పరిపాలనలో ముఖ్యమైన శాఖలలో విద్యాశాఖ ఒకటి. అలాంటి శాఖలో సమీక్షలు నిర్వహించడానికి, పనుల పురోగతి చూసుకునే బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయం. ‘నేనే రాజు-నేనే మంత్రి’ అన్నట్టుగా సీఎం రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అతి ముఖ్యమైన హోం, మున్సిపల్ శాఖలతో పాటు విద్యాశాఖను కూడా తన వద్దే ఉంచుకోవడం హాస్యాస్పదం. దీనివల్ల గత రెండేండ్లలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. దీనికి స్వయంగా ముఖ్యమంత్రే కారణమయ్యారు. గతంలో ముఖ్యమంత్రులుగా విధులు నిర్వర్తించిన వారిలో ఎవరూ విద్యాశాఖను తమ వద్ద ఉంచుకోవడానికి సాహసించలేదు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఒంటెత్తు పోకడలకు పోయి విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారు.
విద్యాశాఖ అంటేనే ఉప శాఖల సమూహం. అంటే ఎస్ఎస్సీ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, ఉన్నత విద్యా మండలితోపాటు పలు ప్రభుత్వ గురుకుల సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలన్నీ దీనికిందికే వస్తాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విస్తృతమైన విద్యాశాఖ పట్ల నిర్లక్ష్య ధోరణితో ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తుండటం దారుణం. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించేవారు కచ్చితంగా ప్రతి వారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం తప్పనిసరి. దీనివల్ల విద్యాశాఖకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. మన ముఖ్యమంత్రి మాత్రం విద్యాశాఖలో పనిచేస్తున్న డైరెక్టర్లు, సెక్రెటరీలు ఎంత విన్నవించుకున్నా సమావేశానికి రాకపోవడమే కాకుండా, కనీసం విద్యాశాఖకు సంబంధించిన దస్ర్తాలపైన సంతకాలూ చేయడం లేదు. ఉదాహరణకు కేంద్రం విడుదల చేసిన 2024-25 విద్యారంగం గణాంకాల ప్రకారం తెలంగాణలో 2,245 పాఠశాలలో ఒక్క అడ్మిషన్ లేకుండా జీరో ఎన్రోల్మెంట్ జరిగిందని, ఇలాంటి దుస్థితి కలిగిన రాష్ర్టాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ తన వద్దనే పెట్టుకున్న సీఎం రేవంత్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 1. గురుకుల విద్యార్థుల మరణాల పట్ల సెక్రటరీ, ఉన్నతాధికారులతో సమీక్షించారా?, 2.విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్లు, డీఈఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు?, 3.విద్యాశాఖ మంత్రిగా ఇప్పటివరకు ఏ పాఠశాలనైనా సందర్శించారా?, 4.విద్యాశాఖ మంత్రిగా ఎస్సెస్సీ ఫలితాలు కానీ, ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ, ఎంసెట్ ఫలితాలను కానీ మీ చేతుల మీదుగా విడుదల చేశారా?, 5.ఇప్పటివరకు అకాడమీ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశాలు నిర్వహించారా?
6.అక్షరాస్యత రేటు పెంచడానికి విద్యాశాఖ మంత్రిగా మీరు తీసుకున్న చర్యలేవి? 7. విద్యాశాఖ మంత్రిగా ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాలతో కానీ, విద్యార్థి సంఘాలతో కానీ సమావేశాలు నిర్వహించారా?, 8. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్ అడ్మిషన్ విషయంలో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం సబబేనా?, 9.ప్రభుత్వ పాఠశాలతో మౌలిక సదుపాయాల కల్పనకు, అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి విద్యా మంత్రిగా ఇప్పటివరకు మీరు తీసుకున్న చర్యలేవీ?, 10. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి సంబంధిత డీఎస్సీ, జేఎల్, డీఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేస్తారు?
భావితరం విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా తన ఒంటెత్తు పోకడలు మాని, భేషజాలకు పోకుండా ఉన్నత విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. అభివృద్ధికి పట్టుకొమ్మగా ఉన్న విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిపెడితే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, జర్నలిజం పరిశోధక విద్యార్థి)
శ్రీను నాయక్ దోన్వాన్ 85220 18001