దివాంధులైన మేధావులని అంటున్నప్పుడు వారెవరైనదీ ప్రత్యేకంగా పేర్లు రాయనక్కరలేదు. వారి పేర్లు తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయాయి. నల్లనివాడు కమల నయనంబులవాడు అన్నట్లుగానన్నమాట. ఇప్పుడు సూటిగా విషయంలోకి వద్దాం. ప్రపంచ ప్రసిద్ధమైన జర్నల్ ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ (ఈపీడబ్ల్యూ) ఇటీవల దేశంలోని వివిధ రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులపై, అభివృద్ధిపై ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది.
దానిని ఈ మేధావులు తప్పక చూసే ఉంటారు. అది వారికి ఆరాధనీయమైన జర్నల్ గనుక చూడకపోయే అవకాశమే లేదు. అందులో తమ వ్యాసాలు వస్తే ఎంతో గొప్ప అని వారు తహతహలాడుతుంటారు కూడా. అటువంటి జర్నల్‌లో, కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ అభివృద్ధి గురించి ఏమని రాశారు? వీరు ఆ ప్రభుత్వంపై కక్ష గట్టి, నిరంతరం దుమ్మెత్తి పోసినట్టుగానా, లేక అందుకు భిన్నంగానా?
బీఆర్ఎస్ పాలనలో తప్పులు ఎన్నలేమని కాదు. మేధావులు మంచి చెడులు రెండింటినీ మాట్లాడాలి. వారి దృష్టి సమాజ శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి కావాలి గనుక. కానీ, పదేండ్లలో ఎన్నడూ, ఏ విషయంలోనూ వారట్లా వ్యవహరించలేదు. బీఆర్ఎస్పై,కేసీఆర్‌పై కక్షగట్టి దివాంధులుగా మారారు.
వాస్తవానికి అప్పటి ప్రభుత్వపు అభివృద్ధి విజయాలు, ఆర్థిక విజయాలు, సంక్షేమ విజయాల గురించి ప్రభుత్వం స్వయంగా చెప్పుకున్న వాటిని స్వోత్కర్ష అంటూ తోసిపుచ్చజూసినా, తరచుగా ఎన్నెన్నో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు, ఈ దివాంధ మేధావులే మెచ్చే జాతీయస్థాయి నిపుణులు, మరొక వైపు అంతర్జాతీయ సంస్థలు, దేశీయ, అంతర్దేశీయ పారిశ్రామిక సంస్థలు గుర్తిస్తూనే ఉండటం తెలియనిది కాదు. కండ్లు తెరిచి ఓపెన్ మైండ్‌తో ఉంటే ఇక్కడి మేధావులు కూడా చూడగలదే. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా పేరుబడిన తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రపు ఘనమైన పరిపాలనకు దూరమైతే ఏమైపోగలదోనని ఘనత వహించిన ఆర్థిక శాస్త్రవేత్త అయిన అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సహా తెలంగాణ ‘శ్రేయోభిలాషులు’ పలువురు చింతాక్రాంతులు కావటం తెలిసిందే. ఉమ్మడి పాలక మహాశయులైతే గుడ్లురుముతూ ఎన్నెన్నో భయాలు పెట్టారు. ఆ తరహా మాటలను, ప్రచారాలను జాతీయంగా, అంతర్జాతీయంగా ఎందరో నమ్మారు కూడా.
