ప్రభుత్వంలో ఉద్యోగులూ భాగం. ప్రభుత్వాల విధానాలను అమలు చేయడంలో, సకాలంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారథిలా పనిచేస్తూ ఇరుపక్షాలను సమన్వయం చేస్తారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. సర్వీస్‌లో ఉన్నప్పుడే కాదు, పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వాలు వారి యోగక్షేమాలు చూడటం ఒక రకంగా ఉద్యోగుల సేవలకు గుర్తింపు, గౌరవం లాంటిది. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలు అవసరమైన చోట్ల వాడుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానం బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. తమ వద్ద పని చేసిన ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 1881లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1972లో భారత ప్రభుత్వం పెన్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగి జీతంలో సగం మొత్తానికి, అమలులో ఉన్న డీఏ కలిపి పెన్షన్‌గా చెల్లించాలని నిర్ణయించారు. అంతేకాక సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఉన్నట్టే హెల్త్ కార్డు లాంటి సౌకర్యం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఉంటుంది. ఇవన్నీ ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడి సాధించుకున్న సౌకర్యాలు.
రాను రాను ఉద్యోగులకు అందుతున్న సౌకర్యాల పట్ల పాలకులకు కన్ను కుట్టింది. బడ్జెట్‌పై భారంగా భావించి నెమ్మదిగా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు కోత పెట్టడం ప్రారంభించారు. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ, కొత్త లేదా జాతీయ పెన్షన్ విధానాన్ని నాటి వాజపేయి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగుల జీతం నుంచి 10 శాతం మినహాయించి, దానికి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం జోడిస్తుంది. ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి, ఉద్యోగులు రిటైర్ అయ్యాక తిరిగి చెల్లిస్తారు. దీనికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకమని నామకరణం చేశారు. మొదట్లో కొన్ని రాష్ర్టాలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. కానీ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలూ దీన్ని అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో ఉద్యోగుల్లో నూతన పెన్షన్ విధానం పట్ల వ్యతిరేకత ప్రారంభమై, ఉద్యమానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలకు అదొక ఎన్నికల వాగ్దానంగా మారిపోయింది. తాము అధికారంలోకి రాగానే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇస్తూ, ఆ తర్వాత దాటవేస్తున్నాయి.
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జాతీయ స్థాయిలోనూ ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో బీజేపీనేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లపై మరో పిడుగు వేయడానికి సిద్ధమైంది. ఫైనాన్స్ చట్టం-2025 ద్వారా కొత్త నిబంధనలకు తెరదీసింది.
కొత్తగా రిటైర్ అయ్యేవారికి ఈ చట్టం ద్వారా డీఏ, పే రివిజన్ వంటి సౌకర్యాలు వర్తించవు. అంటే వారికి భవిష్యత్తులో ఏ రకమైన పెరుగుదల ఉండదు. ఒకపక్క జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతుండగా, కేంద్రం ఇలాంటి ఉద్యోగ వ్యతిరేక చట్టాలు తయారు చేయడం దారుణం. వయసు మీరుతున్నప్పుడు వచ్చే దవాఖాన ఖర్చులను ఎలా భరించాలి? నిత్యావసర వస్తువుల రేట్లు నియంత్రించలేని ప్రభుత్వాలు పెన్షనర్లకు మాత్రం వారి సౌకర్యాల్లో కోత విధించడానికి చూస్తుండటం శోచనీయం.
మరోవైపు తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వం గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు అన్నింటిని పెండింగ్‌లో పెట్టి పెన్షన్ మాత్రమే చెల్లిస్తూ వస్తున్నది. పైగా పెన్షనర్ల కోసం రూ.9,000 కోట్లు ఖర్చవుతుందని ప్రచారం చేయ డం దారుణం. మెడికల్ బిల్లులు ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్నప్పుడు చేసిన ఖర్చు మాత్రమే. అది తిరిగి చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. సరెండర్ లీవ్ కేవలం 10 నెలల జీతం లేదా అంతకన్నా తక్కువ. ఇది కూడా పెన్షన్ రూల్స్‌లో భాగమే. గ్రాట్యూటీ మాత్రమే విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించే సొమ్ము. అది వారి సేవకు గుర్తింపుగా, కృతజ్ఞతగా తరతరాలుగా ఇస్తున్న సొమ్ము. పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ప్రతినెల రూ.500 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నప్పటికీ, ఇంతవరకు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక డీఏ వచ్చే ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఇదంతా ఉద్యోగులు, పెన్షనర్ల వ్యతిరేక వైఖరేనని స్పష్టమవుతున్నది. దీనికి ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
ఒకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు) జీవితాంతం పెన్షన్ వస్తుంది. వారికి రాజకీయ పింఛను ఒక హక్కుగా చేశారు. కానీ, 30 ఏండ్లు ప్రజా సేవలోనే గడిపి, రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రం పెన్షన్‌లో ఎదుగుదల లేకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అదే సొమ్ముతో జీవితం గడపాలని చట్టం చేయడం సహజ ధర్మ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు ఉద్యమిస్తుంటే, వారికి పెన్షన్లు లేకుండా, పెన్షన్లలో సైతం పెరుగుదల లేకుండా చేసే కుట్రలకు తెరలేపడం దారుణం. ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టవలసిన తరుణమిదే. లేదంటే భవిష్యత్తు తరాలకు సర్వీస్ పెన్షన్ అంటే ఏమిటో తెలియని రోజులు దాపురిస్తాయి.
-శ్రీశ్రీ కుమార్
94403 54092