ఇన్నేండ్లూ శిలగానే ఉన్న శిల్పం, ఇప్పుడు తనివితీరా నాట్యమాడుతున్నది. ఇక్కడి రాళ్లల్లో ఉన్న సప్తస్వరాలు ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్నాయి. తేలియాడే గుణంతో గోపురాన్ని నిలబెట్టిన ఇటుకలు, ఇప్పుడు నిజమైన ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాయి. దశాబ్దాలుగా గుర్తింపునకు నోచుకోక అడవికాచిన వెన్నెలైన ఆ ఆలయ సౌందర్యం, నేడు విశ్వ వినువీధులకేగి ఆనందపారవశ్యం పొందుతున్నది.
ఎనిమిది వందల ఏండ్లనాటి ఈ శిల్పకళా కోశం, ఏండ్లనాటి తన శోకాన్ని వదిలి విజయ దరహాసంతో వెలిగిపోతున్నది. స్వరాష్ట్రం తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, తొలిసారిగా ఈ నెల 18న ప్రపంచ వారసత్వ ఉత్సవాలను వైభవం గా జరుపుకొంటున్నది. ‘శిల్పం వర్ణం కృష్ణం, సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప’ పేరుతో వేడుకలకు ముస్తాబైంది. గతంలో ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరిగినా, యునెస్కో గుర్తింపు తర్వాత వేడుకల నిర్వహణ ఇదే తొలిసారి.
శిల్పి చేత నిర్మితమై.. శిల్పి పేరుతోనే ప్రసిద్ధిగాంచి.. శిల్ప కళా నైపుణ్యంతోనే విశ్వఖ్యాతిని గడించిన రామప్ప ఆలయం తెలంగాణకు తలమానికం. ‘నాట్యం నుంచి శిల్పం పుట్టిందా..! శిల్పం నుంచి నాట్యం పుట్టిందా..!’ అని ఆశ్చర్యపోయేంత గొప్ప సౌందర్యం ఇక్కడి శిల్పానిది. ఎందరో కవులు, కళాకారుల హృదయాలను కవితలుగా.. పాటలుగా ప్రవహింపజేసిన నేపథ్యం ఇక్కడి కళా నైపుణ్యానిది. ఈ ఆలయ సౌందర్యాన్ని.. శిల్ప లావణ్యాన్ని.. చూడ కనులు చాలవు! వర్ణించ భాష లేదంటే అతిశయోక్తికాదు!
రామప్ప ఆలయం ఒక్క శిల్పకళా శిఖరమే కాదు.. పేరిణి తాండవం, కోలాటం, ప్రేంఖణం, చిందు నృత్యాలను దాచిన దృశ్య పేటిక. సామాజిక చైతన్యానికి ప్రేరణనిచ్చే వేదిక. నీటి విశిష్ఠతను తెలిపే.. నీరే నాగరికతకు పునాది అని చాటే వారసత్వపు జాడ. పూలు, లతలు, హంసలు, ఏనుగులు, గుర్రాలు, మొసళ్లు, పక్షులు, ఇలా సకల చరాచర జీవ శిల్పాలతో నీటి ద్వారా అల్లుకునే జీవవైవిధ్య ప్రాముఖ్యాన్ని
వివరించే సాంస్కృతిక పూదోట.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని నిర్మించి 2023 మార్చి 31 నాటికి 810 ఏండ్లు పూర్తయ్యాయి. క్రీ.శ. 31-3-1213న నిర్మాణం పూర్తయినట్లుగా ఆలయ శాసనంలో ఉన్నది. నాడు కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఆలయం నిర్మించగా, నాటి ప్రఖ్యాత శిల్పి రామప్ప ఈ గుడిని మహాద్భుతమైన కళాఖండంగా మలిచాడు. కాకతీయుల సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం, అనేక దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నేటికీ సజీవ శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్నది. ఇక్కడ కొలువైన శివుడు రుద్రేశ్వరుడిగా, రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
నాడు శిల్పకళా విశ్వవిద్యాలయం..
పాలంపేట గ్రామం కాకతీయుల కాలంలో ప్రముఖ పట్టణంగా వెలుగొందింది. శిల్పకళకు ఈ ప్రాంతం విశ్వవిద్యాలయమై నిలిచింది. ఇక్కడ రామప్పతో పాటు మరో పది ఆలయాలున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని గుళ్ల రామప్ప అంటారు. ఇక్కడి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధి నుంచే పెద్దపెద్ద రాళ్లను తెచ్చి ఆలయాల నిర్మాణానికి వాడినట్లు తెలుస్తున్నది. ప్రధాన రామప్ప ఆలయం కల్యాణ మండపం, రెండు త్రికూటాలయాలతో కలిపి పదెకరాల్లో విస్తరించి ఉన్నది.
కాకతీయులే స్ఫూర్తి..
టెంపుల్, ట్యాంక్, టౌన్ (ఆలయం, తటాకం, పట్టణం).. ఇదీ కాకతీయుల గ్రామాభివృద్ధి ప్రణాళిక. ఒక ఊరు అభివృద్ధి చెందాలంటే అక్కడ నీటి వనరులుండాలి. ప్రజల్లో విజ్ఞాన, సాంస్కృతిక కాంతులు విరజిమ్మాలంటే ఆలయం ఉండాలి. ఈ నేపథ్యంలోనే పాలంపేటలో సరస్సు, రామప్ప ఆలయం నిర్మితమయ్యాయి. సరిగ్గా ఇవే ప్రణాళికలతో తెలంగాణ ప్రభుత్వం కూడా కాకతీయుల స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. చెరువులను పునరుద్ధరించి వ్యవసాయరంగానికి ఊతమిచ్చింది. తద్వారా ఈ రంగంతో ముడిపడి ఉన్న అన్ని వృత్తులు పురోగమించేలా చేసింది. ఆలయాల పునర్నిర్మాణంతో స్థానిక చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం కృషి వల్లే గుర్తింపు..
చారిత్రకంగా గొప్ప కళా సంపదతో ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. తెలంగాణ ఏర్పాటుతోనే రామప్పకు గుర్తింపు కోసం అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసి, ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపింది. కేంద్ర పురావస్తు శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలోని అంశాలతో యునెస్కో స్పందించింది. దీని అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కౌన్సెల్ ఆన్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ (ఐకోమాస్)తో రామప్పపై అధ్యయనం చేయించింది. 2019లో ఐకోమాస్ ప్రతినిధి బృందం రామప్పను సందర్శించింది.
2020 ఫిబ్రవరిలో చైనాలో జరగాల్సిన యునెస్కో సమావేశాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి రామప్పకు గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి నిత్యం విజ్ఞప్తులు వెళ్లాయి. రాష్ట్ర మ్రంతులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు. చివరికి 2021, జూలై 5న రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఇసుకపై ఆలయ నిర్మాణం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నాడు ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోకుండా ఉండటం వల్ల ఈ ఘనత సాధ్యమైంది.
– కనపర్తి రమేశ్
99498 58108