కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారన్న మాటలు రాజకీయ వేదికలపై ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ అనేది రాజకీయ లాభాల కోసం పుట్టిన భావోద్వేగమా? లేక దశాబ్దాలుగా అణచివేత, దోపిడీ, అవమానాలకు గురైన ప్రజల ఆత్మగౌరవం నుంచి పుట్టిన చైతన్యమా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
తెలంగాణ అనేది కేవలం భౌగోళిక పరిమితి కాదు. అది చరిత్రలో జరిగిన అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజల స్వరూపం. నిజాం నిరంకుశ పాలనలోనూ, జమీందారీ దోపిడీ కాలంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నేల అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఆ బాధకు ప్రతిఘటనగా పుట్టిందే తెలంగాణ సాయుధ పోరాటం. రైతు, కూలీ, గిరిజనులు, అణగారిన వర్గం- ఇలా అందరూ ఒక్కటై నిలిచిన కాలం అది. ఆ పోరాటం భావోద్వేగం కాదు, అది ప్రాణాలర్పించిన ప్రతిఘటన.
కాళోజీ హృదయం నుంచి వెలువడిన ఈ మాటలు ఆ కాలపు అగ్నిని ప్రతిబింబిస్తాయి.‘మన కొంపలార్సిన, మన స్త్రీల చెరచిన,మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె, కాలంబు రాగానే కాటేసి తీరాలె’
ఇది ద్వేషం కాదు, దోపిడీకి ఎదురు నిలిచిన ఆత్మగౌరవ గర్జన. ఇది హింసకు పిలుపు కాదు, మానవత్వం కోసం జరిగిన పోరాటం. ఆ చైతన్యమే కాలక్రమంలో మసకబారింది. కానీ, నివురు దాగిన నిప్పులా అది పూర్తిగా ఆరిపోలేదు. ఆ మౌనాన్ని చెదరగొట్టి, తెలంగాణ చరిత్రను తిరిగి ప్రజల ముందుకుతెచ్చిన నాయకుడు కే చంద్రశేఖర్‌రావు.
‘మరుగునపడిన తెలంగాణ చరిత్రను వెలికితీయడం మన బాధ్యత’ అన్న మాటతో కేసీఆర్ మొదలుపెట్టిన ప్రయాణం ఆ తర్వాతి కాలంలో ఒక
ఉద్యమంగా మారింది. తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా కాకుండా,వ్యవస్థాపితంగా వెనక్కి నెట్టబడిన ప్రాంతంగా ప్రజలు అర్థం
చేసుకునేలా చేసింది.
ఇక ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే, కేసీఆర్ చాలా రోజులుగా మౌనంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గౌరవించారు. అందుకే ఎక్కువగా విమర్శలు చేయలేదు. కానీ, ఇటీవల రెండేండ్ల మౌనాన్ని వీడి బయటకు వచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు- ఇలా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరిగితే అందరికంటే ముందుగా కేసీఆరే కొట్లాడతారు. అందుకే ఈసారి నీటి విపత్తును ఎదుర్కొందామని ఆయన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. పోరు సలిపేందుకు బరి గీశారు.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. అదేమిటంటే తెలంగాణ సెంటిమెంట్ కంటే తెలంగాణ అస్తిత్వం, హక్కులు, ప్రజల భవిష్యత్తు ముఖ్యమైనది. కీలకమైన ఈ అంశాల్లో ఎవరు, ఎక్కడ తప్పు చేసినా క్షమించేది లేదు. తెలంగాణ అంటే సెంటిమెంట్ కాదని, స్వాభిమాన రాజకీయ చైతన్యమని పేర్కొంటూ రాబోయే రోజుల్లో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మరో ఉద్యమం దిశగా నడిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారు. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ అదే రుజువైంది.
తెలంగాణ భాష, యాస, బతుకమ్మ, బోనా లు- ఇవన్నీ పండుగలు మాత్రమే కాదు; అవి తెలంగాణ గుర్తింపు, గర్వం, జీవన తత్వం. స్వరాష్ట్రం సిద్ధించకముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో, వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మెరుగుపడిందో అందరికీ తెలుసు. ఈ మార్పు చూసి నేడు ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడుతున్నాడు. ‘జై హింద్’ అన్న నినాదం ఎంతకాలం నిలుస్తుందో, ‘జై తెలంగాణ’ కూడా అంతే కాలం నిలుస్తుంది. ఇది సెంటిమెంట్ కాదు, స్వాభిమాన రాజకీయ చైతన్యం. కాళోజీ మాటల్లోనే ముగిద్దాం.. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం, ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతేస్తాం. ఇదే తెలంగాణ తత్వం, ఇదే తెలంగాణ ఆత్మ, ఇదే కేసీఆర్ నాయకత్వం.
జై తెలంగాణ! జై కేసీఆర్!!
(వ్యాసకర్త: బీఆర్ఎస్ అధ్యక్షుడు, దక్షిణాఫ్రికా)
-నాగరాజు గుర్రాల
+27765537388