ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదినుంచి ఆచరించే రాజకీయ ఎత్తుగడనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అనుసరిస్తున్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే కుటిల పన్నాగాలను ఇప్పుడు నమ్ముకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోతను విధిస్తానని చెప్పడం ఆ కోవకు చెందిన రాజకీయమే.
గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ అనుసరిస్తున్న తీరు ద్వారా తన చిరాకు, ప్రస్ట్రేషన్ ప్రజలకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అయితే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడిపోతే తన ముఖ్యమంత్రి పదవి ప్రమాదంలో పడుతుందేమోనన్న భయంలో రేవంత్ కొట్టుమిట్టాడుతున్నారు. అందులో భాగంగానే ఎటూచేసి జూబ్లీహిల్స్‌లో గెలవాలని ఆరాటపడుతూ, అది కుదరదని తెలిసి ఆఖరి అస్త్రంగా బెదిరింపు రాజకీయాలను వాడుకుంటున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ నాయకుడైనా తన చేతల ద్వారా ప్రజలను మనసును గెలుచుకోవాలని తపిస్తారు. ప్రజల హృదయాలను గెలుచుకొని వారి ప్రేమను ఓట్ల రూపంలో పొందుతాడు. అయితే, అది చేతగాని రేవంత్ రెడ్డి సుమారు రెండేండ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రజలు, వారి బాగోగులు పట్టించుకోకుండా తన సోదరుల, కుటుంబీకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక పనులకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే కక్షపూరిత రాజకీయాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ రెండేండ్ల సమయంలో రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను దుర్భాషలాడని రోజంటూ లేకపోవడం బాధాకరం. కేవలం బీఆర్ఎస్ నాయకులపై కక్ష తీర్చుకోవడానికే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారా అన్న ఏవగింపు ప్రజల్లో వచ్చిందంటే ఈ రెండేండ్లు ఆయన వైఖరి ఎలా కొనసాగిందో ప్రజలకు అర్థమవుతున్నది.
ఇదిలా ఉంటే.. జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మారాల్సిన సీఎం వైఖరి ఇంకాస్త రూపాంతరం చెందింది. ఇప్పుడు ఆయన ప్రత్యర్థులపై విమర్శలు చేయడం మానేసి, ఏకం గా ప్రజలపైనే అస్ర్తాలు సంధిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక రోడ్ షోలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటు వేస్తే సన్నబియ్యం, ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, తెల్ల రేషన్ కార్డులను రద్దు చేస్తామని ప్రకటించడం ఆయనకే చెల్లింది.
ఏ ముఖ్యమంత్రి చేయని దుస్సాహసాన్ని రేవంత్ చేశారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? లేక ముఖ్యమంత్రి మారతాడా? రాష్ట్రమంతటా అమల్లో ఉన్న పథకాలు ఒక్క జూబ్లీహిల్స్‌లో ఎలా రద్దవుతాయి? కానీ, అలా ప్రజలను భయపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకో సందర్భంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కులేదన్నట్టుగా వ్యవహరించారు. ఒక సెక్యులర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అంటే కాంగ్రెస్‌కు ముస్లింలు తప్ప మిగతా ప్రజల అవసరం లేదనుకుంటున్నారా? లేక వాళ్లకు ప్రాధాన్యమే ఇవ్వమని చెప్పదలచుకున్నారా? 140 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీకి సంబంధించి, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం జాతీయస్థాయిలో సంచలనం రేపింది. రేవంత్ అన్న ఈ దుందుడుకు మాటలపై జాతీయ మీడియా సుదీర్ఘ చర్చలు పెట్టింది. జాతీయస్థాయిలో ప్రత్యర్థి పార్టీని కమ్యూనల్ పార్టీ అని నినదిస్తూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి తమ పార్టీని కూడా కమ్యూనల్ పార్టీగా మారుస్తున్నారా? అంటే ఔననే అనిపిస్తున్నది. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ముస్లింలకు ఉనికే ఉండదన్న అర్థం వచ్చేట్టుగా బెదిరింపు మాటలు మాట్లాడిన సీఎం రేవంత్ ఉన్నట్టుండి అజారుద్దీన్‌కు మంత్రిపదవిని కట్టబెట్టడం విడ్డూరం.
కులాల వారీగా, మతాల వారీగా చీలికలు చేసి పబ్బం గడుపుకోవడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణేతర స్థానికత ఉన్న ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ప్రచారం చేస్తూ.. ‘అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతా, అడ్డొచ్చిన వాళ్లను మూసీలో బొందపెడతా’ అంటూ సోయి తప్పి మాట్లాడుతున్నారు. అయినా అధికారంలో ఉన్నవాళ్లు విగ్రహాలు ప్రతిష్ఠిస్తే అడుకునేవారెవ్వరు? అడ్డుకుంటే మాత్రం మీరు ఆగిపోతారా? పోలీసులతో అణచివేయరా? తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన రోశయ్య విగ్రహాన్ని పెడితే ఎవరైనా ఆపారా?
సచివాలయం ముందు, తెలంగాణ అస్తిత్వ పతాక అయిన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట తెలంగాణ అంటే ఏమిటో కూడా తెలియకుండానే స్వర్గస్థుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎవరు ఆపారు? విగ్రహం అడ్డుకుంటే బొంద పెడతాను అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు, ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు? ఈ రకమైన చీలిక రాజకీయాలు చేయడం ప్రత్యర్థుల మీద బురదజల్లడమే. నీచ రాజకీయాలు ఎక్కువకాలం అనుకూల ఫలితాలనివ్వవు. ఎక్కడో ఒక చోట బోల్తా పడక తప్పదు. ఇది గుర్తుంచుకొని రేవంత్ మసులుకుంటే ఆయనకే మంచిది.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్