కానీ, ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుండటం, వివిధ రంగాలలో అభివృద్ధి అంతా కండ్ల ఎదుటనే కనిపిస్తుండటంతో అదే మన్మోహన్‌సింగ్‌తో సహా అందరూ నిరుత్తరులు కావటమో, ప్రశంసించటమో చూశాము. ఆయా గణాంకాలు, గ్రాఫ్‌లు ఉమ్మడి రాష్ట్ర కాలంతో, దేశంలోని ఇతర రాష్ర్టాలతో, 2000వ సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలతో పోలికలూ అందుకు భిన్నంగా మాట్లాడలేని పరిస్థితిని సృష్టించాయి. అయితే ఇదంతా కండ్లూ, చెవులూ తెరుచుకొని ఉండిన ఇతరుల మాట. గమనార్హమైన విషయమేమంటే, ఆ ఇతరులలో తెలంగాణను నానా విధాలుగా శపించిన సీమాంధ్ర పాలకవర్గాలు, మేధావి వర్గాలు, కమ్యూనిస్టు కామ్రేడ్ మహాశయులు సైతం ఉన్నారు. వారు ఒకవేళ పైకి మాట్లాడకున్నా మనసులో గుర్తించారు. ఆ ప్రాంతపు సామాన్య ప్రజల సంగతి వేరు. వారు తెలంగాణ విడిపోతే ఎట్లా అని రకరకాల భయాలు పెట్టుకున్నారు గానీ ఈ ప్రాంతాన్ని ద్వేషించటం గాని, దీనిని కబళించటం ఎట్లాగా అని కుయుక్తులు పన్నటం గాని చేయలేదు. తెలంగాణ తాము ఊహించనిరీతిలో అభివృద్ధి చెందుతుండటం చూసి మెచ్చుకున్నారు, సంతోషించారు. తాము తెలంగాణకు వచ్చివేయాలని, లేదా తమ రాష్ట్రం కూడా తెలంగాణ వలె అభివృద్ధి చెందాలని ఆలోచనలు చేశారు.
ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లు వికారమైన రీతిలో ప్రవర్తించింది ఎవరు? సమాధానం తిరిగి అదే. ఇప్పుడు ఈపీడబ్ల్యూ వ్యాసానికి ఈ మేధావి బృందాల స్పందన ఏమిటో తెలియదు. అక్టోబర్ 19వ తేదీతో వెలువడిన ఆ వ్యాస రచయితలు గోవింద్ భట్టాచార్జీ, మేఘనా అగర్వాల్ తక్కువ స్థాయి వారేమీ కాదు. భట్టాచార్జీ కాగ్ మాజీ డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని అరుణ్‌జైట్లీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. మేఘనా అగర్వాల్ కూడా అక్కడే. కనుక వారినెవరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా కావాలని రాశారనలేరు. పైగా వారి రచన అన్ని రాష్ర్టాల గురించిన విశ్లేషణ. అందులో భాగంగా తెలంగాణ విశేషాలు తేటతెల్లమయ్యాయి.
ఆ విశేషాలు ఏమిటో ముందు క్లుప్తంగా చూద్దాము. ఆ వ్యాసం శీర్షిక ‘ఏన్ ఇండెక్స్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్బై ఇండియన్ స్టేట్స్’. అందులో పేర్కొన్న దాని ప్రకారం, రుణ నిర్వహణలో దేశంలో ఒడిశాది మొదటిస్థానం కాగా, తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. వనరుల నిర్వహణలో గోవా, తెలంగాణలవి మొదటి రెండు స్థానాలు. తెలంగాణది వ్యయ నిర్వహణ సూచీలో 13వ స్థానం, సబ్సిడీల కోసం వ్యయంలో 5 కాగా, ఓవరాల్ ర్యాంక్ 9. ఈ విశ్లేషణ కోసం దేశంలోని 28 రాష్ర్టాలను 18 జనరల్ రాష్ర్టాలుగా, 10 ప్రత్యేక కేటగిరీ రాష్ర్టాలుగా వర్గీకరించారు. జనరల్ రాష్ర్టాలలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, హర్యానా, పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటివాటిని మించిపోయి తెలంగాణ ఈ ర్యాంకులను సాధించింది.
నిజానికి బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఈ విధంగా ఆర్థిక పరిపుష్ఠిని పొందినట్లు ఈపీడబ్ల్యూ వ్యాసానికి ముందుకాలంలోనూ కాగ్‌తో పాటు రిజర్వ్ బ్యాంక్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి పేర్కొన్నాయి. అదంతా ఆయా సమయాలలో వార్తలలో వెలువడినటువంటిదే. అయినప్పటికీ అప్పులు అప్పులంటూ, అభివృద్ధి శూన్యమంటూ 365 రోజులూ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ప్రచారాలు చేయటం షరామాములు రాజకీయమని అర్థం చేసుకోవచ్చు. కానీ, మేధావులనబడే వారు కూడా అదే పని చేయటాన్ని ఎట్లా పరిగణించాలి?
