ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా చిక్కిన నేత కాంగ్రెస్ ప్రచార సభల్లో మాయమాటలతో యువకుల్లో భావోద్వేగాన్ని బాగా రెచ్చగొట్టి తిమ్మిని బమ్మి చేసైనా అధికారాన్ని పొందాలని తపన పడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్లను దొంగలని, మోసకారులని, సన్నాసులని నోటికొచ్చిన కారుకూతలు కూస్తున్నాడు. కేసీఆర్‌ను సైతం ముక్కుపొడుగు వాడని, నేలకు రాసినా తప్పులేదని అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదాలతో పేలుతున్నాడు. ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడుతూ పబ్బం గడుపుతున్నాడు.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించడం లేదని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించడం లేదని మాత్రమే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్లను సన్నాసులు అన్నారు. అధికారం కోసం కాదు. అదీ తేడా. అందుకే ఈ సన్నాసిని ఎవరూ నమ్మవద్దు.
మోతీలాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేశాడని, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేశారని, సోనియాగాంధీ ప్రధాని పదవిని సైతం త్యాగం చేశారని పదే పదే వల్లిస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడికి టీడీపీలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా? వచ్చుంటది. తాను ఊసరవెల్లి కదా? ఇక నిజాలు చూస్తే స్వాతంత్య్ర పోరాటంలో మోతీలాల్ నెహ్రూ మితవాది. బ్రిటిష్‌వారికి ఊడిగం చేస్తే స్వాతంత్య్రం వస్తుందని నమ్మినవాడు. తొలి ప్రధాని నెహ్రూ అయితే మొదటి ప్రణాళికలో పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రణాళికలో వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వ్యవసాయరంగానికి మన దేశంలో టేక్ ఆఫ్ స్టేజీ రాలేదు. ఇప్పటికీ పప్పుధాన్యాల కోసం, నూనెల కోసం ఇతర దేశాల పైన ఆధారపడిన స్థితి. మరొకవైపు వ్యవసాయరంగానికి కావలసిన ఇన్పుట్స్ పారిశ్రామిక రంగం అందించడం లేదు. అటు పారిశ్రామిక రంగానికి కావలసిన ఇన్పుట్స్ వ్యవసాయ రంగం అందించడం లేదు. దీనినే లింకేజీలు తెగిపోవడమంటారు. వర్తక నిబంధనలు చూస్తే ఈ దేశంలో పారిశ్రామిక రంగానికి వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని చొక్కారావు కమిటీ అభిప్రాయపడ్డది. ఇది కాంగ్రెస్ ఆర్థిక విధానం కాదా?
1975లో దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ కాదా? ఎందరో నేతలను జైల్లో పెట్టింది కాంగ్రెస్ కాదా? ప్రతిపక్షాలను మింగి వేయాలని ప్రయత్నించింది కాంగ్రెస్ కాదా? 1969లో అధికారం కోసం తెలంగాణ ఉద్యమంపైన నీళ్లు చల్లింది కాంగ్రెస్ నేతలు కాదా? పంజాబ్‌లో అధికారం కోసం బింద్రన్‌వాలే నాయకత్వంలో ఉగ్రవాద మూకలను పెంచిపోషించింది కాంగ్రెస్ కాదా? ఆ మూకలే ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నాయి. ఇది తెలియని ఓటర్లున్నారా? శ్రీలంకలో జరిగిన ఊచకోతకు ప్రతీకారంగా తమిళ ఈలం లిబరేషన్ ఫ్రంట్ (ఎల్టీటీఈ) రాజీవ్‌గాంధీ ప్రాణాలను బలిగొన్నది.
21వ శతాబ్దంలోకి ఈ దేశాన్ని తీసుకువెళ్లాలని ఇతర దేశాల నుంచి నాసిరకం, రెండవరకం యంత్రాలు దిగుమతి చేసుకొని వాటితో ఉత్పత్తి చేసిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేక అప్పులు పెరిగిపోయి అప్పులు పుట్టని స్థితి వచ్చింది మనకు. లండన్‌లో 29 టన్నుల బంగారాన్ని కుదవబెట్టింది కాంగ్రెస్ కాదా? అంతర్జాతీయ మార్కెట్లో బహిరంగంగా రూపాయి విలువను తగ్గించుకున్నది కాంగ్రెస్ కాదా? ఇలా ఎన్నో ఉదంతాలు. అందుకే గారడి మాటల వలలో పడి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఇప్పటికీ రాహుల్‌గాంధీకి ఇల్లు లేదట. ఎంత గారడి ఇది! కానీ హెరాల్డ్ పత్రిక కేసులో రాజీవ్‌గాంధీ ఇప్పటికీ ముద్దాయిగా ఉన్నాడు. సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా పైన కూడా కేసులున్నాయి. అసలు కుంభకోణాలకు పునాది వేసిందే కాంగ్రెస్.
ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు. తన రాజ్యం బాగుండాలంటే రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల గతం, వర్తమానం, భవిష్యత్తు గుర్తించాలి. లేకపోతే తన గోతిని తానే తవ్వుకున్నవారవుతారు. కొంతమంది పొద్దాక ఎదుటివాళ్లను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు. చెప్పంగ చెప్పంగా అబద్ధాలు నిజమవుతాయని. నిజాలు అబద్ధాలు అవుతాయని. దీన్ని ఓటర్ రాజు నమ్మితే ఖతమే మరి. కొంతమంది నాయకులు కాళ్లకు బలపం కట్టుకొని మరీ తిరుగుతూ పొద్దున్న లేస్తే పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు.
ఏమిటిది? సీమాంధ్ర గుప్పెట్లో బక్కచిక్కిన తెలంగాణ కోసం ఏనాడైనా వీళ్లు కాలుకి బలపం కట్టారా? కానీ వారి గురివింద చందం తెలంగాణ ప్రజలకు తెలుసు. నాడు అస్తిత్వం కోసం పోరాడి అమరత్వానికి సైతం వెనుకాడని తెలంగాణ.. నేడు అభ్యుదయ పథంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. రైతు సంక్షేమ రాష్ట్రమని దేశంలో కీర్తి గడిచింది. ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో అనేక జాతీయ ర్యాంకులు పొంది దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. తెలంగాణ అభివృద్ధి మాడల్‌ను వివరించమని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నేతలను పిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. ఈనగాచి నక్కలు పాలు చేయొద్దు.
దొంగల చేతికి అధికార దండం ఇస్తే ప్రజలకు మిగిలేది ఖాళీ చిప్ప మాత్రమే. పవిత్రమైన ఓటు పుష్పాన్ని మహనీయులకు మాత్రమే సమర్పించాలి. అప్పుడే ఆ పుష్పానికి విలువ. అది మన అభివృద్ధికి పునాది. ఈ మానవ రూపంలోని రాబందులకు ఓటు వేస్తే గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారు. అందుకే ఓటరు మహాశయులారా! ఏడు దశాబ్దాలుగా ఏ ప్రధాని సైతం, ఏ ముఖ్యమంత్రి సైతం ప్రజానాడి ఇంతగా పట్టలేదు. వారి బాధలను గమనించలేదు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అన్నం పెట్టాడు. ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. అక్కున చేర్చుకున్నాడు భాషకు, యాసకు ప్రాణం పోశాడు. ఎంతమంది ఈతి బాధలో తీర్చి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచాడు. మరి ఇప్పుడు ఆయన్ను మనం అక్కున చేర్చుకోవాలి.
ఇది ఉన్న ఇల్లు, తిన్నరేవు మరవని తెలంగాణ ప్రజల సంస్కృతి. అప్పుడే వివిధ వర్గాలు చేసిన పాలాభిషేకానికి అర్థం. అభిషేకం మహనీయులకు మాత్రమే జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చాలని ఎన్నోరకాల అభిషేకాలు జనం మహనీయులకు మాత్రమే చేస్తారు. మనం కేసీఆర్‌కు ఓట్లతో అభిషేకం చేద్దాం. తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం పడిన గోస అంతా ఇంతా కాదు. అదో పీడన, నరకయాతన. దానినుంచి బయటపడేసిన మహనీయుడు కేసీఆర్. ఇదొక నామవాచకం మాత్రమే కాదు. ఉద్యమ క్రియాపదం. ఆయన సామాన్యుడే. ఆయన జీవన గమనం, నిర్వర్తించిన కార్యం మహోన్నతం, ప్రేరణాత్మకం, అసామాన్యం. అందుకే యువకులారా, మహిళలారా! రెచ్చగొట్టేవారి భావోద్వేగాలకు బలికాకండి. మరొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చుకోండి.
పొందూరు ప్రభాకరరావు
90106 31727