ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జెడ్పీటీసీ నుంచి సీఎం అంటూ మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్‌లో నిర్వహించిన సభ తన రాజకీయ ప్రయాణం, ప్రజాసేవ, అనుభవాలను ప్రజలతో పంచుకోవడానికా? లేక ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికా? ఆయన తన రాజకీయ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొంటే చెప్పుకోవడానికి ఎన్నో అనుభవాలు ఉంటాయి. తొలిసారిగా జెడ్పీటీసీగా ఎన్నికై గ్రామీణ ప్రజల మధ్య పనిచేసిన రోజులు, ఆ అనుభవం నేడు ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఎలా ఉపయోగపడుతున్నదో వివరించే అవకాశం ఉండే! ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను నేర్చుకున్న పాఠాలు, మల్కాజిగిరి ఎంపీగా గ్రామీణపట్టణ ప్రజల సమస్యల మధ్య తేడాలను అర్థం చేసుకున్న విధానం వంటి అంశాలు ఏమైనా ఉంటే, అవి ప్రజలకు చెప్పాల్సింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నాయకత్వంలో పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తాను ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులు, ఆ పార్టీ నుంచి మారడానికి దారితీసిన కారణాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉండె. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గాంధీ కుటుంబ నాయకత్వంలో పనిచేసిన అనుభవాలు, పార్టీ తనపై ఉంచిన విశ్వాసం, ముఖ్యమంత్రి పదవికి చేరుకున్న రాజకీయ ప్రయాణం వంటి అంశాలు కూడా ఈ సభలో ప్రధానంగా ఉండాల్సినవే. అయితే, ఆ సభలో ప్రధానంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే రాజకీయ పిలుపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు బీఆర్ఎస్పై విమర్శలకే పరిమితమైంది.
ఇక్కడ మరో పోలిక కూడా ముందుకు వస్తున్నది. కేసీఆర్ దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహించిన నేత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధనకు నాయకత్వం వహించిన వ్యక్తిగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తనకంటూ రాజకీయ చరిత్రను నిర్మించుకున్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో నీరు, విద్యుత్తు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, విద్య, ఆరోగ్యం తదితర అనేక రంగాల్లో రాష్ట్రం విశేషమైన అభివృద్ధి సాధించింది. కేసీఆర్ రాజకీయ ప్రయాణం, ప్రజాసేవ గురించి చర్చించదగిన అంశాలు అనేకం ఉన్నాయి. అయితే తనకన్నా వయసులో పెద్ద, రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న కేసీఆర్ మీద ఆ ప్రత్యేక వేదిక మీద రేవంత్‌రెడ్డి విమర్శించడంతో సభ పెట్టింది ఎందుకు? ప్రసంగించింది ఏమిటి? వాస్తవానికి ఈ సభ దారితప్పిందనే చెప్పకతప్పదు.
విజయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకమైన విజయం షార్ట్‌కట్స్‌ను అనుసరించడం ద్వారా వస్తుంది. అలాంటి విజయం అధికారం, పదవి ఇవ్వవచ్చు, కానీ అది ఎక్కువకాలం నిలువదు. ఏదో ఒకరోజు అంతరించిపోతుంది. దీనికి ఉదాహరణ రేవంత్‌రెడ్డి. మరో రకమైన విజయం నిజాయితీ, అంకితభావం, కష్టపడి పనిచేయడం, నిబద్ధత ద్వారా వస్తుంది. అలాంటి విజయం మంచి ఫలితాలను ఇస్తుంది, సుదీర్ఘకాలం నిలుస్తుంది, ప్రజల్లో గుర్తింపు పొందుతుంది. ఇందుకు ఉదాహరణ కేసీఆర్.
రేవంత్‌రెడ్డికి ‘చెప్పుకోవడానికి చరిత్ర లేదు.. ఏదో సాధించిన సత్తా లేదు’. అందుకే రాజకీయంగా గొప్ప చరిత్ర ఉన్న కేసీఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఓటుకు నోటు కేసే. చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించిన నిందితుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. కేసీఆర్ హయాంలో దేశంలో నంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ, రేవంత్ పాలనలో అత్యంత దయనీయ పరిస్థితికి దిగజారింది. రేవంత్‌రెడ్డి తాను ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకుడిననే విషయాన్ని మరిచిపోతున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల రిమోట్ ఢిల్లీలోనే ఉన్నదనే విషయం ఆయన 72 సార్లు ఢిల్లీకి వెళ్లిన దాన్నిబట్టే స్పష్టమవుతున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో తనను తాను అత్యున్నత నాయకుడిగా ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేస్తూ, తన చుట్టూ తానే హైప్ సృష్టించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. అయితే కాంగ్రెస్‌లో ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి, దూరం పెట్టిన నాయకులూ ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో సుచేతా కృపలానీ, ఎంఎస్ కృష్ణ, కమల్‌నాథ్, భూపేష్ భగేల్, పృథ్వీరాజ్ చౌహాన్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అజిత్ జోగి, అమర్‌సింగ్ చౌదరి, జగదాంబికా పాల్, సతీష్ ప్రసాద్ సింగ్, గులామ్ నబీ ఆజాద్ ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే కేంద్ర మంత్రులుగా లేదా ఆ పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
స్వీయ ప్రచారం, వ్యక్తిగత హైప్‌తోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం లభిస్తుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రేవంత్‌రెడ్డి మిడ్జిల్ సభలో తన రాజకీయ ప్రస్థానం, అనుభవాలు, భావోద్వేగాలు, సాధించిన మంచి లేదా చెడు గురించి ఒక్కముక్క కూడా చెప్పలేకపోయారు.
ఎందుకంటే చెప్పుకోదగ్గ రాజకీయ ఘట్టాలు తన జీవితంలో లేకపోవడంతో, కేసీఆర్‌ను విమర్శించడానికే రేవంత్ పరిమితమైనట్టు కనిపించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమే. అయితే, ఒక నాయకుడి జీవిత ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భాలు ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితం కాకుండా, ఆ నాయకుడి వ్యక్తిత్వం, అనుభవం, ప్రజాసేవ, పాలనా దృక్పథాన్ని ప్రతిబింబించే వేదికలుగా నిలిస్తే వాటికి మరింత విలువ ఉంటుంది!
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా మాజీ చైర్మన్)
జీవీ రామకృష్ణారావు 9866767777