బీఆర్ఎస్ పాలనలో తప్పులు ఎన్నలేమని కాదు. మేధావులు మంచి చెడులు రెండింటినీ మాట్లాడాలి. వారి దృష్టి సమాజ శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి కావాలి గనుక. కానీ, పదేండ్లలో ఎన్నడూ, ఏ విషయంలోనూ వారట్లా వ్యవహరించలేదు. బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై కక్షగట్టి దివాంధులుగా మారారు. అప్పటి పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి అయినా వారికి కనిపించలేదు. రాత్రింబవళ్లు చెడు-చెడు అన్నదే వారి ప్రచారమైపోయింది. చివరికి గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపే స్థాయికి పతనమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక దశాబ్దాల పాటు తెలంగాణను ఎట్లా దోపిడీ చేశాయో, ఎట్లా సీమాంధ్ర ధనిక వర్గాలకు తాకట్టు పెట్టాయో, తెలంగాణ ప్రజల వివిధ ఉద్యమాలను ఏ విధంగా అణచివేశాయో, నక్సలైట్ల పేరిట వేలాది మంది యువతీ యువకులను, ఇతర తరగతుల ప్రజలను ఎట్లా కాల్చి చంపాయో అన్నీ మరిచిపోయి మరీ జెండాలు ఊపారు. సీమాంధ్ర ధనిక, పాలకవర్గాల మోచేతి నీళ్లను దశాబ్దాల పాటు తాగి తెలంగాణను దగా చేసిన వారికి బానిసకొక బానిస అన్నట్లు మారారు.
తిరిగి ఇప్పుడు చేస్తున్నదేమిటి? కాంగ్రెస్ పాలనలో కండ్ల ఎదుట ఇన్నిన్ని వైఫల్యాలు, అన్యాయాలు, అణచివేతలు జరుగుతున్నా కిక్కురుమనరు. ఎక్కడైనా ప్రశ్నలు ఎదురైతే నేల చూపులు చూస్తారు. నూటొక్క సాకులు వెతుకుతారు. ఈ విధమైన నిన్నటి ప్రవర్తనను, ప్రస్తుత ప్రవర్తనను గమనించినపుడు, వీరిని ఈ రెండు ధోరణులలోనూ ఏవో స్వప్రయోజనాలు ఆశించినవారని ఎందుకు భావించకూడదు? దివాంధులని ఎందుకు పిలవరాదు? ఒకవిధంగా అది కూడా సరికాదు. ఎందుకంటే, గుడ్లగూబలకు దివాంధత్వం ప్రకృతిలో సహజమైన రీతిలో కలిగినటువంటిది. కానీ ఈ మేధావులు దివాంధత్వం వారు స్వప్రయోజనాలతో పాటు, మనకు తెలియని మరేవో కారణాలతో కావాలని తెచ్చి పెట్టుకున్నటువంటిది. అది ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యంలో, సమస్యల పరిష్కార వైఫల్యంలో, వివిధ వర్గాల ప్రజల నిరసనల అణచివేతలో, నిరంతరం అబద్ధాలూ బుకాయింపులతో విషయాలను దాటవేయటంలో కనిపిస్తున్నది. అయినప్పటికీ దివాంధ మేధావులు తమ గాఢ నిద్రలను నటిస్తూనే ఉన్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీ తమకు భిక్షగా లభించిన ఒక్క సీటుతో ఇంకా పరవశిస్తూనే ఉన్నది. మరొక కమ్యూనిస్టు పార్టీ అర్ధమనస్కపు కలవరింతలలో ఉన్నది. చివరగా మరొకసారి ఈ మేధావి మహాశయుల గురించి చెప్పుకోవాలంటే, వారు తాము నివసించే నగరాలలో గాని, గ్రామాలలో గాని ప్రజలను కలవక, ఓపెన్‌మైండ్‌తో మాట్లాడక, ఉష్ట్ర పక్షి జీవితాలలో ఆనందం పొందుతున్నారు.
-టంకశాల అశోక్