నాలుగు దశాబ్దాలు జర్నలిస్టుగా రాజకీయ నేతలను దగ్గరి నుంచి చూశారు కదా? ఇప్పటి నేతలపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా కేసీఆర్ మేరు పర్వతం అయితే, రేవంత్‌రెడ్డి ఒక గులకరాయి అని బదులిచ్చాను. నాకు రేవంత్‌రెడ్డితో ఉన్న పరిచయంతో, అతని రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు, మనస్తత్వం బాగా తెలిసే ఆ మాట చెప్పాను. తెలుగు సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేదికపై కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ కొందరు హిస్టరీ సృష్టించిన వాళ్లు ఉంటారు, కానీ మీరు (కేసీఆర్) తెలంగాణ ఏర్పాటు ద్వారా జాగ్రఫీ సృష్టించారు అని చెప్పారు.
రేవంత్‌రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం మొట్టికాయలు వేయడంతో ఇప్పుడే కాదు డిసెంబర్లో మారుస్తామని ప్రకటించారు. రెండేండ్లు అవుతున్నా ఇంకా ఆయ చెప్పిన డిసెంబర్ రాలేదు. హైకమాండ్ కనుసన్నల్లో నడుచుకునే రేవంత్‌రెడ్డిని, దేశ పటంలో తెలంగాణ రాష్ర్టాన్ని చేర్చిన కేసీఆర్‌తో పోల్చలేం. కేసీఆర్ తెలంగాణ సాధించడమే కాదు.. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేటట్టు పాలించి చూపారు. ఆకలి చావులకు, రైతుల ఆత్మహత్యలకు చిహ్నంగా కనిపించే తెలంగాణను, దేశంలోనే అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్ది చూపించారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినట్టు, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పెట్టుబడి పెట్టి సీఎం కాగలిగారు. కానీ రెండేండ్లలో తెలంగాణలో ఇదీ మేం సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి, అసలే సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసిన కేసీఆర్‌తో మరో నాయకుడిని పోల్చలేం. రేవంత్‌రెడ్డిని అసలే పోల్చలేం. సముద్రానికి, పిల్ల కాలువకు పోలిక కుదరదు. మేరు పర్వతాన్ని గులకరాయితో పోల్చలేం.
బలమైన ఆంధ్రా రాజకీయ పక్షాలు, మీడియా, పెట్టుబడిదారులు, సినిమా రంగ పెద్దలు.. ఇలా ఇంతమందిని తట్టుకొని తెలంగాణ సాధించవచ్చు అని ఉద్యమ ప్రారంభంలో చాలామంది అనుకోలేదు. తెలంగాణ కావాలి అని తెలంగాణ ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారో, ఈ శక్తులను తట్టుకొని తెలంగాణ సాధించడం సాధ్యం కాదు అని అంతే బలంగా అనుకున్నారు. బాగ్‌లింగంపల్లిలో ఓ సారి 1969 నాటి ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఆ సభకు గద్దర్ హాజరయ్యారు. సమావేశం తర్వాత గద్దర్‌ను మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణ వస్తుందా? అని అడిగితే మీడియా, పరిశ్రమలు, సినిమా అన్నీ ఆంధ్రా వారివే.. వాళ్లు చాలా శక్తిమంతులు. తెలంగాణ రానిస్తారా.. రాదు అన్నారు. అంటే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది – మరో ప్రపంచం సాధ్యమవుతుంది అని నమ్మి, తమ జీవితాల్ని దశాబ్దాలపాటు అడవులకు అంకితం చేసిన వాళ్లు కూడా తెలంగాణ సాకారం కాదని అనుకున్నారు. అలాంటి తెలంగాణను కేసీఆర్ సాకారం చేసి చూపించారు. ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రం తీరని కలగానే మిగిలేది.
రాజకీయ వ్యూహం ద్వారానే తెలంగాణ సాధించవచ్చు అని కేసీఆర్ నమ్మడమే కాకుండా సాధించి చూపించారు. ఆంధ్రా కాంగ్రెస్ నేతలే కాదు, చివరకు కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించినా ప్రజల ఆకాంక్షను విజయతీరాలకు చేర్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు నాకు సంకేతాలు ఉన్నాయి అని కేసీఆర్ ప్రకటించినప్పుడు గాంధీభవన్‌కు రాని సంకేతాలు కేసీఆర్‌కు వచ్చాయా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యోక్తులు విసిరారు.
చివరి దశలో హైకమాండ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ దీక్షకు దిగారు. అంటే, కాంగ్రెస్ నేతల దీక్ష వల్లనే తెలంగాణ ఇచ్చాం అని చెప్పుకోవడానికి జరిగిన యత్నమది. హైకమాండ్ ఆదేశాలతో దీక్ష చేశారు కానీ, తెలంగాణ వస్తుందని వారికే నమ్మకం లేదు.. దీక్ష విరమించండి, తెలంగాణ వస్తుంది అని వారికి కేసీఆర్ భరోసా ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే. దేశంలోనే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నది వాళ్ల పార్టీకే. కానీ రెండు సీట్లు మాత్రమే ఉన్న కేసీఆర్.. వారికి భరోసా ఇచ్చారు. పాపం కాంగ్రెస్ అని ఆ రోజు దీక్ష స్థలంలో ఉన్న మీడియా ముచ్చట. రెండు సీట్లే ఉండవచ్చు కానీ, దేశంలోని అన్ని పార్టీలకు నచ్చజెప్పి తెలంగాణను సాకారం చేయడంలో కేసీఆర్ నాయకత్వమే ప్రధాన పాత్ర పోషించింది.
తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసిన కేసీఆర్‌కు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఒక సారి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. అంతే తప్ప ప్రజలు రేవంత్‌రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలువలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్లలో ఎలా అభివృద్ధి చేశారో.. కండ్ల ముందు కనిపిస్తున్నది. కేంద్రం ప్రకటించిన గణాంకాల్లోనూ స్పష్టమవుతున్నది. మరి రెండేండ్ల కాలంలో ఇదీ మేం చేశాం అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి ఏమున్నది? ఏమి లేదు కాబట్టే బూతుల ద్వారా ప్రజల దృష్టి మరల్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం కాగానే నన్ను.. జగన్ అభినదించలేదు అని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎవరో తనను అభినందించలేదు అని ప్రకటించిన తొలి సీఎం రేవంత్‌రెడ్డి. శాసనసభ్యులు కూడా అలా అనరు. రాజకీయనేతలు తన పనితీరు ద్వారా గుర్తింపు పొందాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చాలామంది తెలంగాణ అభివృద్ధి తర్వాత కేసీఆర్‌ను అభినందించారు. ప్రధానికి మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు కూడా ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. తెలంగాణ ఏమవుతుదో అని భయపడ్డాను, కానీ అద్భుతంగా అభివృద్ధి సాధించారు అని ఒప్పుకున్నారు.
రేవంత్‌రెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయాలను లాభసాటి వ్యాపారంగానే చూశారు. ఉదాహరణకు.. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు టీడీఎల్పీ కార్యాలయం మెట్ల మీద చంద్రబాబుతో టీడీపీ మీద నేను జోకులు వేస్తూ ఏదో మాట్లాడుతుంటే అప్పుడు మండలి సభ్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చి ఎవరు సార్.. పార్టీ మీద తెగ జోకులు వేస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు చంద్రబాబు నన్ను రేవంత్‌రెడ్డికి పరిచయం చేశారు. ఆ రోజు నుంచి అనేక సార్లు ఎన్టీఆర్ భవన్లో గంటల తరబడి రాజకీయాల గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడితే, తెలంగాణ ఎలా ఉండాలి? తెలంగాణ భవిష్యత్తు? తెలంగాణ యువత భవిష్యత్తు వంటి వాటి మీద అతనికి ఏ మాత్రం ఆసక్తి ఉండేది కాదు. రాజకీయాలను కూడా ఒక వ్యాపారంగా తీసుకున్న వ్యక్తిగానే తప్ప, తెలంగాణ కోసం తపించిన నాయకుడిగా ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పటికే రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బు సంపాదించడం వల్ల పేదవాళ్లంటే చిన్నచూపు ఉండేది.
టీవీ ఇంటర్వ్యూల్లో కూడా ఇదే అభిప్రాయం చాలా సార్లు చెప్పారు. పేద రెడ్లను కూడా మా ఇంట్లోకి రానివ్వం అని ఒప్పుకున్నారు. కానీ బిచ్చగాళ్లను కూడా ఏకం చేసిన కోదండరాంరెడ్డి అని ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. కోదండరాంను జేఏసీ కన్వీనర్‌ను కేసీఆర్ చేసినప్పుడు- బదిలీల కోసం మా ఇంటి ముందు పడిగాపులు కాసే వీళ్లు.. మాకు నాయకులా? వీళ్ల నాయకత్వంలో మేం పని చేయాలా? అని రేవంత్‌రెడ్డి ఈసడించుకున్నారు.
రేవంత్‌రెడ్డికి జర్నలిస్టులు అంటే కూడా చిన్నచూపే. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినవాళ్లను ఉద్దేశించి మీరు డీఎన్ఏ పరీక్ష చేయించుకోండి అని మైకులోనే తిట్టారు. అంతేకాదు మీడియా అకాడమీకి కేసీఆర్ హయాంలో రూ.40 కోట్లు డిపాజిట్ చేశారు. కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మీడియా అకాడమీ ఇప్పుడు నడుస్తున్నది కూడా కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే.
కాంగ్రెస్, సోనియాగాంధీ, తెలంగాణ, మీడియా, కోదండరాం.. ఇలా రేవంత్‌రెడ్డికి ఎవరిపైనా ఎవరి మీద ప్రేమ, గౌరవం అంటూ ఏమీ ఉండవు. రాజకీయాల్లో తన పెట్టుబడికి తగిన లాభం తనకు ముఖ్యం. అదే లక్ష్యంతో వెళ్తున్నారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి, కష్టపడి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి పూర్తి అధికారం ఇవ్వాలి అని రేవంత్‌రెడ్డి తన సన్నిహిత మీడియా పలుకుల్లో పలికించారు. పెట్టుబడికి ఎన్నిరెట్ల లాభాలు కోరుకుంటున్నారో చూడాలి మరి! రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడికి పదింతలు కూడా లాభాలు వస్తాయి. రాజకీయ వ్యాపారంలో ఎన్ని రెట్లు లాభాలు సాధిస్తారో చూడాలి.
-బుద్దా మురళి