను కోల్పోతూ ఈ దుస్థితికి చేరింది. అయినా, ప్రస్తుత తరాల కాంగ్రెస్ వాదులకు ఎప్పటికప్పుడు కావలసింది అధికారం, ధనం మాత్రమే గనుక, ఆ తక్షణ లక్ష్యాలు తీరినాక పార్టీ ఏమైనా అవసరం లేదు. మొత్తానికి, బీసీ రిజర్వేషన్ల నాటకం చివరి అంకానికి చేరింది. ప్రజలకు స్పష్టం కావలసింది ఇంకా ఏమీ లేదు. తాము అంతా నిజాయితీగా చేసినట్టు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించటం మినహా. అయితే, వరుస నాటకాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, మేనిఫెస్టో హామీల అమలు అబద్ధాలను మరొకవైపు చూస్తున్నప్పుడు, రెండింటిని కలిపి ఒక అభిప్రాయానికి వచ్చే ప్రజలు, ఈ ప్రయత్నాలను ఎంతవరకు నమ్మగలరో ఎవరి అంచనాలు వారు వేసుకోవచ్చు.
పంచాయతీ ఎన్నికలు రానుండగా బీసీ రిజర్వేషన్ల హామీ అంశానికి ఎంత ప్రాముఖ్యం ఏర్పడుతుందో, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన వందలాది హామీల అమలు ప్రశ్నకు కూడా అంతటి ప్రాముఖ్యం కలుగుతుంది. రేవంత్రెడ్డి దురదృష్టవశాత్తు మేనిఫెస్టో అమలును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, కేంద్రం సహకరించటం లేదని రెండవ నాటకం సాగించేందుకు అవకాశం లేదు. కనుక మిగిలిన మార్గం అబద్ధాలాడటమే. ఆ మార్గాన్ని ఆయన ఇప్పటికే 15 నెలలుగా అనుసరిస్తున్నారు కూడా. ప్రజలు నమ్మినా, నమ్మకున్నా ఈ అబద్ధాలు తన రథానికి రెండవ చక్రంగా మారాయి. ఆ చక్రం ఇప్పటికే ఒడిదుడుకులకు లోనవుతున్నది. అయినా అంతకన్న మార్గాంతరం లేదు. ఆ హామీలను అమలు చేయలేరు గనుక. చేయలేమన్నది మేనిఫెస్టో రచన సమయంలోనే తెలిసి, ప్రజలను భ్రమపెట్టడమే లక్ష్యంగా పనిచేశారు గనుక, ఇక మిగిలిన మూడున్నరేండ్లు రథాన్ని ఇట్లాగే ఈడ్వవలసి ఉంటుంది.
సందర్భం వచ్చింది గదానని మేనిఫెస్టోను ఒకసారి గమనిస్తే ఈ విధంగా ఉంది. కవర్ పేజీపైన‘అభయ హస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం’. రెండవ కవర్లో – ‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’. మూడో కవర్లో – మేనిఫెస్టో కమిటీ పేర్లు. నాలుగో కవర్లో –
‘కాంగ్రెస్ హస్తం – పేదల నేస్తం, నిజమైన ప్రజాస్వామ్య పరిపాలన కోసం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం,నిరుద్యోగ రహిత తెలంగాణ కోసం.ప్రజా శ్రేయస్సు కాంగ్రెస్తోనే సాధ్యం’. తక్కిన విషయాల్లోకి వెళ్లేముందు ఇంతవరకు పేర్కొన్నదానిని గమనిస్తే., ఈ ఏడాదిన్నర కాలం ప్రజల అనుభవాలను బట్టి కొట్టవచ్చినట్టు కనిపించేవి కొన్నున్నాయి. అవి, మార్పు కావాలి, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం సామాజిక తెలంగాణ, నిరుద్యోగ రహిత తెలంగాణ. వీటిపై వేరే వ్యాఖ్యానాలు బహుశా అక్కరలేదు గాని, బహుశా ఏ వ్యాఖ్యానాలు అక్కరలేకుండా అందరికీ నవ్వు తెప్పించే అబద్ధం ‘నిరుద్యోగ రహిత’ అనే మాట. దాని అర్థం నిరుద్యోగ రహితం ఇంతలోనే అయిపోవాలని కాదు. కానీ, 9-10 పేజీలలో గల ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను తిరగవేసి చూస్తే ‘మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ’ అనే మాట, ఇంకా అటువంటివే కొన్ని కనిపిస్తాయి. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడుతూ, మరొక ఏడాది గడిచేసరికి మొత్తం ఒక లక్ష ఉద్యోగాలనటం గుర్తుకువస్తుంది. అనగా రెండున్నర ఏండ్లు అన్న మాట. ఉద్యోగాలు మాత్రం 2 లక్షలకు బదులు ఒక లక్ష. అదైనా జరుగుతుందనే గారెంటీ లేదు.
రెండు కవర్ల మధ్య 42 పేజీలలో మొత్తం 37 విభాగాలు, చివరన జాబ్ క్యాలెండర్ ఉన్నాయి. వాటిలోని హామీలలో కాలవ్యవధి పేర్కొనని వాటిని మినహాయించినా, అట్లా పేర్కొన్నవి రైతులు, మహిళలు, వృద్ధులు మొదలైన వర్గాలకు సంబంధించి అనేకం చూడవచ్చు. వాటిని అమలు పరుచకపోవటం సరే. కానీ, ప్రజలకు కనిపిస్తున్న వింత, కొన్నింటిని అమలుచేయకపోయినా చేసివేసినట్టు నిర్భయంగా చెప్తున్న అబద్ధాలు. మరి కొన్నింటి గురించి నెలలు గడిచిపోతున్నా, ఆయా వర్గాల వారు అడుగుతున్నా నోరు విప్పకపోవటం. లేదా పోలీసులను నియోగించి నిర్బంధాలకు గురిచేయటం. మార్పు, నిజమైన ప్రజాస్వామ్యం, తెలంగాణ ఆకాంక్షలు, సామాజిక తెలంగాణ వంటి మాటలకు అర్థమేమిటో తెలియని పరిస్థితి ఏర్పడటం. చివరికి తేలే సారాంశం ఏమిటంటే, రేవంత్ రెడ్డి అధికారానిది డ్రామాలు, అబద్ధాలు నడిపే జీవితంగా తేలుతున్నది.
-టంకశాల అశోక్