Telangana | సమాజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషిచేసే మహనీయుల ప్రయత్నాలకు ఆటంకం కలిగించేవారు అడుగడుగునా ఉంటారు. వారిపై దుమ్మెత్తిపోసేవారూ ఉంటారు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరికిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది. కారల్‌మార్క్స్ , లెనిన్, స్టాలిన్ లాంటి మహనీయులపై కూడా కొందరు దుష్ప్రచారం చేశారు. అలా దుష్ప్రచారం చేసినవారే కాలగర్భంలో కలిసిపోగా.. ఆ మహనీయులు మాత్రం నేటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. ఈ వాస్తవాన్ని కొంతమంది, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి లాంటి గాలివాటం ముఖ్యమంత్రులు అస్సలు తెలుసుకోలేరు. కేసీఆర్‌పై, గత బీఆర్ఎస్ సర్కార్‌పై దుష్ప్రచారం చేస్తూ, రోత మాటలు మాట్లాడుతున్న రేవంత్.. కేసీఆర్ గొప్పతనాన్ని, ఆయన చేసిన మంచి పనులను ఎప్పటికీ గ్రహించలేరు.
గాలివాటమని ఎందుకు అంటున్నానంటే.. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌కు పెట్టుబడి పెట్టి మరీ తెలంగాణలో పార్టీని నడిపించే వారికోసం వెతుకుతున్న సోనియాగాంధీకి కొత్తగా పార్టీలో చేరిన, ఆశావహుడైన రేవంత్‌రెడ్డి కనిపించారు. అంతే, ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షున్ని చేసేశారు. అదే సమయంలో తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ర్టాలకూ విస్తరించి తనకు, తన పార్టీ బీజేపీకి సవాల్ విసురుతున్న కేసీఆర్‌పై ప్రధాని మోదీ కక్ష పెంచుకున్నారు. అందుకే తెలంగాణలో తన పార్టీ ఓడిపోయినా ఫర్వాలేదు గానీ, రేవంత్‌ను గెలిపించాలనే లక్ష్యంతో ఆయన కేసీఆర్‌ను దెబ్బకొట్టారు. ఇలాంటి పరిస్థితులు దాపురిస్తేనే గదా, మంత్రి కూడా కాని రేవంత్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని దేవుడు తనకిచ్చిన సదవకాశంగా భావించి సద్వినియోగం చేసుకునే దిశగా కాకుండా, చరిత్ర చెత్తబుట్టలో పడిన వదరుబోతు నేతల బాటన పరుగులు పెడుతున్నారు పాపం రేవంత్.
అలాగే ప్రాణాలకు తెగించి మరీ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే గాక, దశాబ్దంలోనే తెలంగాణను భారతాగ్ర రాష్ర్టాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తున్న రేవంత్‌ను తెలంగాణ ప్రజలే కాదు, ఇరుగుపొరుగు రాష్ర్టాలవారూ ఛీత్కరిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించలేకపోవడం నిజంగా ఆయన దురదృష్టమే. సర్వోత్తమ సచివాలయాన్ని నిర్మించి, దానికి రాజ్యాంగకర్త అంబేద్కర్ పేరు పెట్టడం, దాని ముందు సమున్నతమైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడమే కేసీఆర్ ఔన్నత్యానికి, రాజనీతిజ్ఞతకు, మేధోసంపత్తికి నిలువెత్తు నిదర్శనాలు. సచివాలయం ముంగిట సురుచిర, సుందర తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణే కేసీఆర్ తదుపరి లక్ష్యం. అక్కడ స్థల కేటాయింపే అందుకు నిదర్శనం.
అంతేగాని, అక్కడ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడమన్నది ఏ కోణంలో చూసినా అసందర్భం, అహేతుకం. రాజీవ్‌గాంధీ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారన్నది వాస్తవం. ఆయన చిరస్మరణీయుడే. కానీ, రాజీవ్ విగ్రహ స్థాపనకు, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకో, హితానికో సంబంధం ఉండాలి కదా?
ఈ విషయంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇలా ఉంది రేవంత్ జీ. అధిష్ఠానం మెప్పు కోసం గాక, రాజీవ్‌గాంధీపై మీకు అవ్యాజమైన ప్రేమ ఉండి ఉంటే, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుకు సోనియాగాంధీ కుటుంబం పట్ల కృతజ్ఞతతో మీ సొంత నిధులతోనో లేదా మీలాగే కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత కలిగిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల విరాళాలతోనో తెలంగాణ ప్రగతికి తోడ్పడే వైద్య కళాశాల, యూనివర్సిటీ లాంటి కట్టడం నిర్మించండి. అందులో మీ అభిమాన రాజీవ్‌గాంధీ సుందర విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సోనియాగాంధీతో ఆవిష్కరింపజేయండి. అప్పుడు మిమ్మల్ని తప్పుబట్టే హక్కు ప్రజలకు గాని, పార్టీలకు గాని ఉండదు గాక ఉండదు. అంతేకాదు, తద్వారా తెలంగాణ ప్రజల హృదయాల్లో మీదంటూ ఓ ముద్ర వేసుకోగలుగుతారు.
అంతేకానీ, ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాధనంతో నిర్మించుకున్న సచివాలయంలో అధికార బలంతో రాజీవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సబబు కాదు. అది ఎలా ఉంటుందంటే?.. ఎన్టీఆర్ శ్రమించి నిర్మించుకున్న టీడీపీలో చంద్రబాబు దూరి దాన్ని సొంతం చేసుకున్నట్టు, చీమలు కష్టపడి నిర్మించుకున్న పుట్టలో సర్పం దూరి దాన్ని సొంతం చేసుకున్నట్టు ఉంటుంది. మీ శ్రేయోభిలాషులు సహా మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు రేవంత్ జీ. తస్మాత్ జాగ్రత్త!
-పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889